పింఛన్‌ ‘ఔట్‌’!

ABN , First Publish Date - 2022-08-04T05:29:25+05:30 IST

నిన్న మొన్నటి వరకు బియ్యం కార్డుల ఏరివేత చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా సామాజిక పింఛన్ల కోతపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబ సభ్యుల సామాజిక పింఛన్లను తొలగించింది. దీంతో ప్రతినెలా పింఛన్‌ కోసం ఎదురుచూసే వృద్ధులు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. నెలవారీ తమ మందుల ఖర్చుకు ఉపయోగపడే పింఛన్‌ తొలగించడం అన్యాయమని వాపోతున్నారు.

పింఛన్‌ ‘ఔట్‌’!
పింఛన్‌ నిలిపేశారని ఆవేదన చెందుతున్న అప్పన్నమ్మ, సంధ్య

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబాలపై ప్రభుత్వం దృష్టి
సుమారు 2,500 మందికి పింఛన్ల నిలుపుదల
ఉసూరుమంటున్న వృద్ధులు, దివ్యాంగులు
అధికారికంగా సంఖ్య తేల్చని వైనం
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

- కోటబొమ్మాళి మండలం చినహరిశ్చంద్రపురానికి చెందిన పేరు తిర్లంగి అప్పన్నమ్మ వయసు 60 సంవత్సరాలు. ఈమె మూగ కావడంతో వికలాంగ పింఛన్‌ అందేది. ఈమె మనువడు తిర్లంగి కిరణ్‌కుమార్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఔట్‌సోర్సింగ్‌ ఎంఎన్‌ఓ ఉద్యోగం చేస్తున్నారు. నెలకు వేతనం రూ.12వేలు. దీంతో కిరణ్‌కుమార్‌ ఇంటి మ్యాపింగ్‌లో ఉన్న అప్పన్నమ్మ పింఛన్‌ను అధికారులు తొలగించారు.

- రణస్థలం మండలం జేఆర్‌ పురానికి చెందిన సుంకర సంధ్యకు రెండు కాళ్లు పనిచేయవు. వికలాంగ పింఛన్‌ అందేది. ఈమె తల్లి కేజీబీవీలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తోంది. దీంతో సంధ్య పింఛన్‌ను తొలగించారు. ప్రతినెలా సంధ్య మందుల కోసం వేలాది రూపాయలు ఖర్చువుతున్నాయని.. ఆర్థికంగా ఇబ్బందలు పడుతున్నామని పింఛన్‌ పునరుద్ధరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

నిన్న మొన్నటి వరకు బియ్యం కార్డుల ఏరివేత చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా సామాజిక పింఛన్ల కోతపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబ సభ్యుల సామాజిక పింఛన్లను తొలగించింది. దీంతో ప్రతినెలా పింఛన్‌ కోసం ఎదురుచూసే వృద్ధులు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. నెలవారీ తమ మందుల ఖర్చుకు ఉపయోగపడే పింఛన్‌ తొలగించడం అన్యాయమని వాపోతున్నారు. నిబంధనల ప్రకారం ఆదాయ వనరులు.. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.పదివేలు, పట్టణాల్లో రూ.12వేలు దాటినవారు పింఛన్‌కు అనర్హులు. ఔట్‌సోర్సింగ్‌ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రస్తుతం రూ.12వేల నుంచి రూ. 15వేల వరకు ప్రతి నెలా వేతనం లభిస్తోంది. ఇదే సాకుతో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పింఛన్‌ను ఈ నెల 1 నుంచి అధికారులు నిలిపివేశారు. ఇటీవల వలంటీర్లు పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి రేషన్‌కార్డు నంబర్‌తో కలిపి ఇంటికి మ్యాపింగ్‌ చేశారు. దీంతో రేషన్‌కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు జతయ్యాయి. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో సామాజిక పింఛన్లు పొందుతున్నవారిని గుర్తించారు. జిల్లాలో సుమారు 2,500 మంది పింఛన్లను ఈ నెల తొలగించారు.

గత నెలతో పోల్చితే..
జిల్లాలో జూలై నెలలో 3,03,787 మందికి సామాజిక పింఛన్లు అందజేశారు. ఈ నెలలో 13,727 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. మొత్తంగా ఈ నెల  3,17,514 మందికి పింఛన్లు అందజేయాలి. కాగా.. కొత్త లబ్ధిదారులతో కలిపి 3,14,439 మందికి మాత్రమే పింఛన్లు అందజేశారు. జూలై నెలతో పోల్చితే కొత్త పింఛన్ల పోనూ.. 3,075 మందిని జాబితా నుంచి తొలగించారు. ప్రతినెలా వృద్ధులు, పింఛన్లు పొందుతున్న ఇతర రోగులు నాలుగైదు వందల మంది ఉంటారు. ఈ లెక్కన ఈ నెల ఔట్‌సోర్సింగ్‌ కుటుంబాలకు చెందిన సుమారు 2,500 మంది సామాజిక పింఛన్లను తొలగించారు. కానీ దీనిపై అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. కేవలం ఆధార్‌ నెంబర్‌తో పింఛన్‌ స్టేటస్‌ చూసి.. రద్దయిందని చెబుతున్నారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు లబోదిబోమంటున్నారు.  వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను అడిగినా.. స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని వాపోతున్నారు. వచ్చిన అరకొర వేతనాలను సాకుగా చూపి.. తమ కుటుంబ సభ్యుల పింఛన్‌ నిలిపివేస్తే ఎలా బతకగలమని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పింఛన్లు పునరద్ధరించాలని బాధితులు కోరుతున్నారు.

 ఆటోమేటిక్‌గా.. :
ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పింఛన్లు నిలిచిపోయిన మాట వాస్తవమే. సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జీతాలు వచ్చేవారికి.. ఆటోమేటిక్‌గా వారి కుటుంబ సభ్యుల్లో సామాజిక పింఛన్లు నిలిచిపోయాయి. ఎన్ని పాత పింఛన్లు తొలగిపోయాయనే వివరాలు ప్రస్తుతం లేవు.
 - బి.శాంతిశ్రీ, డీఆర్డీఏ పీడీ


Updated Date - 2022-08-04T05:29:25+05:30 IST