'రేపిస్టు'కు టిక్కెట్‌‌పై నిలదీసిన కాంగ్రెస్ మహిళా కార్యకర్తపై దాడి

ABN , First Publish Date - 2020-10-11T21:33:34+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా ఉప ఎన్నికల్లో టిక్కెట్ కేటాయింపు వ్యవహారంపై గలభా..

'రేపిస్టు'కు టిక్కెట్‌‌పై నిలదీసిన కాంగ్రెస్ మహిళా కార్యకర్తపై దాడి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా ఉప ఎన్నికల్లో టిక్కెట్ కేటాయింపు వ్యవహారంపై గలభా చేటుచేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత సమావేశంలో చోటుచేసుకున్న వాగ్వాదం ఓ మహిళా కార్యకర్తపై దాడికి దారితీసింది. డియోరియా ఉప ఎన్నిక అభ్యర్థిగా ముకుంద్ భాస్కర్ మణిని పార్టీ ఎంపిక చేసింది. ఆయన అత్యాచార నిందితుడని, అతనికి టిక్కెట్ ఎలా కేటాయిస్తారని తారా యాదవ్ అనే మహిళా కార్తకర్త నిలదీయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. సరైన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వలేదని, అత్యాచార నిందితుడైన భాస్కర్ మణకి టిక్కెట్ ఎలా ఇస్తారని పార్టీ కార్యదర్శి సచిన్ నాయక్‌కును ఆమె ప్రశ్నిస్తుండగా, కొందరు ఆగ్రహంతో ఆమెపై దాడి చేశారు.


'అత్యాచార నిందితుడికి టిక్కెట్ ఇవ్వాలని పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించడంతో నాపై కొందరు కార్యకర్తలు దాడి చేశారు. ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకు వెళ్తాను. ఆమె ఏమి నిర్ణయం తీసుకుంటారో వేచిచూస్తాను' అని తారా యాదవ్ మీడియాకు తెలిపారు. కాగా, తారా యాదవ్ ఆరోపణలు నిరాధారమని, తాను ఏ కేసులోనూ దోషి కాదని ముకుంద్ భాస్కర్ మణి చెప్పారు. ఈ ఘటనను మహిళా కమిషనర్ చైర్‌పర్సన్ రేఖా శర్మ ఖండించారు. మహిళా నేతలు ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలని మనమే చెబుతుంటాం. పార్టీ సమావేశాల్లో నేతలే గూండాల్లా ప్రవర్తిస్తుంటే ఇదెలా సాధ్యం? అని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి దురుసు ప్రవర్తనలతో మహిళా సాధికారత ఎలా సాధ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి జరిపిన వారిపై చర్య తీసుకోవాలని యూపీ డీజీపీకి లేఖ రాస్తామని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే జనమేజయ సింగ్ మృతితో డియోరియా అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 3న ఉప ఎన్నిక జరుగనుంది.

Updated Date - 2020-10-11T21:33:34+05:30 IST