రిపబ్లికన్‌కే ఓటు వేస్తాను: Elon Musk సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2022-05-19T19:35:56+05:30 IST

నన్ను నేను రిపబ్లికన్‌గానో డెమొక్రాట్‌గానో కాకుండా మితవాదిగా భావిస్తాను. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు డెమొక్రాట్లకు ఎక్కువగా ఓటేశాను. బహుశా రిపబ్లికన్‌లకు ఎప్పుడూ ఓటేసి ఉండకపోవచ్చు. కానీ వచ్చే ఎన్నికల్లో? చూడాలి..

రిపబ్లికన్‌కే ఓటు వేస్తాను: Elon Musk సంచలన ప్రకటన

కాలిఫోర్నియా: కొద్ది రోజులుగా అమెరికా రాజకీయాల గురించి తరుచూ స్పందిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో డెమొక్రటిక్ పార్టీకి ఓటేశానని.. ఇప్పుడు ఎంత మాత్రం వారికి మద్దతు ఇవ్వబోనని, ఇక తాను రిపబ్లికన్ పార్టీకే ఓటు వేస్తానని బహిరంగంగా ప్రకటించారు. బుధవారం ట్విట్టర్ ద్వారా మస్క్ స్పందిస్తూ ‘‘గతంలో నేను డెమొక్రటిక్ పార్టీకి ఓటేశాను. ఎందుకంటే ఆ పార్టీ చాలామట్టుకు దయనీయమైంది కనిపించింది. కానీ క్రమంగా విభజనకారిగా ధ్వేషకారిగా ఆ పార్టీ మారిపోయింది. ఇంకెంత మాత్రం ఆ పార్టీకి మద్దతు ఇవ్వబోను. రిపబ్లికన్ పార్టీకి ఓటేస్తాను’’ అని మస్క్ ట్వీట్ చేశారు. రాజకీయ పార్టీలకు తన బహిరంగ మద్దతు ప్రకటించిన మస్క్.. రాజకీయంగా తనకు రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లను సైతం ప్రస్తావించారు. అదే ట్వీట్‌లో ‘‘ఇక చూడండి.. నాకు వ్యతిరేకంగా వాళ్లు చేసే చెత్త ప్రచారం’’ అని రాసుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా ‘‘రాబోయే రోజుల్లో రాజకీయ దాడులు నాపై నాటకీయంగా పెరుగుతాయి’’ అని మరో ట్వీట్ కూడా చేశారు.


బిలియనీర్లపై పన్ను విధించే ప్రతిపాదనతో పాటు దేశీయంగా తయారయ్యే ఎలక్ట్రిక్ వాహనాలపై మరిన్ని పన్ను రాయితీలు ఇవ్వాలనే బిడెన్ ప్రభుత్వ ప్రతిపాదనలను మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో కూడా డెమొక్రటిక్ పార్టీకి వ్యతిరేకంగా మస్క్ ట్వీట్ చేశారు. ‘‘నన్ను నేను రిపబ్లికన్‌గానో డెమొక్రాట్‌గానో కాకుండా మితవాదిగా భావిస్తాను. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు డెమొక్రాట్లకు ఎక్కువగా ఓటేశాను. బహుశా రిపబ్లికన్‌లకు ఎప్పుడూ ఓటేసి ఉండకపోవచ్చు. కానీ వచ్చే ఎన్నికల్లో? చూడాలి’’ అని ట్వీట్ చేశారు. ఇదే కాకుండా తాను ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్న తరుణంలో రిపబ్లికన్ పార్టీ నేత అయిన డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని మస్క్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ప్రగతిశీల రాజకీయాలకు ప్రసిద్ధి చెందిన కాలిఫోర్నియా రాష్ట్రంలో హెడ్ క్వార్టర్స్ ఉండడం వల్ల ట్విట్టర్ వామపక్ష పక్షపాతంతో వ్యవహరిస్తుందని ట్విట్టర్‌ని ఉద్దేశించి మస్క్ గతంలో వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-05-19T19:35:56+05:30 IST