Abn logo
Nov 3 2020 @ 11:14AM

చలివేళ బహుపరాక్‌!

ఆంధ్రజ్యోతి(03-11-2020)

నవంబర్‌ వచ్చిందంటే చలి పెరుగుతుంది. గతంతో పోల్చుకుంటే ఈసారి చలి చాలా ఎక్కువగా ఉంది. చలితో పాటు ఎలర్జీలు, ఆస్తమా వంటి వ్యాధుల తీవ్రత కూడా పెరుగుతుంది. వీటిని నిర్యక్షం  చేస్తే మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. వీటికి తోడు- కరోనా వైరస్‌ ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో- ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో  హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రి ఇంటర్నల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ కె శివరాజు వివరిస్తున్నారు. 


‘‘శీతాకాలంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతాయి. ఉష్ణోగ్రతలు తగ్గితే- వైరస్‌కు వ్యాప్తి చెందే శక్తి పెరుగుతుంది. అందుకే అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో ఫ్లూ ఎక్కువగా వస్తుంది. వైరల్‌ జ్వరాలు కూడా ఎక్కువగా వస్తాయి. సాధారణంగా వైరల్‌ జ్వరం ఐదు రోజుల్లో తగ్గిపోతుంది. శీతాకాలంలో ఈ తరహా జ్వరాలు రావటం.. వాటికి కొన్ని మందుల ద్వారా చికిత్స చేయటం సామాన్యమైన విషయమే! అయితే ఈసారి కొవిడ్‌ కొత్తగా వచ్చి చేరింది. ఒక కోణం నుంచి చూస్తే- కొవిడ్‌ సోకిన వారిలో ఉండే లక్షణాలు.. సాధారణ వైరల్‌ జ్వరం వచ్చిన వారిలో కనిపించే లక్షణాలు ఒకటే! పైగా కొవిడ్‌ సోకిన వారిలో చాలామందికి ఆ వైరస్‌ సోకిందని కూడా తెలియదు. అంటే వారిలో ఎటువంటి లక్షణాలు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో - ఈ రెండింటి మధ్య తేడాను ఎలా గుర్తించాలనేదే పెద్ద సమస్య. నా వద్దకు వచ్చిన కొవిడ్‌ పేషెంట్ల లక్షణాల ఆధారంగా చూస్తే- వాసన తెలియకపోవటం.. రుచి తెలియకపోవటం రెండు ప్రధానమైన అంశాలు. అలసట పెరిగి.. వాసన, రుచి తెలియకపోతే- కొవిడ్‌ సోకినట్టు చెప్పవచ్చు. 


ఇతర సమస్యలున్నవారు..

బీపీ, మధుమేహం ఉన్నవారు అనేక మంది ఉన్నారు. శీతాకాలం వస్తే వీరు కూడా అదనపు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. నా అనుభవం ప్రకారం- బీపీ ఉన్నవారు శీతకాలం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. హఠాత్తుగా ఉష్ణోగ్రతలు తగ్గిపోవటం వల్ల రక్తనాళాలు సంకోచిస్తాయి. దీని వల్ల రక్తప్రసరణలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ ఇబ్బందులను సరిచేయటానికి గుండె మరింత వేగంగా రక్తాన్ని పంప్‌ చేస్తూ ఉంటుంది. అందువల్ల బీపీ ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ బీపీని చెక్‌ చేసుకోవాలి. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలను, ఉప్పును వీలైనంతగా తగ్గించాలి. ఇక మధుమేహ రోగుల్లో కొంతమందికి నరాల సమస్యలు ఉంటాయి. వీటిని వైద్య పరిభాషలో డయాబెటిక్‌ న్యూరోపతిక్‌ ప్రొబ్లమ్స్‌ అంటారు. ఈ సమస్యలు ఉన్నవారిలో కొందరికి-  అరికాళ్ల వద్ద రక్తప్రసారం సరిగ్గా ఉండదు. ఇలాంటి వారికి  శీతాకాలంలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. రక్తనాళాలు సంకోచించటం వల్ల కాళ్లకు సరిగ్గా రక్తప్రసారం జరగదు. అందువల్ల వీరు  క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ రెండింటితో పాటుగా ఎలర్జీలు, తరచుగా జలుబుతో బాధపడేవారు కొందరు ఉంటారు. వీరికి చలిగాలి తగలకుండా ఉంటే అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. కొవిడ్‌ భయంతో మాస్క్‌లు ధరిస్తున్నారు. అందువల్ల బయట నుంచి వచ్చే దుమ్ము, ధూళి వీరికి సోకదు. 


- డాక్టర్‌ శివరాజు,

కిమ్స్‌ ఆస్పత్రి, హైదరాబాద్‌ 

రెట్టింపు జాగ్రత్తలతో రక్షణ!

కొవిడ్‌ నుంచి కోలుకున్న వాళ్లు ఈ సీజన్‌లో మరింత అప్రమత్తంగా నడుచుకోక తప్పదు. ఆరోగ్యకరమైన ఆహార, జీవనశైలిని అనుసరించడంతో పాటు సీజనల్‌ లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచుతూ, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.


ఈ లక్షణాలు ఉంటే?

కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత బయల్పడే కొన్ని లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే చల్లని వాతావరణం మూలంగా మొదలయ్యే జలుబు, దగ్గులను నిర్లక్ష్యం చేయకూడదు. కరోనాను పోలిన ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. 


ఆగని దగ్గు, శ్వాసలో ఇబ్బందులు, ఛాతీలో అసౌకర్యం/నొప్పి, నిస్సత్తువ, బలహీనత, మానసిక కుంగుబాటు, నిద్ర సమస్యలు.


వైద్యులను ఎప్పుడు కలవాలి?

కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోవడానికి 4 నుంచి 6 వారాల సమయం పడుతుంది. అయితే ఆ లోగా లక్షణాలు తిరగబెట్టినా, కొత్త లక్షణాలు తలెత్తినా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి. మరీ ముఖ్యంగా ఈ క్రింది లక్షణాలను గమనించాలి.


దగ్గు విడవకుండా వేధిస్తున్నప్పుడు

శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఎక్కువైనప్పుడు, చిన్న పనికే ఆయాసం తలెత్తుతున్నప్పుడు

జ్వరం తిరగబెట్టినప్పుడు

ఛాతీలో నొప్పిగా ఉన్నా, నొక్కుతున్నట్టు అనిపించినా

జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగకపోయినా

అయోమయానికి లోనవుతున్నా

ఆందోళన అధికమవుతున్నా


నిస్సత్తువ!

కొవిడ్‌ లేదా మరే ఇతర వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్న తర్వాత అయినా ప్రతి ఒక్కరిలో కనిపించే అత్యంత సాధారణ లక్షణం ఇది. అలాంటప్పుడు శక్తికి తగిన పనులు కల్పించుకోవాలి. ఆ పనుల ప్రకారం టైమ్‌టేబుల్‌ తయారుచేసుకోవాలి. హడావిడిగా కాకుండా నెమ్మదిగా పనులు ముగించుకోవాలి. శక్తి సమకూరే ఆహారం తీసుకోవాలి. 


యాంగ్జయిటీ/డిప్రెషన్‌!

ఒత్తిడి తగ్గడం కోసం తగినంత సమయం నిద్రపోవాలి. వార్తలు, సోషల్‌ మీడియాలకు దూరంగా ఉండాలి. క్రమం తప్పక వ్యాయామం చేయాలి. ధ్యానం లేదా యోగా చేయాలి. స్నేహితులు, సన్నిహితులతో సత్సంబంధాలను పెంచుకోవాలి. ప్రకృతికి దగ్గరగా మెలగాలి.


ఆహార నియమాలు!

రోగనిరోధకశక్తితో పాటు, శక్తి సమకూరడర  కోసం పౌష్ఠికాహారం తీసుకోవాలి. మాంసకృత్తులు, ఖనిజలవణాలు, విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. గోధుమలు, రాగులు, ఓట్లు మొదలైన తృణధాన్యాలు తీసుకోవాలి. మాంసం, గుడ్లు, చేపలు తీసుకోవాలి. శాకాహారులు సరిపడా మాంసకృత్తుల కోసం సోయా, నట్స్‌, సీడ్స్‌ తినాలి. వాల్‌నట్స్‌, బాదం, జీడిపప్పు తినాలి. అరటిపళ్లు, ఆరెంజ్‌, యాపిల్స్‌ తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లలో తేనె కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కాబట్టి పరిగడుపున ఈ పానీయం తీసుకోవాలి. వేపుళ్లు, నూనెతో కూడిన పదార్థాలు, మసాలాలు, కారం కలిపి వండిన పదార్థాలు, శీతల పానీయాలు తీసుకోకూడదు.


- డాక్టర్‌ మల్లు గంగాధర్‌ రెడ్డి,

సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌,

యశోద హాస్పిటల్‌, సికింద్రాబాద్‌.


ప్రత్యేకం మరిన్ని...