వరిసాగు తగ్గేనా?

ABN , First Publish Date - 2022-05-25T06:12:54+05:30 IST

ఏటా జిల్లాలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ప్రతీ సీజన్‌లో మెట్ట పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు అధికారులు రైతులతో సమావేశాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నా రైతులు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు.

వరిసాగు తగ్గేనా?
పెన్‌పహాడ్‌ మండలంలో రైతులతో సమావేశమైన వ్యవసాయశాఖ అధికారులు (ఫైల్‌)

ఏటా పెరుగుతున్న విస్తీర్ణం

వానాకాలంలో వరిని తగ్గించేందుకు అధికారుల యత్నం

పంటల ప్రణాళికను సిద్ధంచేసిన అధికారులు

ఎస్సారెస్పీ నీరు రావడం వల్లే వరివైపు రైతుల మొగ్గు

(సూర్యాపేట సిటీ)

ఏటా జిల్లాలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ప్రతీ సీజన్‌లో మెట్ట పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు అధికారులు రైతులతో సమావేశాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నా రైతులు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. యాసంగి సీజన్‌ నుంచి జిల్లాలో వరి విస్తీర్ణం తగ్గించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు యత్నించినా రైతులు సుముఖంగా లేదు. జిల్లాకు ప్రధానం ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి నీళ్లు రావడం వల్లే వరి సాగు పెరిగిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరి కొద్దిరోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లోనైనా జిల్లాలో వరికి బదులు పత్తి, కంది సాగు విస్తీర్ణాన్ని పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న వ్యవసాయాధికారులు, ఆ దిశగా రైతు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.

వానాకాలం సీజన్‌లో జిల్లాలో వరిసాగు విస్తీర్ణం తగ్గించేందుకు వ్యవసాయాధికారులు యత్నిస్తున్నారు. గత ఏడాది వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 3లక్షల ఎకరాలకుపైగా వరి సాగైంది. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో వరిసాగు సుమారు 4లక్షల ఎకరాలకుపైగా సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వరి సాగు, ధాన్యం విక్రయాల్లో ఏర్పడే ఇబ్బందులను వివరిస్తూ పత్తి, కంది వంటి వాణిజ్య పంటలను సాగుచేయాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు ఆసక్తి చూపడంలేదు. తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో అత్యధికంగా పత్తి, కంది పంటలు సాగయ్యేవి. మెట్టపంటల సాగు విస్తీర్ణం ఈ నియోజకవర్గంలోనే అధికంగా ఉండేది. కాగా, ప్రస్తుతం ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు రెండు సీజన్లకు సరిపడా సాగునీరు అందుతోంది. దీంతో ఈ ప్రాంత రైతులు మెట్టపంటలకు బదులు వరి సాగుకే మొగ్గుచూపుతున్నారు. చివ్వెంల, మోతె, ఆత్మకూర్‌(ఎస్‌) మండలాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

పత్తి, కంది పంటల సాగు విస్తీర్ణం పెంపు లక్ష్యం

ఈ ఏడాది వానాకాలంలో జిల్లాలో పత్తి, కంది పంట సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా వ్యవసాయాధికారులు నిర్ణయించి దానికి అనుగుణంగా పంటల సాగు ప్రణాళికను సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా పత్తి 1,25,000 ఎకరాలు, కంది 15,000 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. గోదావరి జలాలు రాక పూర్వం వానకాలంలో జిల్లాలో ఎక్కువగా పత్తి సాగయ్యేది. గోదావరి జలాలు రాకతో పత్తి స్థానంలో రైతులు వరి సాగు చేయడం ప్రారంభించారు. దీంతో పత్తి విస్తీర్ణం తగ్గింది. అదేబాటలో కంది, పెసలు, వేరుశనగ, జొన్నలు తదితర మెట్టపంటల సాగు తగ్గింది. ప్రస్తుత వానకాలం నుంచి మెట్టపంటలకు పూర్వ వైభవం తీసుకురావాలని వ్యవసాయాధికారులు యత్నిస్తున్నారు. మెట్టపంటలకు కావాల్సిన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకోచ్చారు.

వానాకాలం పంటల సాగు అంచనా..

పంటలు     సాగు అంచనా

            (ఎకరాల్లో)

వరి             4,40,000

పెసలు             5,000

కంది             15,000

మిరప             20,500

పత్తి             1,25,000

వేరుశనగ    1,000

ఆయిల్‌పామ్‌    2,500

అందుబాటులో మెట్టపంటల విత్తనాలు

పంట        అందుబాటులో ఉన్న 

    విత్తనాలు(క్వింటాళ్లు)

వరి     88,000

పెసర     600

వేరుశనగ 1,080

పత్తి     3,75,000

జీలుగ     6,540

జిల్లాకు కావాల్సిన ఎరువులు ఇలా..

ఎరువులు         కావాల్సినవి         ఉన్నవి

            (మెట్రిక్‌ టన్నులు) (మెట్రిక్‌ టన్నులు)

యూరియా         78,390         16,004

డీఏపీ                 20,904         2,606

ఎంవోపీ                 13,065         502

కాంప్లెక్స్‌         53,567         8,364

ఎస్‌ఎస్‌పీ         8,362         458

మొత్తం                 1,74,288         27,936

Updated Date - 2022-05-25T06:12:54+05:30 IST