నిధుల్లేకుండా.. నిర్వహణ ఎలా?

ABN , First Publish Date - 2022-07-30T05:07:31+05:30 IST

జిల్లాలోని పురపాలక సంఘాల్లోని పాఠశాలలను నిధుల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. స్కూళ్ల నిర్వహణ ఖర్చులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో హెచ్‌ఎంలకు చేతిచమురు వదులుతోంది. అప్పులు చేసి మరీ స్టేషనరీ, ఇతరత్రా సామగ్రిని సమకూర్చుకుంటున్నారు.

నిధుల్లేకుండా.. నిర్వహణ ఎలా?
జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎంఎం ఉన్నత పాఠశాల

   గ్రాంట్‌ కోసం ఎదురు చూస్తున్న పురపాలక పాఠశాలలు

  రెండేళ్లుగా మంజూరు చేయని సర్కారు

  స్టేషనరీకి తప్పని ఇబ్బందులు

  సొంత సొమ్మును వెచ్చిస్తున్న హెచ్‌ఎంలు  

  ప్రభుత్వం స్పందించాలని విన్నపం

(పార్వతీపురం -ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని పురపాలక సంఘాల్లోని పాఠశాలలను నిధుల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. స్కూళ్ల నిర్వహణ ఖర్చులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో హెచ్‌ఎంలకు చేతిచమురు వదులుతోంది. అప్పులు చేసి మరీ స్టేషనరీ, ఇతరత్రా సామగ్రిని సమకూర్చుకుంటున్నారు. విద్యాభివృద్ధికి ఏటా కోట్లాది రుపాయలు వెచ్చిస్తున్నట్లు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికే పరిమితమవుతోంది. ఆచరణలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. పాఠశాలల నిర్వహణకు రెండేళ్లుగా నిధులు మంజూరు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

జిల్లా కేంద్రం పార్వతీపురంలో మూడు మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలు, 16 మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. సాలూరు మున్సిపాల్టీలో 22 ప్రాథమిక, ఒక యూపీ పాఠశాల, రెండు మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.  అయితే ఏటా ఆయా స్కూళ్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. ఆ మొత్తంతో  పాఠశాలలకు అవసరమైన స్టేషనరీతో పాటు క్రీడా పరికరాలు, దినపత్రికలు.. ఇలా పలు సామగ్రిని కోనుగోలు చేస్తుంటారు.  అదే విధంగా బడుల్లో చిన్నపాటి మరమ్మతులు, తాగునీటి నిర్వహణ,  ఇంటర్‌ నెట్‌ సదుపాయాలు,  విద్యుత్‌ బిల్లులకు  పాఠశాల గ్రాంటు నుంచి ఖర్చు చేసే వెసులుబాటు ఉంటుంది. అయితే పాఠశాలలకు  రెండేళ్లుగా నిధులు రాకపోవడంతో ఆయా స్కూళ్ల హెచ్‌ఎంలు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. తమ పరపతిని ఉపయోగించి స్టేషనరీని అరువు పద్ధతిపై తీసుకొస్తున్నారు.  ఈ విషయాన్ని బయటకు చెబితే ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోందనే భయంతో పలువురు ఉపాధ్యాయులు లోలోపలే ఆవేదన చెందుతున్నారు. ఎప్పటికైనా  ప్రభుత్వం నిధులు అందిస్తుందన్న ఆశతో వారున్నారు. 

రెండేళ్లు గడుస్తున్నా.. 

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా స్యూల్‌ గ్రాంట్‌ విడుదల చేస్తారు. జిల్లాలోని  రూ.10 వేలు మొదలుకొని, రూ.లక్ష వరకు నిధులు మంజూరయ్యే పాఠశాలలు ఉన్నాయి. మున్సిపల్‌ పాఠశాలలకు 2019-20లో 50 శాతం నిధులు విడుదలయ్యాయి. రెండేళ్ల పాటు నిధులు విడుదల చేయలేదు. ఇప్పటికైనా  ప్రభుత్వం స్పందించి తగు చర్యలు చేపట్టాలని జిల్లాలో మున్సిపల్‌ పాఠశాలల సిబ్బంది కోరుతున్నారు. 

 బడులు మూతపడినా.. 

కరోనా సమయంలో బడులు మూతపడినా విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు తప్పనిసరి. కనీసమొత్తం  చెల్లించాల్సి ఉంది. అదే విధంగా ఇంటర్‌ నెట్‌ బిల్లులు కూడా చెల్లించాలి. వాస్తవంగా విద్యా సంస్థలకు కేటగిరీ-2లో సర్వీసులు ఉండడం వల్ల విద్యుత్‌ బిల్లులు అధికంగానే వస్తాయి. అయితే కరోనా కారణం చూపి నిధులు విడుదల చేయకపోతే ఈ ఖర్చులు ఎవరూ భరిస్తారన్నది అందర్నీ వేధిస్తున్న ప్రశ్న.  కరోనా సమయంలో నెట్‌ వినియోగం, వివిధ పనుల నిర్వహణకు ఉపాధ్యాయులు స్టేషనరీ వినియోగించారు. వాటికి సంబంధించిన నిధుల పరిస్థితిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

    నిధులు విడుదలవుతున్నాయి 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలల నిర్వహణ ఖర్చుల బిల్లులు అప్‌లోడ్‌ చేసిన వెంటనే నిధులు విడుదలవుతున్నాయి. జిల్లాలో ఎక్కడా ఈ సమస్య లేదు. నిఽధుల విడుదలలో సమస్యలుంటే తక్షణమే పరిష్కరిస్తాం.  

- బ్రహ్మాజీరావు, ఇన్‌చార్జ్‌ డీఈవో, పార్వతీపురం మన్యం జిల్లా 


 

Updated Date - 2022-07-30T05:07:31+05:30 IST