నిరాడంబరంగా బోనాలు

ABN , First Publish Date - 2020-07-20T10:05:04+05:30 IST

పాతబస్తీలో మహంకాళి బోనాల జాతరను ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

నిరాడంబరంగా బోనాలు

ఆలయాల్లో బోనాలు సమర్పించిన పూజార్లు, ఆలయ కమిటీ సభ్యులు

ఇళ్లల్లోనే బోనాలు సమర్పించిన మహిళలు


డప్పుల దరువులు, పోతరాజుల విన్యాసాలు, ఫలాహార బండ్ల ఊరేగింపులతో అంగరంగ వైభవంగా జరగాల్సిన బోనాల ఉత్సవాలను కరోనా నేపథ్యంలో నగరవాసులు ఈసారి నిరాడంబరంగా జరుపుకొన్నారు. భక్తులతో కిక్కిరిసి కనిపించే రహదారులు, అమ్మవారి ఆలయాలు బోసిపోయాయి. కొవిడ్‌ నిబంధనల మేరకు  ఆయా ఆలయాల్లో పూజార్లు, ఇళ్లల్లోనే మహిళలు అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. ఆలయాలకు వెళ్లే రహదారుల్లో పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో కొందరు భక్తులు ఆలయ ముఖద్వారాల వద్ద పూజలు చేసి వెళ్లి పోయారు.


మదీన, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : పాతబస్తీలో మహంకాళి బోనాల జాతరను  ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి, హరిబౌలి అక్కన్నమాదన్న దేవాలయం, సుల్తాన్‌షాహి జగదాంబ, ఉప్పుగూడ మహంకాళి ఆలయం, గౌలిపురా మహంకాళి మాతేశ్వరి భారతమాత, మీరాలమండి మహంకాళి, చందూలాల్‌ బేలా ముత్యాలమ్మ, హరిబౌలి బంగారు మైసమ్మ, చార్మినార్‌ భాగ్యలక్ష్మి, మేకలబండ నల్లపోచమ్మ, గౌలిపురా సీఐబీ క్వార్టర్స్‌, మేకలబండ నల్లపోచమ్మ దేవాలయంతో పాటు బస్తీల్లో బోనాల ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగాయి.  


నేడు ఘటాల ఊరేగింపు...అంబారీ లేనట్లే..

ఈ ఏడాది ప్రభుత్వ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో భక్తులతో కలిసి ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు. ఉదయం అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలను చేసి మధ్యాహ్నం పోతరాజులకు స్వాగతం పలుకుతారు. సాయంత్రం భవిష్యవాణి (రంగం) వినిపిస్తారు. ఘటాల ఊరేగింపులో అంబారీ (ఏనుగు)కి అనుమతి లభించలేదు. 


పోలీస్‌ బందోబస్తు

బోనాల సందర్భంగా ఆలయాల వద్ద అడిషనల్‌ సీపీ శిఖా గోయల్‌, జాయింట్‌ సీపీ తరుణ్‌ జోషితోపాటు ట్రాఫిక్‌ డీసీపీ కె.బాబురావు, దక్షిణ మండలం ఇన్‌చార్జ్‌ డీసీపీ భూపాల్‌, అడిషనల్‌ డీసీపీ సయ్యద్‌ రఫీఖ్‌, సునీతారెడ్డి ఇతర అధికారులు బందోబస్తును పరిశీలించారు. 


అమీర్‌పేట: ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి అర్చకులు, సిబ్బంది బోనాలను సమర్పించారు. ట్రాఫిక్‌, సివిల్‌ పోలీసులు ఆలయం ముందున్న ప్రధన రహదారిని ఒక వైపు బారీకేడ్లతో మూసివేశారు. బేగంపేటలోని కట్టమైసమ్మ మహాలక్ష్మి, నల్ల పోచమ్మ, ప్రకాశ్‌నగర్‌లోని భూలక్ష్మి దేవి, ఈఎ్‌సఐ ఆస్పత్రి ఆవరణలోని బంగారు మైసమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు.


సికింద్రాబాద్‌/ బోయినపల్లి/మారేడుపల్లి : బోయినపల్లి నల్లపోచమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ, మూడోవార్డు మడ్‌ఫోర్టు ముత్యాలమ్మ, చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయాల్లో ఘనంగా పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. సికింద్రాబాద్‌ మారేడుపల్లిలో మైసమ్మ ఆలయంలో అమ్మవారిని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ దర్శించుకున్నారు. 


బౌద్ధనగర్‌ : సీతాఫల్‌మండి, బౌద్ధనగర్‌ డివిజన్లలోని చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ, వారాసిగూడలోని నల్లపోచమ్మ, పార్శిగుట్ట సవరాలబస్తీలోని ఎల్లమ్మ ఆలయాల్లో బోనాలు సమర్పించారు. చిలకలగూడ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో 43ఆలయాలను మూసివేశారు. 


కృష్ణానగర్‌/ ఎర్రగడ్డ/వెంగళరావుగనర్‌ : బోరబండ పుట్టనాగులమ్మ, ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని పట్టు వస్ర్తాలతో అలంకరించారు, ఎర్రగడ్డ డివిజన్‌లోని హేమావతి నగర్‌లోని నల్ల పోచమ్మ, ప్రేమ్‌నగర్‌లోని శ్రీమాతా ఎల్లమ్మ, శ్రీమాతా నల్లపోచమ్మ,  కృష్ణానగర్‌ పోచమ్మ తల్లి దేవాలయాల్లో బోనాలు సమర్పించారు. 


రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని రాజేంద్రనగర్‌ ఈదమ్మ దేవాలయంలో, బుద్వేల్‌, ప్రేమావతిపేట్‌, శివరాంపల్లి, అత్తాపూర్‌, మార్కండేయనగర్‌, కాటేదాన్‌, గణేశ్‌నగర్‌, పద్మశాలీపురం, టీఎన్‌జీవోస్‌ కాలనీ తదితర బస్తీల్లో బోనాల ఉత్సవాలు సాదాసీదాగా జరిగాయి. మైలార్‌దేవుపల్లి డివిజన్‌ మార్కండేయనగర్‌లో పోచమ్మ అమ్మవారిని వెండివస్త్రాలంకరణతో ముస్తాబు చేశారు. కాటేదాన్‌ గణేశ్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయంలో అమ్మవారిని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ దర్శించుకున్నారు. 


గోల్నాక: గోల్నాక డివిజన్‌లోని శాంతినగర్‌ పోచమ్మ, శ్రీలక్ష్మీనగర్‌లోని నల్లపోచమ్మ, దుర్గానగర్‌లోని దుర్గా మైసమ్మ దేవాలయాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల మహిళలు ఎవరికి వారు బోనాలతో తరలొచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. గంగానగర్‌లోని మహంకాళి, బంగారు మైసమ్మ దేవాలయం, అంబర్‌పేట సీపీఎల్‌ రోడ్డులోని తిరుమల నగర్‌లోని శ్రీరేణుకా ఎల్లమ్మ నాగదేవత ఆలయం, శాంతినగర్‌ తోట్లబస్తీ, నెహ్రూనగర్‌, సుందర్‌నగర్‌, కృష్ణా నగర్‌, శాస్త్రీనగర్‌, ఆర్టీసీ క్వార్టర్స్‌, సంజయ్‌గాంధీనగర్‌, మారుతీనగర్‌, శంకర్‌నరగ్‌, తులసీరాంనగర్‌, కమాలానగర్‌, అన్నపూర్ణనగర్‌, జైస్వాల్‌గార్డెన్‌ కాలనీల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి.


కూకట్‌పల్లి : కూకట్‌పల్లిలోని చిత్తారమ్మ ఆలయంలో, కేపీహెచ్‌బీకాలనీ మూడోఫేజ్‌లోని నల్లపోచమ్మ అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. 


మెహిదీపట్నం జోన్‌ బృందం: గండిపేట మండలంలో, మణికొండలో నార్సింగ్‌ మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట గ్రామం లో అమ్మవారికి బోనాలు, తొట్టెలు సమర్పించారు. కార్వాన్‌ నియోజకవర్గంలోని లంగర్‌హౌజ్‌లోని బుజిలీ మహంకాళి, బాపూఘాట్‌ సమీపంలోని గుండుపోచమ్మ, గొల్లబస్తీలోని నల్లపోచమ్మ, ఆసి్‌ఫనగర్‌లోని గండి మైసమ్మ, గుడిమల్కాపూర్‌లోని బంగారు మైసమ్మ, మాసాబ్‌ట్యాంక్‌లోని కట్టమైసమ్మ దేవాలయాల్లో అమ్మవార్లుకు బోనాలు, సాకలు సమర్పించి భక్తులు మొక్కలు తీర్చుకున్నారు. 


లంగర్‌హౌస్‌: చరిత్రాత్మకమైన గోల్కొండ కోటపైగల జగదాంబిక మహంకాళి(ఎల్లమ్మ) అమ్మవారి ఎనిమిదో బోనం దేవాదాయ ధర్మాదాయశాఖ ఆలయ ఈవో మహేందర్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 


రామంతాపూర్‌ : రామంతాపూర్‌, హబ్సిగూడలో అమ్మవారికి తెల్లవారు జామునే పూజారులు ఆలయ కమిటీల ప్రతినిధులు బోనాలను సమర్పించి, ప్రధాన ద్వారాలకు తాళాలను వేశారు. రామంతాపూర్‌ దూరదర్శన్‌ కేంద్రం వద్ద గల నల్ల పోచమ్మ ఆలయాన్ని తెరిచి ఉంచడంతో భక్తులు పోటెత్తారు. ఆలయం వద్ద గుంపులుగా చేరిన భక్తులు భౌతిక దూరం పాటించకపోవడంతో పాటు మాస్కులను సైతం ధరించలేదు. 

 

నేరేడ్‌మెట్‌: నేరేడ్‌మెట్‌ డివిజన్‌ పరిధిలోని మధురానగర్‌లోని ఆదిదుర్గాదేవి, రాజరాజేశ్వరీదేవి, జేజేనగర్‌, జీకేకాలనీ, డిఫెన్స్‌కాలనీ, బృందావన్‌కాలనీ, వివేకానందపురం తదితర కాలనీల్లోని అమ్మవారి దేవాలయాల్లో ఘనంగా పూజలు నిర్వహించారు. 


మల్కాజిగిరి: మల్కాజిగిరి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆలయ ప్రధనార్చకులు బోనం సమర్పించారు. నల్లపోచమ్మకు, ఆర్‌కేనగర్‌లోని బందరు పోచమ్మకు, విజయదుర్గ కట్టమైసమ్మకు, మూడుగుళ్లు తదితర ఆలయాల్లో ఆమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. 


కుత్బుల్లాపూర్‌/నిజాంపేట్‌/గాజులరామారం/షాపూర్‌నగర్‌: కుత్బుల్లాపూర్‌లోని పలు అమ్మవారి ఆలయాల గేట్లను మూసివేసి గర్భగుడిలో అర్చకులు మాత్రమే పూజలు నిర్వహించారు. దీంతో భక్తులు గేట్ల వద్ద బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిజాంపేట్‌ మున్సిపల్‌ పరిధిలోని దుర్గమ్మ దేవాలయంలో, గాజులరామారం డివిజన్‌ పరిధిలోని దేవేందర్‌ నగర్‌లోని పలు బస్తీల్లో, షాపూర్‌నగర్‌ నల్ల పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు.


శేరిలింగంపల్లి జోన్‌ బృందం : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మియాపూర్‌, హఫీజ్‌పేట, మదీనగూడ, చందానగర్‌, లింగంపల్లి, రాయదుర్గం, గోపన్‌పల్లి, మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, భెల్‌కాలనీ ప్రాంతాల్లోని పోచమ్మ, నల్లపోచ్చమ్మ, కట్టమైసమ్మ దేవాలయాల్లో మహిళలు ఒక్కొక్కరుగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. 


దిల్‌సుఖ్‌నగర్‌ జోన్‌ బృందం: మన్సూరాబాద్‌లోని పోచమ్మ ఆలయంలో కరోనా నివారణకు ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. సైదాబాద్‌ మాతామైదాన్‌లోని విజయదుర్గమాత, జీవనజ్యోతి సంఘంలోని జయదుర్గాదేవి, కర్మన్‌ఘాట్‌లో పోచమ్మ, ఈదమ్మ, చంపాపేటలోని నల్ల పోచమ్మ, ఎర్ర పోచమ్మ, బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లోని ఆలయాల్లో, వనస్థలిపురం కాంప్లెక్స్‌లోని మహంకాళి, ప్రశాంత్‌నగర్‌లోని కనకదుర్గ, బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌, స్నేహమయినగర్‌ కాలనీ బంగారు మైసమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. ఎల్‌బీనగర్‌లోని మాల్‌మైసమ్మ ఆలయంలో జరిగిన బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.


ముషీరాబాద్‌ జోన్‌ బృందం:  లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని కనకాల కట్టమైసమ్మ, ముషీరాబాద్‌లోని మహంకాళి, బాపూజీనగర్‌లోని పోచమ్మ, రాంనగర్‌లోని జెమిని కాలనీ నల్లపోచమ్మ దేవాలయాలకు భక్తులు రాకుండా చిక్కడపల్లి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భోలక్‌పూర్‌ దేవీచౌక్‌ వద్ద గల రాజరాజేశ్వరి కనక దుర్గ, రాంనగర్‌ రామాలయం వద్ద గల నల్లపోచమ్మ, ఎస్‌ఆర్‌టీ క్వార్టర్స్‌లోని నల్లపోచమ్మ ఆలయాల్లో భక్తులు బోనాలు సమర్పించారు. ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌, మాజీ ఎమ్మల్యే డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అమ్మవారి దేవాలయాలను సందర్శించారు. చిక్కడపల్లి జవహర్‌నగర్‌లోని వరాల పోచమ్మ దేవాలయంలో ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ తొట్టెలను సమర్పించారు. 


రాంనగర్‌/బర్కత్‌పుర: అంబర్‌పేట నియోజకవర్గంలోని మహంకాళి అమ్మవారికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేసి బోనంతో నైవేద్యం సమర్పించారు. బాగ్‌అంబర్‌పేటలోని అమ్మవారి ఆలయంలో కార్పొరేటర్‌ పద్మావతి రెడ్డి పూజలు నిర్వహించారు. కాచిగూడ డివిజన్‌లోని నింబోలిఅడ్డా మహంకాళి అమ్మవారికి ఆలయ ధర్మకర్త రాజేంద్ర పటేల్‌ గౌడ్‌కి బోనం సమర్పించారు. డివిజన్‌ పరిధిలోని రెడ్డి కళాశాల లేన్‌, లింగంపల్లి, చప్పల్‌బజార్‌, మోతిమార్కెట్‌, కుద్బీగూడ, తదితర ఆలయాల్లో అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. 

Updated Date - 2020-07-20T10:05:04+05:30 IST