చేనేతకు చింత!

ABN , First Publish Date - 2022-08-08T05:03:12+05:30 IST

మగ్గం అడితే గాని పొట్టనిండని ఆ చేనేత కుటుంబాలకు జీఎస్టీ రూపంలో చింత ఏర్పడింది. వసా్త్రల నేతకు కావాల్సిన ముడి సరుకుల కొనుగోలు నుంచి కష్డపడి నేసిన దుస్తులను మార్కెట్‌లో అమ్ముకునే వరకు జీఎస్టీ విధిస్తుండటంతో కార్మికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓ వైపు పవర్‌లూమ్‌ వసా్త్రల త

చేనేతకు చింత!

ఇటు పవర్‌లూమ్‌లు, అటు జీఎస్టీతో మూలనపడుతున్నా మరమగ్గాలు

ముడి సరుకుపై 7 నుంచి 12శాతం పన్ను

వృత్తిని వదిలేస్తున్న చేనేత కుటుంబాలు

ఉమ్మడి జిల్లాలో జియో ట్యాగింగ్‌ పొందిన కుటుంబాలు 118 

ఖమ్మంసంక్షేమవిభాగం, ఆగస్టు 7:  మగ్గం అడితే గాని పొట్టనిండని ఆ చేనేత కుటుంబాలకు  జీఎస్టీ రూపంలో చింత ఏర్పడింది. వసా్త్రల నేతకు కావాల్సిన ముడి సరుకుల కొనుగోలు నుంచి కష్డపడి నేసిన దుస్తులను మార్కెట్‌లో అమ్ముకునే వరకు జీఎస్టీ విధిస్తుండటంతో కార్మికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓ వైపు పవర్‌లూమ్‌ వసా్త్రల తయారీ వేగంగా పల్లెలకు విస్తరిస్తుండగా.. మరో వైపు జీఎస్‌టీ భారం వారిని కుంగదీస్తోంది. ఈ క్రమంలో ఎన్నో కుటుంబాలు వృత్తిని వదులు తుండటంతో మగ్గాలు మూలన పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో గతంలో 400మంది వరకు చేనేత కార్మికులుండగా తమ రంగానికి సరైన గుర్తింపు లేకపోవడం, రాత్రింబవళ్లు కష్టపడినా తగిన ఫలం దక్కకపోతుండంతో ఆ కుటుంబాలలోని యువత ఇతర రంగాలను ఎంచుకుంటున్నారు. కానీ తమ వృత్తితో పాటు చేనేతపై మక్కువ ఉన్న వారు మాత్రం కష్టనష్టాలకోర్చి నేతను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 118 కుటుంబాలు మాత్రమే ముడి సరుకులు తీసుకొచ్చి వసా్త్రలను నేస్తున్నారు. అయితే తమ రంగాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ముడి సరుకులపై 7శాతం, జరీపై 12శాతం జీఎస్టీ భారం మోపిందని ఆ కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏడు సొసైటీల ఏర్పాటు

చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందించేందుకు సోసైటీ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేనేత కార్మికులు తక్కువగా ఉండటంతో అక్కడ సోసైటీల ఏర్పాటు జరగలేదు. ఖమ్మం జిల్లాలో మధిర మండలం చిలుకూరు, ఎర్రుపాలెం మండలం సకినవీడు, చింతకాని మండలం పాతర్లపాడు, ఖమ్మంరూరల్‌ మండలం ఎంవీపాలేం, పొన్నెకల్లు, తిరుమలాయపాలెం మండలం కాకరవాయి, నేలకొండపల్లి మండలంలో ముజ్జుగూడెంలో చేనేత కార్మిక సొసైటీలు ఏర్పాటయ్యాయి. ఒక్కో సోసైటీ పరిధిలో 50నుంచి 110 మంది వరకు సభ్యత్వం పొందారు.

ఒక్క చీరకు కనీసంగా రూ.1300వరకు వ్యయం

జీఎస్టీకి ముందు ఒక చీరకు కావాల్సిన నిలువు, అడ్డం దారాలు, రంగులు, జరీ మొత్తం కలిపి రూ.500వరకు ఖర్చయ్యేది. ఇప్పుడు ముడిసరుకులపై 7నుంచి 12శాతం వరకు జీఎస్టీ పడుతుండటంతో ఒక్క చీరకు కావాల్సిన ముడిసరుకుకే రూ.800వరకు ఖర్చవుతోంది. కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు రోజంతా పనిచేస్తే ఒక చీర తయారవుతుంది. ఆ చీరను కనీసంగా రూ.1300కు అమ్మితే చేనేత కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులకు రోజుకు రూ.250 కూలి చొప్పున వస్తుంది. అయితే పవర్‌లూమ్‌పై తయారు చేసిన చీరలు రూ.600 నుంచే అందుబాటులో ఉండటంతో చేనేత కార్మికులు తాము తయారు చేసిన చీరలను అమ్మటం కూడా కష్టంగా మారుతోంది. కనీస ఆర్థిక స్థోమత లేకుండా చేనేత వసా్త్రలు తయారు చేసే కార్మికులకు జీఎస్టీ నెంబర్‌ కావాలనే నిబంధన తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. చేనేత కార్మికులు తయారు చేసిన వసా్త్రలను దుకాణాల్లో అమ్మకం జరిపే సమయంలో వసా్త్రల కొనుగోలు దుకాణం దారులు జీఎస్టీ నెంబర్లు అడుగుతున్నారు. కానీ జీఎస్‌టీ నెంబర్‌ లేక పోవటంతో దుకాణదారులకు తక్కువ ధరలకు తాము నేసిన చీరలను అమ్ముకోవాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జీఎస్టీ భారం తొలగించాలి..

గూడూరు శ్రీనివాస్‌, కాకరవాయి

వంశ పారంపర్యంగా వచ్చిన వృత్తి కావడంతో 1990నుంచి చేనేత వసా్త్రలను తయారు చేస్తున్నా. గతంలో కంటే చేనేతకు గుర్తింపు ఉంది. సొసైటీల ఏర్పాటు, జీఎస్టీ ట్యాగింగ్‌ ద్వారా ప్రభుత్వ సబ్సిడీలు పొందుతున్నాం. గతంలో జీఎస్టీ లేకపోవడంతో ఒక చీరకు ముడిసరుకు వ్యయం రూ.500 ఉండేది.. కానీ ఇప్పుడు అదే ముడిసరుకుకు రూ.800 వరకు ఖర్చవుతోంది. ఇద్దరం పనిచేస్తే కూలీ కూడా పడటం లేదు. ఒక చీర అమ్మితే రూ.1200 కూడా రావటం లేదు. పవర్‌లూమ్‌ ఒక వైపు.. జీఎస్టీ భారం మరోవైపు కుంగదీస్తున్నాయి. మా రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నుంచి చేనేతకు మినహాయింపునివ్వాలి. 

Updated Date - 2022-08-08T05:03:12+05:30 IST