మోదీని కలిసిన పవార్... రాజకీయ వర్గాల్లో చర్చ..!

ABN , First Publish Date - 2022-04-06T21:50:26+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ బుధవారంనాడు కలుసుకున్నారు. పార్లమెంటులో ఉభయులూ..

మోదీని కలిసిన పవార్... రాజకీయ వర్గాల్లో చర్చ..!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ బుధవారంనాడు కలుసుకున్నారు. పార్లమెంటులో ఉభయులూ సుమారు 20 నుంచి 25 నిమిషాల పాటు సమావేశమయ్యారు. దీంతో వీరి సమావేశం వెనుక కారణం ఏమై ఉండవచ్చనేది  ప్రధానంగా మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) నేతలపై, ముఖ్యంగా ఎన్‌సీపీ, శివసేన నేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్ (ఈడీ) వరుస దాడులకు పాల్పడుతుండంతో మోదీని పవార్ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.


కాగా, వవార్, మోదీ సమావేశంపై ఎన్‌సీపీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఇది సహజమైన ప్రక్రియేనని, మరీ పెద్దదిగా చేసి చూడనవసరం లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. సమావేశం గురించి తనకు సమాచారం ఏమీ లేదని, సమాచారం తెలిస్తే చెబుతానని అన్నారు. అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు దేశ ప్రధాని, జాతీయ పార్టీ నేత సమావేశం కావడం సహజమేనని, ఆ అంశాలు ప్రస్తావనకు వచ్చి ఉండొచ్చని, ఇద్దరూ పెద్ద నేతలేనని అజిత్ పవార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.


కాగా, ఎన్‌సీపీ  నేతలపై ఈడీ చర్యలు వాస్తవమే అయినప్పటికీ, బీజేపీ, ఎన్‌సీపీ మధ్య పొరపొచ్చాలు లేవని బీజేపీ నేత సుధీర్ ముంగటివార్ అన్నారు. పలువురు ఎంవీఏ నేతలపై ఈడీ విచారణ జరుపుతోందని, ఇద్దరు ఎన్‌సీపీ నేతలు జైలులో ఉన్నారని, పలువురు శివసేన నేతలపై కూడా విచార జరుగుతోందని, బహుశా ఆ కారణంగానే ప్రధానితో పవార్ సమావేశమై ఉండవచ్చని మరో బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్ అభిప్రాయపడ్డారు. అవినీతి అంశాలపై రాజీపడేది లేదని ప్రధాని మోదీ ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Updated Date - 2022-04-06T21:50:26+05:30 IST