మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా, సంతోషంగా బతకాలంటే అన్ని రకాల పోషకాలు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. పళ్లు, కూరగాయలు మొదలైన వాటికి దూరమై ఫాస్ట్ ఫుడ్ తినడానికి మాత్రమే అలవాటు పడితే దీర్ఘకాలంలో ఎన్నో శారీరక సమస్యలు ఎదురవుతాయి. ఇంగ్లండ్‌కు చెందిన ఓ యువతి రెండేళ్ల వయసు నుంచి దాదాపు 23 ఏళ్లుగా శాండ్విచ్లు, చిప్స్ మాత్రమే తింటోంది. దీంతో ఆమెకు తీవ్ర అనారోగ్యం తలెత్తింది. ఇలాగే కొనసాగితే బతకడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు.
ఇంగ్లండ్‌లోని కోవెంట్రీకి చెందిన జియో శాడ్లర్ అనే యువతి రెండేళ్ల బాలికగా ఉన్నప్పుడు క్రిస్ప్ శాండ్విచ్లు, చిప్స్ తినడానికి అలవాటు పడింది. స్కూల్ లంచ్ బాక్స్‌లో అవి పెడితేనే ఆమె తినేది. దీంతో జియో తల్లిదండ్రులు లంచ్ బాక్స్‌లో వాటినే పెట్టేవారు. క్రమంగా ఆమె మిగిలిన ఆహార పదార్థాలన్నింటినీ అసహ్యించుకునేది. ఫ్లేవర్లు మార్చి శాండ్విచ్లు, చిప్స్ మాత్రమే తినేది. ఏకంగా 23 ఏళ్ల పాటు జియో వాటితోనే కాలం గడిపింది. దీంతో మూడేళ్ల క్రితం ఆమెకు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. పోషకాహార లోపం కారణంగా ఆమె మెదడు, నరాలపై ప్రభావం చూపించే మల్టిపుల్ స్లెరోసిస్ అనే వ్యాధికి గురైంది. ఈ వ్యాధికి సంపూర్ణ చికిత్స లేదు. జీవితాంతం చికిత్స చేయించుకుంటూ ఉండాల్సిందే.
ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవాలనే ఉద్దేశంతో జియో ఒక హిప్నాథెరపిస్ట్ను ఆశ్రయించింది. ఆమె కండీషన్‌ను `రెస్ట్రిక్టివ్ ఫుడ్ ఇన్‌టేక్ డిజార్డర్`గా గుర్తించిన హిప్నాథెరపిస్ట్ రెండు గంటల పాటు కౌన్సిలింగ్ ఇచ్చాడు. దీంతో జియో దాదాపు 23 ఏళ్ల తర్వాత తొలిసారిగా పళ్లు, కొన్ని కూరగాయలతో భోజనం చేసింది. భోజనం చేసిన తర్వాత ఆమె తన అనుభూతిని పంచుకుంది. `స్ట్రాబెర్రీలు ఇంత రుచిగా ఉంటాయంటే నేను నమ్మలేకపోతున్నా. రకరకాల ఆహార పదార్థాలు తినేందుకు ఎదురు చూస్తున్నా. వచ్చే ఏడాది జరగబోయే నా పెళ్లిలో అన్ని రకాల కూరగాయలతో విందు భోజనం చేస్తాన`ని జియో ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి