ఎన్నికల్లో గెలిచిన భర్తను భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య

ABN , First Publish Date - 2021-01-20T00:20:04+05:30 IST

పలు గ్రామంలో ఉన్న 7 స్థానాల్లో సంతోష్ గౌరవ్‌కు చెందిన జఖ్మట్ట దేవి గ్రామవికాస్ పానెల్ 6 స్థానాలను గెలుపొందింది. మాజీ సర్పంచి బాబన్ సావంత్, వికాస్ సొసైటీ చైర్మన్ రాందాస్ సావంత్ మద్దతుతో సంతోష్ గౌరవ్ ఈ ఎన్నికల్లో పోటీ చేశాడు

ఎన్నికల్లో గెలిచిన భర్తను భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య

పూణె: సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన నేతల్ని తమ అనుచరులు భుజాలపై మోస్తూ ర్యాలీ తీస్తుంటారు. కానీ రేణుక సంతోష్ గౌరవ్ అనే మహిళ.. ఎన్నికల్లో గెలిచిన తన భర్తను భుజాలపైకి ఎత్తుకుని ర్యాలీ తీసింది. కొత్తగా అనిపించే ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణె జిల్లాలో జరిగింది. కొద్ది రోజుల క్రితం పుణె జిల్లాలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. సోమవారం ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఖేడ్ తాలుకాలోని పలు అనే గ్రామ సర్పంచ్‌గా సంతోష్ గౌరవ్ అనే వ్యక్తి గెలిచాడు. ప్రత్యర్థిని 44 ఓట్ల తేడాతో ఓడించాడు. భర్త గెలిచిన ఆనందంలో అతడిని తన భుజాలపైకి ఎత్తుకుని ఊరంతా తిరిగుతూ సంబరాలు చేసుకుంది ఆయన భార్య రేణుక సంతోష్ గౌరవ్.


పలు గ్రామంలో ఉన్న 7 స్థానాల్లో సంతోష్ గౌరవ్‌కు చెందిన జఖ్మట్ట దేవి గ్రామవికాస్ పానెల్ 6 స్థానాలను గెలుపొందింది. మాజీ సర్పంచి బాబన్ సావంత్, వికాస్ సొసైటీ చైర్మన్ రాందాస్ సావంత్ మద్దతుతో సంతోష్ గౌరవ్ ఈ ఎన్నికల్లో పోటీ చేశాడు. ప్రత్యర్థి జఖ్మట్ట గ్రామ్ వికాస్ పరివర్తన్ పానెల్‌పై స్పష్టమైన మెజారిటీతో జఖ్మట్ట దేవి గ్రామవికాస్ పానెల్ ఈ విజయాన్ని నమోదు చేసుకుంది.


ఇకపోతే కోవిడ్ కారణంగా ఎన్నికల అనంతరం గెలిచిన అభ్యర్థులు ర్యాలీ తీయడంపై జిల్లా కలెక్టర్ కొన్ని నిషేధాలు విధించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది కనిపించకూడదని, భౌతికదూరం తప్పని సరి అని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా కేవలం ఐదుగురు వ్యక్తులతో, భౌతిక దూరాన్ని పాటిస్తూ తన భర్త విజయోత్సవ ర్యాలీని రేణుక సంతోష్ గౌరవ్‌ నిర్వహించింది.

Updated Date - 2021-01-20T00:20:04+05:30 IST