భూముల ధరలకు రెక్కలు

ABN , First Publish Date - 2021-12-27T05:52:50+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భూముల మార్కెట్‌ విలువలను, రిజిస్ట్రేషన్‌ ధరలను పెంచిన విషయం తెలిసిందే.

భూముల ధరలకు రెక్కలు
కామారెడ్డి పట్టణ శివారుల్లో వ్యవసాయ భూములు వెంచర్లుగా మారుతున్న దృశ్యాలు

- భూములు, రిజిస్ట్రేషన్‌ ధరలను పెంచిన ప్రభుత్వం

- దీంతో జిల్లాలో భారీగా పెరిగిన వ్యవసాయ, ఇళ్ల స్థలాల ధరలు

- రూ.కోటి నుంచి రూ.3 కోట్ల వరకు పలుకుతున్న ఎకరం భూమి

- గజం రూ.20వేల వరకు

- భూములపైనే రైతులు, వ్యాపారులు, ఉద్యోగుల పెట్టుబడులు

- భూములకు విలువ రావడంతో భారీగా పెరుగుతున్న కబ్జాలు

- ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు దొరకని భూములు


కామారెడ్డి(ఆంధ్ర జ్యోతి), డిసెంబరు 26: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భూముల మార్కెట్‌ విలువలను, రిజిస్ట్రేషన్‌ ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో భూములకు భారీ డిమాండ్‌ పెరిగింది. వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు రూ.లక్షల నుంచి రూ.కోట్ల వరకు ధరలు పలుకుతున్నాయి. జిల్లాలో గడిచిన పది సంవత్సరాల్లో వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైనే పెట్టుబడులు పెడుతుండడంతో ధరలు పెరిగాయి. జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీల పరిధిలో ఊహించని రీతిలో ధరలు ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌, అపార్ట్‌మెంట్లు, ఇళ్ల నిర్మాణాలు చాలా అవుతుండడంతో భూముల ధరలు సామాన్యుడు వింటేనే దడుసుకునే రీతిలో పెరిగాయి. ధరలు భారీగా పెరగడంతో కబ్జాలు, ఆక్రమణలు కూడా పెరుగుతున్నాయి. భూముల ధరలు పెరగడం వల్ల గ్రామ, మండల మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ అవసరాలకు కూడా దొరకని పరిస్థితులు నెలకొంటున్నాయి.

రెట్టింపైన భూముల ధరలు

జిల్లాలో గడిచిన కొన్నేళ్లుగా భూముల రేట్లు బాగా పెరిగాయి. దశాబ్దకాలంలో డబుల్‌కు మించి ధరలు పెరిగాయి. జిల్లాలో ఏ గ్రామ పరిధిలోకి వెళ్లినా ఎకరం రూ.10 లక్షలకు తక్కువగా ఎక్కడా లేదు. జాతీయ రహదారులు, వ్యవసాయం బాగా ఉన్న గ్రామాలలో ఎకరం రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ధర పలుకుతోంది. కామారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల్లో ఊహించని రీతిలో ధరలు ఉన్నాయి. ఎకరం రూ.1 కోటి నుంచి రూ.3 కోట్ల వరకు పలుకుతున్నాయి. ప్రధాన రహదారులకు దగ్గరగా ఉన్న భూముల ధరలు ఎక్కువగా పలుకుతున్నాయి. పదేళ్ల క్రితం పట్టణ శివారులో ఎకరం రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉండగా అదేభూమికి ప్రస్తుతం రూ.3 కోట్ల వరకు ధర పలుకుతోంది. గ్రామాల్లో పదేళ్ల క్రితం ఎకరం రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉండగా ప్రస్తుతం ఆ ధరకు పావు ఎకరం కూడా వచ్చే పరిస్థితి లేదు.

భూములపైనే పెట్టుబడులు

గడిచిన 10 సంవత్సరాలలో వ్యవసాయ పంటల దిగుబడి పెరగడం, సాగునీరు అందుబాటులోకి రావడం, ప్రభుత్వాలు రైతుబంధు, పీఎం కిసాన్‌లాంటి పథకాల కింద నగదు అందిస్తుండడం వ్యవసాయ భూములకు ధరలు రావడానికి ఓ కారణంగా మారాయి. సాగునీరు పుష్కలంగా ఉండడంతో రైతులు ఏటా రెండు నుంచి మూడు పంటలు పండిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు కూడా బాగా వస్తున్నాయి. దీంతో గ్రామాల్లో రైతుల వద్దకు డబ్బులు వస్తే వాటిని భూములపైనే పెడుతున్నారు. వీటితో పాటు వ్యాపారాల్లో లాభాలు వచ్చిన వారు కూడా గత కొన్నేళ్లుగా భూములు కొనుగోలు చేస్తున్నారు. ఎంత దూరమైనా వెళ్లి భూములను కొంటున్నారు. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామాల్లో ఇతర ప్రాంతాల్లోనూ భూములను కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో భూముల ధరలకు రెక్కలు రావడంతో రాజకీయ నేతలు సైతం రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి దిగుతున్నారు. అధికార, ప్రతిపక్షం అనే తేడా లేకుండా భూములపైనే నజరు పెట్టారు. తమ రాజకీయ ఎదుగుదలకు ఇది మార్గంగా చూస్తున్నారు. వీటిపై వచ్చే ఆదాయాన్ని తమ పదవులకు ఉపయోగిస్తున్నారు.  ఇలా అన్ని వర్గాల వారు తమ పెట్టుబడులను భూములపై పెడుతుండడంతో ధరలు అమాంతంగా పెరిగాయి.

సామాన్యునికి దొరకని పరిస్థితి

ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌, భూముల ధరలను పెంచేసింది. మార్కెట్‌లోనూ ప్రభుత్వ ధరల కంటే భూములు, ఇళ్ల స్థలాలు అమాంతంగా పెరిగిపోయాయి. ప్రతీ సామాన్యునికి సొంతింటి కల నెరవేర్చుకోవాలనే ఆలోచనలో ఉంటారు. కానీ ప్రస్తుత ధరల ప్రకారం కనీసం 100 గజాల ప్లాట్‌ కూడా మధ్య తరగతి ప్రజానికం కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇళ్ల స్థలాల ధరలు పెరగడంతో ఎక్కువ మంది ప్లాట్లను కొనలేకపోతున్నారు. కామారెడ్డి, బాన్సువాడ పట్టణ శివారుల్లో గజం భూమి ధర రూ.10వేల నుంచి రూ.25వేల వరకు పలుకుతోంది. పట్టణ నడిబొడ్డులో గజం రూ.లక్షకు పైగానే ఉంది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీతో పాటు ఆయా మండల కేంద్రాల్లోనూ రూ.6వేల నుంచి రూ.15 వేల వరకు పలుకుతోంది. 10 ఏళ్ల క్రితం సగం కూడా లేని ధరలు ఒకేసారి పెరిగాయి. ఇళ్ల స్థలాలు దిగువ మధ్య తరగతి పేదలు కొనలేని పరిస్థితి ఉంది.

పెరుగుతున్న ఆక్రమణలు

భూముల ధరలు బాగా పెరుగుతుండడంతో అక్రమ లేఅవుట్‌లు వెలుస్తున్నాయి. వందల సంఖ్యలో ప్లాట్లను చేసి అమ్మకాలు చేస్తున్నారు. ఇవి కూడా భారీగానే పెరిగాయి. జిల్లాలో భూముల ధరలు పెరిగినప్పటి నుంచి భూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ధరలు లక్షల నుంచి కోట్లకు చేరడంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. రెవెన్యూ, పంచాయతీ శాఖలోని కొంత మంది అధికారుల సహకారంతో అమ్మకాలు జరుగుతున్నాయి. వీటితో పాటు అసైన్డ్‌, ఇతర భూములు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని వీటిని అమ్మకాలు చేస్తున్నారు. మున్సిపాలిటీల్లోని పార్కులు, కాలువలను సైతం కబ్జా చేసి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. పంచాయతీల పరిధిలో చెరువులను, ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేస్తున్నారు. అదేవిధంగా పట్టా భూములను సైతం ఆక్రమణలకు పాల్పడుతూ ప్లాట్లుగా మార్చేస్తూ రియల్‌ వ్యాపారులు భూ దందాను కొనసాగిస్తున్నారు.

Updated Date - 2021-12-27T05:52:50+05:30 IST