Hyderabad MMTS రైళ్లలో భద్రత ఏదీ.. రాత్రివేళల్లో మహిళలు ప్రయాణించాలంటే భయం.. భయం..!

ABN , First Publish Date - 2021-12-22T14:11:48+05:30 IST

ప్రధానంగా మహిళా ప్రయాణికులు రాత్రి వేళలో ప్రయాణించాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది.

Hyderabad MMTS రైళ్లలో భద్రత ఏదీ.. రాత్రివేళల్లో మహిళలు ప్రయాణించాలంటే భయం.. భయం..!

  • ఒక ఎంఎంటీఎస్‌కు ఇద్దరే కానిస్టేబుళ్లు 
  • పెట్రేగిపోతున్న నేరగాళ్లు 

హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : ఎంఎంటీఎస్‌ రైళ్లలో చోటుచేసుకుంటున్న దొంగతనాల నేపథ్యంలో ప్రయాణికులకు భద్రత ఎంత? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధానంగా మహిళా ప్రయాణికులు రాత్రి వేళలో ప్రయాణించాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ‘రైలులో ప్రయాణించే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. పోలీసులు రక్షణ కల్పించాలి’ అని ఓ రైల్వే ఉద్యోగినే పేర్కొన్నారంటే  పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పట్టపగలే రైలుబోగీలోకి చొరబడుతున్న దొంగలు స్టేషన్‌లో రైలు ఆగి కదిలే క్షణాల్లోనే పర్సులు, సెల్‌ఫోన్లు కాజేసి పారిపోతున్నారు. ఈ నెల 20న బోరబండ రైల్వే స్టేషన్‌ వద్ద ఓ ప్రయాణికుడిపై దాడి చేసి నగదు, సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లినట్లు విశ్వనీయ సమాచారం. తాజాగా  సోమవారం రాత్రి ఓ దుండగుడు రైల్వే ఉద్యోగిని బెదిరించి సెల్‌ఫోన్‌ లాక్కెళ్లాడు.


లేడీస్‌ కోచ్‌లోకి రన్నింగ్‌లో ఎక్కి..

ఆర్పీఎఫ్‌ పోలీసుల సరైన నిఘా లేకపోవడంతో ఎంఎంటీఎస్‌ రైలు కదులుతున్న సమయంలో పురుషులు లోనికి వచ్చేస్తున్నారు. అదేమని మహిళా ప్రయాణికులు అడిగితే అర్జంట్‌గా ఎక్కాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. ఆదమరిచి ఉన్న మహిళా బ్యాగుల నుంచి కొందరు పర్సులు, సెల్‌ఫోన్లు కొట్టేస్తున్నారు. ఫలక్‌నుమా నుంచి హైటెక్‌ సిటీ, నాంపల్లి, కాచిగూడ వైపు వెళ్లే ఎంఎంటీఎస్‌ రైలులో ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఒకరు ముందు బోగీలో, మరొకరు వెనక బోగీలో ఎక్కుతారు. హోంగార్డులు లేని బోగీలో దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. 


పూర్తి స్థాయిలో భద్రత : సీఐ నర్సింహ

సికింద్రాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఎంఎంటీఎస్‌ రైళ్లలో 20 మంది కానిస్టేబుళ్లు విధుల్లో ఉంటారు. ఉదయం నుంచి మధ్యరాత్రి వరకు ప్రయాణికులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నాం. సికింద్రాబాద్‌ పరిధిలో ఇంత వరకు ఎలాంటి ఘటనా జరగలేదు. 

Updated Date - 2021-12-22T14:11:48+05:30 IST