వరుస కేసులతో.. అలజడి!

ABN , First Publish Date - 2020-07-05T11:53:23+05:30 IST

సిక్కోలులో కరోనా పాజిటివ్‌ కేసుల అలజడి కొనసాగుతోంది. వైరస్‌ సామాజిక వ్యాప్తి దశకు చేరడంతో అంతటా భయాందోళన వ్యక్తమవుతోంది.

వరుస కేసులతో.. అలజడి!

మస్కట్‌లో కరోనాతో పలాస వ్యక్తి మృతి


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి): సిక్కోలులో కరోనా పాజిటివ్‌ కేసుల అలజడి కొనసాగుతోంది. వైరస్‌ సామాజిక వ్యాప్తి దశకు చేరడంతో అంతటా భయాందోళన వ్యక్తమవుతోంది. తాజాగా శనివారం 76 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 864కు చేరింది. ఇటీవల ఒకేరోజు 72 కేసులు నమోదు కాగా, తాజాగా శనివారం 76 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడం గమనార్హం.  జిల్లాలో ఇప్పటివరకు 96,718 మంది నుంచి శ్వాబ్‌ సేకరించారు. శనివారం 1,641 నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు.


పరీక్ష ఫలితాలు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో ఎన్ని పాజిటివ్‌ కేసులు వస్తాయోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా మృతుల సంఖ్య కూడా పెరుగుతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా పలాస ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉపాధి కోసం మస్కట్‌ వెళ్లి అక్కడ కరోనా భారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమాచారం కుటుంబ సభ్యులకు చేరడంతో విషాదంలో మునిగిపోయారు. కనీసం మృతదేహాన్ని కూడా చూడలేకపోయామని కుటుంబ సభ్యులు మానసిక వేదనలో కుంగిపోతున్నారు. పలాసలో ఏడుగురు వార్డు వలంటీర్లకు కూడా కరోనా పాజిటివ్‌ లక్షణాలు నిర్ధారణయ్యాయి. దీంతో ఆ వలంటీర్లు ఎవరెవరిని కలిశారనేది తేల్చడం అధికారులకు పెద్ద సమస్యగా మారింది. ఒక్కో వలంటీర్‌ కనీసం 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలను చేరవేసే బాధ్యతను తీసుకున్నారు. పింఛన్‌, నాణ్యమైన బియ్యం వంటివి నేరుగా ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు వీరి వల్ల మహమ్మారి ఎందరిని తాకిందో అనేదానిపై అంచనా వేసేందుకు అధికారులు హైరానా పడుతున్నారు.


యంత్రాంగం అప్రమత్తం...

కరోనా నివారణకు జిల్లా యంత్రాంగం తమ వంతు కృషి చేస్తోంది. కలెక్టర్‌ జె.నివాస్‌ స్వయంగా కరోనా నియంత్రణ చర్యలు పర్యవేక్షిస్తున్నారు.  గ్రామాల్లో కేసులు వచ్చిన వెంటనే స్పందిస్తున్నారు. ఆ గ్రామాలకు అంబులెన్స్‌లు పంపించి బాధిత కుటుంబాలను రాగోలులోని కొవిడ్‌ ఆస్పత్రికి(జెమ్స్‌)  తరలిస్తున్నారు. ఇలాంటి గ్రామాలను కంటైన్మెంట్‌  జోన్లుగా ప్రకటించి రాకపోకలు కట్టుదిట్టం చేస్తున్నారు. కలెక్టర్‌ నివాస్‌, డీఎంహెచ్‌ఓ, వైద్య బృందాలు స్వయంగా కంటైన్మెంట్‌ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పాలు, పెరుగు, తాగునీరు వంటివి ఇంటింటికీ చేరేలా చర్యలు చేపడుతున్నారు. కరోనా  బాధితులు ఎవరెవరితో కాంటాక్ట్‌ అయ్యారో వారందరినీ గుర్తించి.. హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

Updated Date - 2020-07-05T11:53:23+05:30 IST