అధిపత్నులు

ABN , First Publish Date - 2021-03-08T06:49:15+05:30 IST

మహిళా లోకం కనుల పండువగా నిర్వహించుకునే రోజు ఇది. ‘ఆడపిల్ల మహాలక్ష్మి’ అన్న పదాన్ని వారు సుసంపన్నం చేస్తున్నారు. భువి నుంచి దివికి దూసుకుపోతున్నారు. కంప్యూటర్‌ యుగంలో కీర్తి గడిస్తున్నారు. ఏ పనినైనా నేర్పుగా, ఓర్పుగా, శ్రద్ధగా చేస్తూ సమాజంలో రాణిస్తున్నారు.

అధిపత్నులు

  • జిల్లాలో కీలక శాఖల్లో ముఖ్య అధికారులు మహిళలే 
  • 1075 పంచాయతీల్లో 599 మంది సర్పంచలు కూడా
  • 11,782 వార్డుల్లో 6,183 మంది సభ్యులు
  • నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా...

(ఆంధ్రజ్యోతి, కాకినాడ)

మహిళా లోకం కనుల పండువగా నిర్వహించుకునే రోజు ఇది. ‘ఆడపిల్ల మహాలక్ష్మి’ అన్న పదాన్ని వారు సుసంపన్నం చేస్తున్నారు. భువి నుంచి దివికి దూసుకుపోతున్నారు. కంప్యూటర్‌ యుగంలో కీర్తి గడిస్తున్నారు. ఏ పనినైనా నేర్పుగా, ఓర్పుగా, శ్రద్ధగా చేస్తూ సమాజంలో రాణిస్తున్నారు. ఒకవైపు ఇల్లాలిగా మరోవైపు ఉద్యోగిగా రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎన్నో సంఘర్షణలతో సతమతమవుతున్నా లక్ష్య సాధనలో తమకు తామే సాటి అని నిరూపిస్తున్నారు. నేడు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో మహిళా ప్రస్థానం మీకోసం... 

సుమారు దశాబ్దంన్నర నుంచీ జిల్లాలోని కీలక శాఖల్లో మహిళా అధికారులే ముఖ్య భూమిక పోషిస్తున్నారు. జి.రాజకుమారి, కీర్తి చేకూరి జాయింట్‌ కలెక్టర్లుగా విధి నిర్వహణలో మన్ననలు పొందుతున్నారు. రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌గా అనుపమ అంజలి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీగా జేఆర్‌ లక్ష్మీదేవి, బీసీ సంక్షేమ శాఖ డీడీగా కె.మయూరి ఉద్యోగ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారు.  వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి డాక్టర్‌ బి.సుబ్రహ్మణ్యశ్వేరి జోనల్‌ మలేరియా అధికారిగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాకు అధికారిగా ఉన్నారు. డి.పుష్పమణి, సివిల్‌ సప్లయిస్‌ జోనల్‌ మేనేజర్‌గా పనిచేస్తూ మహిళా, శిశు సంక్షేమ శాఖకు ఇన్‌చార్జి పీడీగా వున్నారు. తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్‌ కంట్రోలర్‌గా ఎన్‌ఎంఎస్‌ఎన్‌ మాధురి, మెప్మా పీడీగా కె.శ్రీరమణి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా డీఎస్‌ఎస్‌ సునీత, బీసీ కార్పొరేషన్‌ ఈడీగా సుబ్బలక్ష్మి పని చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఆశ, అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం, స్టాఫ్‌ నర్సులు, మిడ్డేమీల్‌ వర్కర్లు... ఇలా అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 రాజకీయాల్లోనూ పైచేయి 

ఇటీవల జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 1075 సర్పంచ్‌ పదవులకు 800మంది మహిళలు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. వివిధ రాజకీయ పార్టీల పరోక్ష మద్దతుతో 600 మంది బరిలో నిలిచారు. కానీ రాజకీయాలకతీతంగా, గ్రామాభివృద్ధే ధ్యేయంగా పోటీ చేసిన వారు 599 మంది సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. 11,782 వార్డుల నుంచి 6,183 మంది గెలిచారు. రాజకీయాల్లో తామేం తక్కువ కాదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.

Updated Date - 2021-03-08T06:49:15+05:30 IST