కాశీలో BJP ముఖ్యమంత్రుల సతీమణులు ఏమేం చేశారంటే...

ABN , First Publish Date - 2021-12-16T23:24:41+05:30 IST

శ్రీ కాశీ విశ్వనాథ్ ధామం ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న

కాశీలో BJP ముఖ్యమంత్రుల సతీమణులు ఏమేం చేశారంటే...

వారణాసి : శ్రీ కాశీ విశ్వనాథ్ ధామం ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సతీమణులు పూజలతోపాటు షాపింగ్ కూడా చేశారు. ఈ ధామాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సతీసమేతంగా హాజరయ్యారు. బిహార్, నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్ కూడా పాల్గొన్నారు. 


నేతలంతా సమావేశంలో పాల్గొనగా, వారి సతీమణులు వారణాసిలోని బడా లాల్‌పూర్ ప్రాంతంలో షాపింగ్ చేశారు. ఇక్కడ చేనేత, చేతి వృత్తుల ఉత్పత్తులు, కళాఖండాలను కొన్నారు. అదేవిధంగా కాశీవిశ్వనాథ దేవాలయంలోనూ, సంకటమోచన దేవాలయంలోనూ పూజలు చేశారు. సిగ్రా ప్రాంతంలో ఉన్న భారత మాత మందిరాన్ని కూడా సందర్శించారు. 


బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కొందరు ముఖ్యమంత్రులు పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ స్మృతి ఉపవనాన్ని సందర్శించారు. నడ్డీ తన సతీమణితో కలిసి సారనాథ్‌లోని లైట్ అండ్ సౌండ్ షోను వీక్షించారు. 


Updated Date - 2021-12-16T23:24:41+05:30 IST