సీమ ఆలయాల్లో అద్భుతమైన శిల్ప సంపద

ABN , First Publish Date - 2021-02-26T07:35:49+05:30 IST

రాష్ట్రంలో ఇటీవల దేవతా విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో రాయలసీమలోని పలు ఆలయాలను సందర్శించినట్లు త్రిదండి చిన్న జీయర్‌ స్వామి పేర్కొన్నారు.

సీమ ఆలయాల్లో అద్భుతమైన శిల్ప సంపద
చిన్న జీయర్‌ స్వామికి స్వాగతం పలుకుతున్న వైవీ సుబ్బారెడ్డి, జవహర్‌రెడ్డి

త్రిదండి చిన్న జీయర్‌ స్వామి

తిరుచానూరు, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో ఇటీవల దేవతా విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో రాయలసీమలోని పలు ఆలయాలను సందర్శించినట్లు త్రిదండి చిన్న జీయర్‌ స్వామి పేర్కొన్నారు. తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని గురువారం రాత్రి ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. సీమలోని ఆలయాల్లో అద్భుతమైన శిల్ప సంపద, శక్తివంతమైన దేవతావిగ్రహాలు ఉన్నాయన్నారు. కొన్ని ఆలయాలకు సరైన ఆదరణ, ఆరాధన లేకపోవడం శోచనీయమన్నారు. ఆలయాలు సందర్శించాక అభిప్రాయాలు చెప్పాలని ఇదివరకే టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కోరారన్నారు. అందువల్ల తాను పర్యటించిన వివరాలు, సూచనలతో నివేదికను తయారుచేసి అందజేశామన్నారు. ప్రపంచంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు. ప్రస్తుతం కరోనా వ్యాధి మళ్లీ ప్రబలుతోందనే ఆందోళన మొదలైందన్నారు. ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీయర్‌కు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రి వేణుగోపాలకృష్ణ, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపుఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జూపల్లి రామేశ్వరరావు, శివకుమార్‌, వెంకటభాస్కర్‌రావు, సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి, డిప్యూటీఈవో ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు. 


తిరుమలలో త్రిదండి చిన్నజీయర్‌స్వామి

తిరుమల, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం త్రిదండి చిన్నజీయర్‌ స్వామి గురువారం తిరుమలకు వచ్చారు. రాత్రి 9.30 గంటలకు స్థానిక జీఎంఆర్‌ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. కాగా, చిన్నజీయర్‌స్వామి శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

Updated Date - 2021-02-26T07:35:49+05:30 IST