మద్యం పక్కదారి

ABN , First Publish Date - 2021-06-14T04:44:11+05:30 IST

నెల్లూరులోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎలైట్‌ మద్యం మాల్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం పక్కదారి పడుతోంది.

మద్యం పక్కదారి
నెల్లూరులోని ఎలైట్‌ మద్యం దుకాణం

ఎలైట్‌ మాల్స్‌లో సిబ్బంది చేతివాటం

బార్లకు మద్యం సీసాలు తరలిస్తూ...

నచ్చిన వారికే  కోరిన బ్రాండ్లు ఇస్తూ...

ఇద్దరు సిబ్బందిని తొలగించిన ఈఎస్‌


నెల్లూరు(క్రైం), జూన 13 : నెల్లూరులోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎలైట్‌ మద్యం మాల్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం పక్కదారి పడుతోంది. ఎలైట్‌ దుకాణాల్లో విధులు  నిర్వహిస్తున్న సిబ్బంది బార్ల యజమానులతో చేతులు కలిపి పలు బ్రాండ్‌ల మద్యం ఫుల్‌ బాటిళ్లను గుట్టుచప్పుడు కాకుండా బార్లకు తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఎక్కువగా మందుబాబులు కొనుగోలు చేసే కొన్ని బ్రాండ్ల మద్యం దుకాణంలో స్లాక్‌ ఉన్నా, లేదని చెబుతూ నచ్చిన వారికి ఆ మద్యాన్ని ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నారని మందుబాబులు పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై రోజూ ఎలైట్‌ దుకాణాల వద్ద సిబ్బందికి మద్యం కొనేవారికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక మద్యం విక్రయించే వేళలు దాటినా షెట్టర్లు ఎత్తి మద్యం ఇస్తున్నారన్న ఫిర్యాదులు ఎక్సైజ్‌ అధికారులకు అందుతున్నాయి. ఇలా ప్రభుత్వం నెల్లూరులో ఏర్పాటు చేసిన ఎలైట్‌ మద్యం మాల్స్‌ అక్రమాలకు నిలయంగా మారాయి.


సిబ్బంది చేతివాటం


ప్రభుత్వ మద్యం దుకాణాలకు భిన్నంగా నగరంలోని ప్రధాన సెంటర్లలో పెద్ద కాంప్లెక్స్‌లను అద్దెకు తీసుకొని వేలల్లో అద్దెలు చెల్లిస్తూ ఎలైట్‌ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. నెల్లూరులో నాలుగు ఎలైట్‌ మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల్లో అన్ని బ్రాండ్‌ల మద్యం ఫుల్‌ బాటిల్‌లను అమ్మకానికి ఉంచుతారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దొరకని పలు బ్రాండ్‌ల మద్యంతో పాటు ఖరీదైన బ్రాండ్‌ల మద్యాన్ని ప్రదర్శనగా ఉంచి ఎవరికి నచ్చిన మద్యం బాటిళ్లను వారు తీసుకొని కౌంటర్‌ వద్దకు వచ్చి నగదు చెల్లించేలా ఎలైట్‌ దుకాణాల్లో అవకాశం కల్పించారు. ఎలైట్‌ మద్యం దుకాణాలు నగరంలో ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే వీటికి మంచి ఆదరణ లభించింది. అయితే ఈ దుకాణాల్లో విధులు నిర్వహించే సిబ్బంది చేతివాటం చూపుతున్నారు. నగరంలోని పలు బార్ల యజమానులు సిబ్బందిని మచ్చిక చేసుకొని వారి సహకారంతో పలు బ్రాండ్‌ల మద్యాన్ని బార్లకు తరలిస్తున్నారన్న ఆరోపణలు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దొరకని పలు బ్రాండ్‌లు ఎలైట్‌ దుకాణంలో అందుబాటులో ఉంచడంతో ఆ మద్యం కోసం పలువురు మందుబాబులు పోటీ పడుతున్నారు. దీంతో సిబ్బంది మెన్సనహౌస్‌ వంటి బ్రాండ్‌లను అసలు డిస్‌ప్లేలో పెట్టకుండా దాచిపెట్టి ముందుగా మాట్లాడుకున్న కస్టమర్లకు అధిక ధరలకు ఆ బ్రాండ్‌ల మద్యాన్ని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. సమయం ముగిసిన తర్వాత కూడా షెట్టర్లు తెరిచి మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారని పలు ఫిర్యాదులు ఇప్పటికే అధికారులకు అందాయి.గత శనివారం ఎక్సైజ్‌ ఈఎస్‌ వెంకటరామిరెడ్డి నగరంలోని కేవీఆర్‌ పెట్రోల్‌ బంకు వద్ద ఉన్న ఎలైట్‌ దుకాణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, సిబ్బంది అవకతవకలకు పాల్పడుతున్నారని నిర్ధారించుకొని ఇద్దరు సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. దీనిని బట్టి చూస్తుంటేనే ఎలైట్‌ దుకాణాల్లో సిబ్బందిపై వస్తున్న ఆరోపణలు వాస్తవాలే అని స్పష్టంగా అర్ధమవుతుంది.


Updated Date - 2021-06-14T04:44:11+05:30 IST