అత్యాచార ఘటనలపై మహిళా కమిషన్‌ సీరియస్‌

ABN , First Publish Date - 2020-07-08T09:42:43+05:30 IST

జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న అత్యాచార ఘటనలను రాష్ట్ర మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది.

అత్యాచార ఘటనలపై మహిళా కమిషన్‌ సీరియస్‌

బాధితులకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలకు ఆదేశం


పాడేరు, జూలై 7: జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న అత్యాచార ఘటనలను రాష్ట్ర మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. బాధిత బాలికలను ప్రభుత్వ పరంగా ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని, ఘటనలకు బాధ్యులైన వారికి కఠిన శిక్షపడేలా పోలీసు అధికారులు కోర్టుల్లో ఛార్జిషీట్‌లు దాఖలు చేయాలని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మంగళవారం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జి.మాడుగుల మండలం జన్నేరులో గిరిజన బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని పాడేరు డీఎస్‌పీని ఆదేశించడంతోపాటు బాధిత బాలికను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవోను ఆదేశించామన్నారు.


అలాగే ఎలమంచిలి పోలీస్ట్‌స్టేషన్‌ పరిధిలో 15 ఏళ్ల బాలికపై ఇటీవల ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని, వారిపై ఛార్జీషీట్‌ దాఖలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సూచించారు. 

Updated Date - 2020-07-08T09:42:43+05:30 IST