భూమి కోసం మహిళా రైతు నిరసన

ABN , First Publish Date - 2021-10-28T05:12:18+05:30 IST

తన భర్తకు చెందిన వ్యవసాయ పొలాన్ని రెవెన్యూ అధికారుల అండదండలతో దాయాదులు అక్రమంగా ఆర్‌ఓఆర్‌లో పేరు నమోదు చేయించుకున్నారని, ఆ భూమి పట్టా మార్పిడి చేయవద్దంటూ ఓ వితంతు మహిళ తహసీల్దారు కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు.

భూమి కోసం మహిళా రైతు నిరసన
భూమికి సంబంధించిన పత్రాలను చూపిస్తున్న బాధిత మహిళ

- తహసీల్దార్‌ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో బైఠాయింపు

అలంపూర్‌ చౌరస్తా, అక్టోబరు 27 : తన భర్తకు చెందిన వ్యవసాయ పొలాన్ని రెవెన్యూ అధికారుల అండదండలతో దాయాదులు అక్రమంగా ఆర్‌ఓఆర్‌లో పేరు నమోదు చేయించుకున్నారని, ఆ భూమి పట్టా మార్పిడి చేయవద్దంటూ ఓ వితంతు మహిళ తహసీల్దారు కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి తహసీల్దార్‌ కార్యాలయం ముందు జరిగింది.  ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మానవపాడు మండల పరిధిలోని పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన కృష్ణమూర్తికి ఇద్దరు కుమారుడు వడ్ల వెంకటేశ్వరాచారి, పుల్లయ్యచారి ఉన్నారు. వారికి తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన సర్వేనెంబరు 12బీ లో ఉన్న 4.31 ఎకరాల ఆస్తిని సమానంగా పంచారు. అయితే వెంకటేశ్వరాచారికి బొంకూరు శివారులో సర్వేనెంబరు 12బీ1లో 2.16 ఎకరాల భుమి కేటాయించారు. 2002లో వెంకటేశ్వరాచారి మరణించాడు. కొన్నాళ్లకే ఐదేళ్ల వయస్సులో ఉన్న కుమారుడు పవన్‌కుమార్‌ తప్పిపోయాడు. దీంతో వెంకటేశ్వరాచారి భార్య బ్రహ్మేశ్వరి తన పుట్టినిల్లు అయిన ఉండవల్లి మండలం, కలుగొట్ల గ్రామంలో నివసిస్తోంది. ఆ తర్వాత కొన్నాళ్లకే వెంకటేశ్వరాచారి పెద్దనాన్న కొడుకులైన బ్రహ్మయ్య, రాఘవేంద్రలు అక్రమంగా రెవెన్యూ అధికారుల సాయంతో 2008లో వెంకటేశ్వరాచారి పేరును రౌండప్‌ చేసి భూమిని తమ తండ్రి అయిన రంగయ్యచారి పేరుపైకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. ఆలస్యంగా తెలుసుకున్న వెంకటేశ్వరాచారి భార్య బ్రహ్మేశ్వరి కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా చనిపోయిన రంగయ్య నుంచి పట్టామార్పిడి చేసుకునేందుకు కొడుకులు స్లాట్‌ బుక్‌ చేశారు. విషయం తెలుసుకున్న బ్రహ్మేశ్వరీ బుధవారం ఉండవల్లి త హసీల్దారు కార్యాలయానికి పురుగులమందు డబ్బాతో వచ్చి రెవెన్యూ కార్యాలయం ఎదుట బైఠాయించింది. న్యాయం జరిగేవరకు నిరాహారదీక్ష చేస్తానని, న్యాయం జరగకపోతే ఇక్కడే పురుగుల మందు తాగి చస్తానని అనడంతో ట్రైనీ ఎస్సై జగదీష్‌, ఏఎస్సై అయ్యన్న వచ్చి తహసీల్దారుతో మాట్లాడి పట్టామార్పిడి జరగకుండా కలెక్టర్‌కు నివేదిక ఇస్తామని హామీ ఇవ్వడంతో శాంతించింది. సదరు భూమి క్రయవిక్రయాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు.


Updated Date - 2021-10-28T05:12:18+05:30 IST