మీ ప్రసంగాలకో దండం

ABN , First Publish Date - 2022-06-26T05:22:38+05:30 IST

పాతపట్నం నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశంలో వైసీపీ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. ప్లీనరీ ప్రారంభానికి ముందే.. ‘మీ ప్రసంగాలకో దండం’ అంటూ కొంతమంది మహిళలు బయటకు వెళ్లిపోవడంతో నేతలంతా అవాక్కయ్యారు. ప్లీనరీ సమావేశానికి అధిక జన సమీకరణ కోసం

మీ ప్రసంగాలకో దండం

ప్లీనరీ ప్రారంభం కాకముందే బయటకు వచ్చిన మహిళలు

తూతూ మంత్రంగా సాగిన సమావేశం 

మెళియాపుట్టి /పాతపట్నం, జూన్‌ 25 : పాతపట్నం నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశంలో వైసీపీ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. ప్లీనరీ ప్రారంభానికి ముందే.. ‘మీ ప్రసంగాలకో దండం’ అంటూ కొంతమంది మహిళలు బయటకు వెళ్లిపోవడంతో నేతలంతా అవాక్కయ్యారు. ప్లీనరీ సమావేశానికి అధిక జన సమీకరణ కోసం వారం రోజుల నుంచి నాయకులు అష్టకష్టాలు పడ్డారు. గ్రామ వలంటీర్లకు ఈ బాధ్యత అప్పగించడంతో.. అధికంగా ఉపాధి వేతనదారులతోపాటు డ్వాక్రా మహిళలను తీసుకువచ్చారు. శనివారం సాయంత్రం మూడు గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. కానీ, నాలుగున్నర వరకూ పెద్దస్థాయి నాయకులెవరూ కానరాలేదు. దీంతో మిగిలిన నాయకులు, కార్యకర్తల్లో కలవరం చోటుచేసుకొంది. జిల్లాఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు మంత్రులు ధర్మాన ప్రసాదరావు సీదిరి అప్పలరాజు పాల్గొంటారని ప్రకటించినా.. జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తోనే సభను నిర్వహించారు. కాగా ప్రసంగం ప్రారంభం కాకముందే కొంతమంది మహిళలు బయటకు వచ్చేశారు. ఎంత నచ్చజెప్పినా..  ‘గంటల తరబడి నిరీక్షించలేం.. మీ ప్రసంగాలకోదండం’ అంటూ వెళ్లిపోవడంతో సభావేదికపై ఉన్న నేతలంతా అవాక్కయ్యారు. ఇదిలా ఉండగా.. కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు రూ.800 కోట్లు చెల్లించామన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందేలా జగన్‌ పాలన కొనసాగుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని మరింతగా ఆదరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పాలవలస కరుణాకరరావు, వంశీకృష్ణ యాదవ్‌, ప్లీనరీ పరిశీలకుడు రొక్కం సూర్యప్రకాశరావు, పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట మండలాల ఏఎంసీ అధ్యక్షులు మండలస్థాయి నాయకులు ఎంపీపీలు, వైస్‌ఎంసీసీలు, సర్పంచ్‌లు ఎంపీటీసీలు  పాల్గొన్నారు.


Updated Date - 2022-06-26T05:22:38+05:30 IST