మోదీజీ..ఎన్నికలు జరగనీయండి ప్లీజ్: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-03-12T01:46:43+05:30 IST

ఎంసీడీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనను ఎన్నికల కమిషన్ ఇటీవల వాయిదా..

మోదీజీ..ఎన్నికలు జరగనీయండి ప్లీజ్: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఎంసీడీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనను ఎన్నికల కమిషన్ ఇటీవల వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారంనాడు స్పందించారు. ''ముకుళిత హస్తాలతో ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నికలు జరిగేలా చూడమని వేడుకుంటున్నాను. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. దేశం ముఖ్యం, రాజకీయ పార్టీలు కాదు. ఎన్నికల కమిషన్‌పై మనం ఒత్తిడి తెస్తే, వ్యవస్థలు బలహీనమవుతాయి. వ్యవస్థలు బలహీనంగా కాకుండా మనం చూడాలి. వ్యవస్థలు బలహీనమైతే ప్రజాస్వామ్యం, దేశం బలహీనమవుతాయి'' అని ప్రధానికి ఒక ట్వీట్‌లో కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.


కాగా, ఎన్నికలు వాయిదా వేయమని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు (ఎస్‌ఈసీ) కేంద్రం లేఖ రాయడం ఇది మొదటిసారని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్‌లను విలీనం చేయాలనుకుంటున్నట్టు  కేంద్రం ఇచ్చిన సమాచారం మేరకే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనను ఈసీ వాయిదా వేసిందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడెనిమిదేళ్లు అయిందని, మూడు మున్సిపాలిటీలను ఏకీకృతం చేయాలనే ఆలోచన అప్పుడు చేయకుండా ఎన్నికలపై ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు కొద్ది సేపటి క్రితం ఆమాట తెలియజేయడం ఏమిటని ప్రశ్నించారు. ఢిల్లీలో ఆప్ గాలి బలంగా ఉందనే విషయం, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనే విషయం బీజేపీకి బాగా తెలుసునని సీఎం అన్నారు. ఎన్నికలకు, మూడు మున్సిపల్ కార్పొరేషన్లు విలీనం చేయడానికి ముడి ఎందుకు పెడుతున్నారో తనకు తెలియడం లేదని పేర్కొన్నారు. ''మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేసి ఎన్నికలు జరిపితే ఏమవుతుంది? మూడుగా ఉంటే కౌన్సిలర్లు వారి వారి ఆఫీసుల్లో కూర్చుంటారు. మూడింటినీ  విలీనం చేస్తే.. కలిసి కూర్చుంటారు'' అని కేజ్రీవాల్ వివరించారు.


కాగా, నార్త్, సౌత్ మున్సిపల్ కార్పొరేషన్లలో 104 వార్డుల చొప్పున ఉన్నాయి. ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో 64 వార్డులు ఉన్నాయి. సగానికి సగం వార్డులు మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేశారు. ఎస్‌సీ, ఎస్‌సీ అభ్యర్థులకు కూడా రిజర్వేషన్ ఉంది. 2017లో జరిగిన ఎంసీడీ పోల్స్‌లో బీజేపీ భారీ విజయం సాధించింది. మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో 272 వార్డులకు 191 వార్డులను ఆ పార్టీ గెలుచుకుంది. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ కేవలం 49 వార్డులు గెలుచుకుంది. కాంగ్రెస్ 31 వార్డులు సొంతం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థులు నార్త్ ఢిల్లీలో 3 వార్డులు, సౌత్ ఢిల్లీలో 4 వార్టులు, ఈస్ట్ ఢిల్లీలో ఒక వార్డు గెలుచుకున్నారు.

Updated Date - 2022-03-12T01:46:43+05:30 IST