గాలివాన బీభత్సం

ABN , First Publish Date - 2020-05-27T09:56:55+05:30 IST

జిల్లాలో పలుచోట్ల మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. పలు గ్రామాల్లో రేకులషెడ్లు, ..

గాలివాన బీభత్సం

ఓబుళదేవరచెరువు /అమడగూరు/ పరిగి, మే 26: జిల్లాలో పలుచోట్ల మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. పలు గ్రామాల్లో రేకులషెడ్లు, చౌడు మిద్దెలు దెబ్బతిన్నాయి. ఓబుళదేవరచెరువు మండలం తాటిమేకలపల్లిలో రేకుల షెడ్‌, మిద్దె పూర్తి గా దెబ్బతిన్నాయి. రెండు ఆవులు గాయపడ్డాయి. సున్నంపల్లి పంచాయతీ వంచిరెడ్డిపల్లి కాలనీలో ఓ ఇంటి పైకప్పు నేలకొరిగింది. అమడగూరు మండలంలోని మహమ్మదాబాద్‌ గ్రామంలో చెట్లు కూలిపోయాయి.


విద్యుత్‌ తీగలు తెగిపోవ డంతో అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. అనంతరం లైన్‌మ్యాన్‌లు మరమ్మతులు చేశారు. పరిగి మండలంలోని ముళ్లమోతుకపల్లి, గొరవనహళ్లి, మోదా గ్రామా ల్లో పంట నష్టం జరిగింది. ముళ్లమోతుకపల్లికి చెందిన ఎంఎస్‌ సత్యనారాయణరెడ్డి నాలుగు ఎకరాల్లో సాగుచేసిన అరటిపంట పూర్తిగా ధ్వంసం అయింది. సుమారు రూ.5లక్షలు పంట నష్టం జరిగినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అదేవిధంగా మామిడిపంట కూడా దెబ్బతింది. 


బొమ్మనహాళ్‌: మండలంలోని ఉద్దేహాళ్‌, బండూరు, లింగదహాళ్‌, దేవగిరి క్రాస్‌ తదితర గ్రామాలలో మంగళవారం సా యంత్రం భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఈదురుగాలులకు ఉద్దేహాళ్‌లో చిన్న చిన్న వేపచెట్లు  పడిపోయాయి. కొద్దిసేపు గ్రామం వద్ద రాకపోకలు ఆగిపోయాయి. గోవిందవాడ గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ కూలిపోయిందని గ్రామస్థులు తెలిపారు.


గుంతకల్లుటౌన్‌/ గుత్తి: గుంతకల్లు పట్టణంలో మంగళవారం సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అలాగే గుత్తి, గుత్తి ఆర్‌ఎ్‌సలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గుత్తిఆర్‌ఎ్‌సలో వడగళ్ల వర్షం పడింది.  వర్షం  కురవడంతో రోడ్లపై వర్షపు నీరు పారింది. కాలువలు పొంగిపొర్లాయి. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

Updated Date - 2020-05-27T09:56:55+05:30 IST