ఆ ఇళ్లు ఇవ్వరా?

ABN , First Publish Date - 2022-05-15T05:27:11+05:30 IST

టిడ్కో ఇళ్ల కథ ఈనాటి కాదు.. మూడేళ్ల కిందటిది.

ఆ ఇళ్లు ఇవ్వరా?

టిడ్కో ఇళ్లకు మూడేళ్లుగా గ్రహణం 

లబ్ధిదారులకు కేటాయించడంలో అంతులేని నిర్లక్ష్యం

వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం

రూ.30 కోట్లతో మౌలిక వసతులకు టెండర్లు పూర్తి 


టిడ్కో ఇళ్ల కథ ఈనాటి కాదు.. మూడేళ్ల కిందటిది.  గత చంద్రబాబు పాలనా కాలంలో ఈ ఇళ్లు నిర్మాణమయ్యాయి. అప్పుడో ఇప్పుడో కొత్త ఇంట్లోకి వెళ్లవచ్చని లబ్ధిదారులు అనుకున్నారు. అదంతా ఎండమావిలా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని అనుకోవడం లేదా? అనే సందేహాలు వస్తున్నాయి. ఈ విషయంలో జగన్‌ ప్రభుత్వానికి పట్టింపే లేదు. టీడీపీ హయాంలో కట్టించిన ఇళ్లనే సాకు తప్ప ఈ జాప్యానికి వేరే కారణం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


-(కర్నూలు-ఆంధ్రజ్యోతి)


లక్ష్మయ్యది పూట కూలి జీవితం. పెళ్లీడుకొచ్చిన కూతురు ఉంది. పంపుహౌస్‌ సమీపంలో ప్లాస్టిక్‌ కవర్‌తో ఏర్పాటు చేసుకున్న తాతాల్కిక గుడారంలో ఉంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం టిడ్కో ఇల్లు ఇస్తానంటే సంతోషించాడు. ఆ ఇంట్లోకి వెళితే కూతురుకు మంచి సంబంధం వస్తుందని ఆశించాడు. కార్పొరేషన్‌ అధికారులకు రూ.500 డిపాజిట్‌ చెల్లించాడు. ప్రభుత్వం కేటాయింపు పత్రం ఇచ్చింది. రేపోమాపో గృహ ప్రవేశం చేయాలని అనుకున్నాడు. ఈలోగా చంద్రబాబు ప్రభుత్వం మారి జగన్‌ ప్రభుత్వం వచ్చింది. ఇక అంతే. టిడ్కో ఇళ్ల అతీగతి లేదు. ఇప్పటికి మూడేళ్లయింది. ఇల్లు మాత్రం ఇవ్వలేదు. ఒక్క లక్ష్మయ్యే కాదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత టీడీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల కోసం డిపాజిట్‌ చెల్లించిన 35 వేల మంది నిరుపేదల ఘోష ఇది. రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన జీ+3 ఇళ్లు నిరుపయోగంగా మారాయి. 


ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌, ఆళ్లగడ్డ పట్టణాల్లో పేదల కోసం గత టీడీపీ ప్రభుత్వం ప్రధానమంత్రి అవాస్‌ యోజన-ఎన్టీఆర్‌ ఇళ్లు పథకం కింద నాలుగు విడతల్లో కింద 52,318 ఇళ్లు మంజూరు చేసింది. ఇందు కోసం రూ.3,130 కోట్లు కేటాయించింది. జీ+3 అపార్ట్‌మెంట్స్‌ ఇటుకలు, పిల్లర్లు లేకుండా షేర్‌వాల్‌ టెక్నాలజీతో చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ టిడ్కో) పర్యవేక్షణలో చేపట్టిన ఈ నిర్మాణ కాంట్రాక్ట్‌ మహారాష్ట్రకు చెందిన షాపూర్జీ, పల్లన్‌జీ సంస్థకు అప్పటి ప్రభుత్వం అప్పగించింది. కర్నూలు నగరం శివారున జగన్నాథగట్టుపై జాతీయ రహదారి పక్కనే నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల సముదాయాలు నూతన నగరాన్ని తలపిస్తాయి. ఎమ్మిగనూరులో శివన్న నగర్‌, మైనార్టీ కాలనీల్లో, ఆదోనిలో సిరుగుప్ప రోడ్డు, నంద్యాలలో ఎస్‌ఆర్‌బీసీ కాలనీలో చేపట్టిన తొలి విడత ఇళ్లు 27,300 గత ప్రభుత్వంలోనే దాదాపు పూర్తి చేశారు. ఫేజ్‌-2, 3 కింద టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టిన 8,500 ఇళ్లను, టెండర్లు పిలవాల్సిన ఫేజ్‌-4 కింద మంజూరైన 19 వేల ఇళ్లను 2019 మే 30న కొలుదీరిన జగన్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తరువాత 2,500 ఇళ్లకు రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో టెండర్లు పిలిచారు. ప్రస్తుతం ఆ ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. 


మూడేళ్లు గడిచినా.. 


గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పేదల ఆర్థిక స్థోమతకు అనుగుణంగా మూడు క్యాటగిరిల్లో నిర్మించింది. దీని ప్రకారం 27,300 ఇళ్లు చేపట్టి 23 వేలకు పైగా ఇళ్లను పూర్తి చేశారు. లబ్ధ్దిదారులను కూడా ఎంపిక చేశారు. వివిధ క్యాటగిరీలకు అనుగుణంగా డిపాజిట్‌ కూడా చెల్లించారు. అయితే.. లబ్ధిదారులకు కేటాయించే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ‘టిడ్కో లబ్ధిదారులు ఒక్క పైసా కట్టవద్దు.. మా ప్రభుత్వం రాగానే ఉచితంగా ఇళ్లు కేటాయిస్తానని’ నాటి ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇచ్చారు. జగన్‌ ప్రభుత్వం రాగానే టిడ్కో ఇళ్లు కేటాయిస్తారని లబ్ధిదారులు ఆశించారు. అదిగో ఇదిగో అంటూ మూడేళ్లు కాలయాపన చేశారే తప్ప టిడ్కో ఇళ్లను కేటాయించలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించినందు వల్ల వాటిని పేదలకు కేటాయిస్తే చంద్రబాబుకు పేరు వస్తుందనే రాజకీయ దురుద్దేశంతో ఏళ్లు గడుస్తున్నా కేటాయించడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. 


20,736 ఇళ్లు రద్దు


 వైసీపీ ప్రభుత్వం టెండర్లు పూర్తయినా పనులు మొదలు పెట్టని 20.736 ఇళ్లను రద్దు చేసింది. మిలిగిన 31,582 ఇళ్లలో 29,082 టీడీపీ ప్రభుత్వంలోనే 85 శాతం పూర్తయ్యాయి. ప్రభుత్వం మారాక వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి.  అలాగే.. మరో 2,500 ఇళ్లకు రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో కాంట్రాక్టరుకు అప్పగించారు. ఇళ్ల రద్దు తరువాత రివర్స్‌ టెండరింగ్‌ ఇళ్లతో కలిపి ఉమ్మడి జిల్లాలో 31,582 ఇళ్లు మిగిలాయి. అందులో 23,851 ఇళ్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. 7,731 ఇళ్లు వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్నాయి. ఇందులో కొన్ని పునాదుల్లోనే ఆగిపోయాయి. నిర్మాణం పూర్తయినవి కూడా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో అవి నిరుపయోగంగా ఉండి శిథిలావస్థకు చేరే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్‌ నిపుణులు అంటున్నారు. నందికొట్కూరు, ఆత్మకూరు పట్టణాల్లో ఫేజ్‌-4లో 3,800 టిడ్కో ఇళ్లు గత ప్రభుత్వం మంజూరు చేస్తే..  వైసీపీ ప్రభుత్వం తాజాగా వాటిని పూర్తిగా రద్దు చేసింది. 


మౌలిక వసతులకు రూ.30 కోట్లతో టెండర్లు


టిడ్కో ఇళ్ల సముదాయంలో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.30 కోట్లతో టెండర్లు పిలిచారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు అగ్రిమెంట్‌ చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పనులు చేసిన బిల్లులు వస్తాయో.. రావో.. పనులు చేసి ఎందుకు ఇబ్బంది పడాలి..? అనే ఆలోచనతోనే కాంట్రాక్టరు ముందుకు రావడం లేదని విశ్వసనీయ సమాచారం. టిడ్కో ఇళ్ల సముదాయాలకు తాగునీటి సౌకర్యం ఇప్పటి వరకు కల్పించలేదని తెలుస్తోంది. 


 ఇళ్లు పూర్తి చేస్తాం


ఉమ్మడి జిల్లాల్లో ప్రస్తుతం టిడ్కో కింద 31,582 ఇళ్ల నిర్మాణం చేపట్టాం. 23,851 ఇళ్లు పూర్తి చేసి గృహ ప్రవేశానికి సిద్ధం చేశాం. వివిధ దశల్లో ఉన్న ఇళ్లను త్వరలోనే పూర్తి చేస్తాం. ఆయా పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.30 కోట్లతో టెండర్లు పిలిచాం. త్వరలోనే పనులు మొదలు పెడుతాం. 

 

- రాజశేఖర్‌, ఏపీ టిడ్కో ఎస్‌ఈ, కర్నూలు


జూన్‌ చివరలో పేదలకు పంపిణీ


కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలో నగర శివారున జగన్నాథగట్టు వద్ద 10 వేల ఇళ్లు నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే 9,181 ఇళ్లు నిర్మాణం పూర్తి అయ్యాయి. రూ.500 డిపాజిట్‌ చేసిన లబ్ధిదారులకు సింగిల్‌ బెడ్‌ రూం ఇళ్లను ఒక్క రూపాయికే ఇస్తున్నాం. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించిన ఇళ్లకు బ్యాంకు లోన్‌ ప్రక్రియ జరుగుతోంది. జూన్‌ ఆఖరులోగా 4 వేల మందికి కేటాయిస్తాం. డిసెంబరు ఆఖరులోగా వంద శాతం లబ్ధిదారులకు అప్పగిస్తాం. 


- ఎ. భార్గవ్‌తేజ, కమిషనర్‌, కర్నూలు కార్పొరేషన్‌

Updated Date - 2022-05-15T05:27:11+05:30 IST