Abn logo
Apr 11 2021 @ 12:42PM

వాచ్‌మన్‌పై హత్యాయత్నం కేసు : విషమంగానే బాధితురాలి ఆరోగ్యం

హైదరాబాద్/కూకట్‌పల్లి : దొంగతనం చేసిందన్న నెపంతో వాచ్‌మన్‌గా పనిచేసే మహిళను వేధించడంతో పాటు ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన ఘటనలో ఇంటి యజమానులైన ఇద్దరిపై కూకట్‌పల్లి పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న మునియమ్మ బంగారు గొలుసు దొంగిలించిందన్న నెపంతో ఇంటి యజమానురాలు సూర్యకుమారి, ఆమె కోడలు స్వాతి నాలుగు రోజుల పాటు మహిళను వేధించారు. తర్వాత సదరు గొలుసు ఓనరు ఇంట్లోనే లభించినప్పటికీ, మునియమ్మపై తీవ్ర కోపంతో ఉన్న సూర్యకుమారి, స్వాతి శుక్రవారం కూడా వేధింపులకు గురి చేశారు. 


ఉద్యోగం మానేసి వెళ్లిపోవాలని, తీవ్రంగా కొట్టడంతోపాటు ఆమె ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. 90 శాతం గాయాలైన మునియమ్మ చావుబతుకుల మధ్య ఉస్మానియా ఆస్పత్రిలో చేరింది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి తనపై జరిగిన దాడి వివరాలను బాధితురాలు మేజిస్ర్టేట్‌కు వివరించింది. ఈ మేరకు నిందితులైన సూర్యకుమారి, స్వాతిపై ఐపీసీ 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింగ్‌రావు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement