మన అసలు సంస్కృతి లేనిదే మనం లేము : కిరణ్ రిజిజు

ABN , First Publish Date - 2022-01-16T19:07:09+05:30 IST

మన అసలు సంస్కృతి లేనిదే మనం లేమని కేంద్ర న్యాయ శాఖ

మన అసలు సంస్కృతి లేనిదే మనం లేము : కిరణ్ రిజిజు

న్యూఢిల్లీ : మన అసలు సంస్కృతి లేనిదే మనం లేమని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.  అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆకాశ్ తెగవారు జరుపుకొనే సరోక్ పండుగ సంబరాల సందర్భంగా ఆయన ఈ ట్వీట్‌తోపాటు ఓ వీడియోను షేర్ చేశారు. ఈస్ట్ కామెంగ్ జిల్లాలోని బన వద్ద ఆయన ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సౌహార్ద రాయబారి కూడా. 


‘‘వైభవోపేతమైన సరోక్ పండుగ తాలూకు చిన్న వీడియో క్లిప్ ఇది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈస్ట్ కామెంగ్ జిల్లా, బన వద్ద ఆకాశ్ తెగవారు జరుపుకుంటున్న సంబరాలు ఇవి. మన అసలు సంస్కృతి లేకపోతే మనకు విలువ ఉండదు’’ అని ట్వీట్ చేసి, ఈ వీడియోను షేర్ చేశారు. 


సరోక్ సంబరాల్లో భూమాతకు ప్రార్థనలు చేస్తారు.  ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు సరోక్ ఫెస్టివల్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్సలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి తెగవారు శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, అభివృద్ధి సాధించాలని ప్రార్థించారు. ఈ సంప్రదాయాన్ని సజీవంగా కొనసాగిస్తున్న ఆకాశ్ తెగవారిని అభినందించారు. వారి సహజసిద్ధ స్థానికత, వారసత్వ సంపద గర్వకారణమని అన్నారు. 


అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రా కూడా ఆకాశ్ తెగవారిని సరోక్ ఫెస్టివల్ సందర్భంగా అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంబరాలు ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు, సంతోషాన్ని పంచాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 



Updated Date - 2022-01-16T19:07:09+05:30 IST