ఎంతపని చేశావే కోడలా..? వాట్సప్‌ చాటింగ్‌తో భర్తకు అడ్డంగా దొరికిపోయిన భార్య

ABN , First Publish Date - 2020-04-10T21:26:06+05:30 IST

రాజంపేట పట్టణం ఆ ర్టీసీ బస్టాండు సమీపంలోని ఎర్రబల్లిలో ఓ మహిళను హత్య చేసిన సంఘటనలో ప్రధాన సూత్రధారి ఆమె కోడలుతో పాటు ఆమె తల్లి కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని రాజంపేట పోలీసులు బయట పెట్టారు. రాజంపేట డీఎస్పీ

ఎంతపని చేశావే కోడలా..? వాట్సప్‌ చాటింగ్‌తో భర్తకు అడ్డంగా దొరికిపోయిన భార్య

అత్తను చంపిన కేసులో ప్రధాన నిందితులు కోడలు, కోడలు అమ్మ 

రాజంపేట రూరల్‌(కడప): రాజంపేట పట్టణం ఆ ర్టీసీ బస్టాండు సమీపంలోని ఎర్రబల్లిలో ఓ మహిళను హత్య చేసిన సంఘటనలో ప్రధాన సూత్రధారి ఆమె కోడలుతో పాటు ఆమె తల్లి కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని రాజంపేట పోలీసులు బయట పెట్టారు. రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి గురువారం  విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 2019 మే 3న రాజంపేట పట్టణం ఎర్రబల్లిలో సుమిత్రమ్మ అనే మహిళ హత్యకు గురైంది. ఇందులో కీలక సూత్రధారి ఆమె  కోడలుతో పాటు కోడలి తల్లి క్రియాశీలక పాత్ర పోషించారు. అత్త అయిన సుమిత్రమ్మ తనను వేధిస్తూ ఉందని కోడలు నర్రెడ్డి శ్వేత తరచూ తల్లి ఇందిరమ్మకు తెలియజేస్తూ ఉండేది. ఈమెను ఎలాగైనా అంతం చేయాలని తల్లికి తెలిపింది. కూతురు మాటలు విన్న తల్లి ఇందిరమ్మ ఈ హత్యకు కీలక పాత్ర పోషించింది. అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం దేవరపల్లె గ్రామానికి చెందిన ఇందిరమ్మ తన కుమార్తె శ్వేతకు అడ్డుగావున్న ఆమె అత్త సుమిత్రమ్మను ఎలాగైనా చంపాలని ప్లాన్‌వేసింది.


అల్లుడు మహిధర్‌రెడ్డి ఇంటిలో లేని సమయంలో కిరాయి హంతకులైన అదే మండలంలోని కొండ్లవారిపల్లెకు చెందిన ఓర్పు నాగరాజు, మల్లికార్జున, రమేష్‌ అనే వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకుంది. 2019 మే 3వ తేదీన రాజంపేటకు ఓ కారులో వచ్చి కారును బైపాసు రోడ్డులో ఉంచి ఎర్రబల్లిలోని సుమిత్రమ్మ ఇంటికి వచ్చి ఆమెను గొంతు నులిమి హత్య చేశారు. ఈ సమయంలో కోడలు శ్వేత తన పుట్టినిల్లు అనంతపురం జిల్లా పశ్చిమనడింపల్లె మండలం దేవరపల్లె గ్రామంలో ఉండి ఆమె లేని సమయంలో ఆమె తల్లి ఇందిరమ్మ ఈ హత్య చేయించినట్లు తెలిసింది. వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి వచ్చిన సుమిత్రమ్మ కుమారుడు మహిధర్‌రెడ్డి ఈ హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తులో ఉంది. అయితే ఇటీవల భార్య శ్వేత తరచూ సెల్‌ఫోన్‌లో ఇతరులతో చాట్‌చేస్తూ ఉండటాన్ని భర్త గమనించాడు. వాట్సప్ చాటింగ్‌లో తన అత్త సుమిత్రమ్మను హత్య చేయించిన విషయాన్ని ప్రస్తావించడాన్ని భర్త చూశాడు. దీంతో అతడికి అనుమానం రావడంతో భార్యను బెదిరించాడు. మొత్తానికి భార్య శ్వేత అన్ని విషయాలు బయటపెట్టడంతో కేసు మిస్టరీ వీడింది. ఈ విషయాన్ని పోలీసులకు మహిధర్‌రెడ్డి తెలియజేశాడు. రాజంపేట ఇన్‌చార్జి సీఐ హనుమంతునాయక్‌ ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేసి విచారించారు. హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిలో మల్లికార్జున ఇటీవల చనిపోవడంతో మిగిలిన ఇందిరమ్మ, శ్వేత, నాగరాజు, రమేష్‌లను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు డీఎస్పీ వెల్లడించారు. 

Updated Date - 2020-04-10T21:26:06+05:30 IST