ఆసరా.. రసాభాస!

ABN , First Publish Date - 2020-08-03T09:52:31+05:30 IST

పొదుపు సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తాజాగా ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని ప్రవేశ పెట్టింది.

ఆసరా.. రసాభాస!

మహిళా సంఘాల్లో కొత్త చిక్కులు

రాయితీ సొమ్ము కోసం రచ్చ


కవిటి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): పొదుపు సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తాజాగా ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం.. మహిళా సంఘాలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. రాయితీ సొమ్ము కోసం సభ్యుల మధ్య వాదోపవాదాలకు దారి తీస్తోంది. గ్రామస్థాయిలో ఘర్షణలు చోటుచేసుకుని సంఘాలు చీలిపోయే పరిస్థితి ఎదురవుతోంది. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సంఘాల పొదుపు ఆధారంగా కానీ, రుణ చెల్లింపుల్లో గత చరిత్ర ఆధారంగా తదితర ప్రామాణిక అంశాలు తీసుకుని బ్యాంకర్లు రుణాలు మంజూరు చేస్తారు. స్వల్ప మొత్తంలో వడ్డీ వసూలు చేస్తారు. ప్రభుత్వం ఇదివరకు కొన్ని పొదుపు సంఘాలకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు బ్యాంకు రుణాలు అందించేది. పొదుపు సంఘాల మహిళలు ఆ రుణాలను వాటాలు వేసి.. వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేవారు.


కానీ, తాజాగా వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం ద్వారా వచ్చే రుణ రాయితీ కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఎందుకంటే.. ఈ పథకం ద్వారా రుణ రాయితీ నాలుగు విడతలుగా రాబోయే ఐదేళ్లలో సంఘాల సభ్యులందరికీ బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయడమే ప్రధాన కారణం. ఈ పథకం ద్వారా జిల్లాలో 38,912 స్వయం సహాయక సంఘాల్లో 4,98,187 మంది సభ్యులకు..  రూ.1,195.37 కోట్లు మంజూరు చేయనున్నారు. గ్రామస్థాయిలో ఈ పథకం ఓరకంగా కల్లోలమే సృష్టించవచ్చు. ఇప్పటివరకు కొన్ని సంఘాలు  ఖాతాల నిర్వహణ, రుణాలు తీసుకోవడం, వాటిని వాటాలు వేసుకునేవారు.  ఉదాహరణకు రూ.3 లక్షలు చొప్పున రుణం తీసుకుంటే.. సంఘంలో ఇద్దరు ముగ్గురు సభ్యులు వాటిని సర్దుకునేవారు. మళ్లీ వాళ్లే ఆ రుణాలు  చెల్లించేవారు. మరికొన్ని సంఘాలు బినామీ లబ్ధిదారులను చేర్చుకుని.. వారి పేరున పొదుపులు చెల్లించి.. వాళ్ల వాటా రుణాన్ని పొంది నెట్టుకొస్తున్నాయి. తాజా పథకంలో రుణ మొత్తం అందరికీ అందేలా.. సభ్యుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విధానం కొంతమందికి నచ్చడం లేదు.


ఇప్పటివరకూ ఒక్కో గ్రూపులో  ఇద్దరు ముగ్గురే రుణాలు పొంది.. వాటిని చెల్లిస్తుండగా, ఇప్పుడు సభ్యులందరికీ రాయితీ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించడం వారికి మింగుడుపడడం లేదు. రుణం మొత్తం చెల్లిస్తున్న తమకే లబ్ధి అందాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన రాయితీ తాము ఎలా వదులుకుంటామని మిగిలిన సభ్యులు వాదిస్తున్నారు. ఇలా రుణరాయితీ కోసం ప్రతి గ్రామంలోనూ సంఘాల సభ్యుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల స్థానిక నాయకులు, అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


సభ్యులందరికీ అందజేయాలి.. బావన రాధిక, తిరుమల తిరుపతి స్వయం సహాయక సంఘం, కవిటి.

సంఘంలో ఉన్న సభ్యులందరికీ వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం లబ్ధి అందజేయాలి. సభ్యులంతా కలిసి తీర్మానం చేస్తేనే సంఘానికి రుణం మంజూరు అవుతుంది. అందుకే సభ్యులంతా సమానంగా పంచుకోవాలి. ప్రభుత్వ రాయితీలు ప్రతి సభ్యురాలికీ అందాలి.


అప్పు తీసుకున్న వారికే లబ్ధి చేకూరాలి..బొడ్డ సుష్మ, శ్రీరామ ఎస్‌హెచ్‌జీ, జగతి

సంఘంలో అప్పు తీసుకున్న సభ్యులకే లబ్ధి చేకూరాలి. అధిక మొత్తంలో వడ్డీలు చెల్లిస్తున్న కారణంగా.. ప్రభుత్వ రాయితీలు కూడా వారికే వర్తింపజేయాలి. సంఘంలో ఒకరి పేరున ఒకరు అప్పు తీసుకొని అప్పు, వడ్డీ చెల్లించి..అంతమందికీ లబ్ధి సర్దడం సరికాదు.


సంఘ తీర్మానమే కొలమానం.. వివి రవణమ్మ, ఏపిఎం. వెలుగు, కవిటి

వైఎస్‌ఆర్‌ ఆసరా పథకానికి సంఘం తీర్మానమే కొలమానం. సంబంధిత స్వయం సహాయక సంఘాల తీర్మానం ప్రాప్తికి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తాం. దాని ప్రాప్తికి లబ్ధిని సభ్యులకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తాం.  

Updated Date - 2020-08-03T09:52:31+05:30 IST