Abn logo
Jan 27 2021 @ 00:32AM

జిల్లాను సస్యశ్యామలం చేస్తాం

జాతీయ జెండాకు సెల్యూట్‌ చేస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే తదితరులు

 గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్‌ భరత్‌గుప్తా


చిత్తూరు, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): నిత్యం కరువుతో తల్లడిల్లుతున్న జిల్లాను సస్యశ్యామలం చేస్తామని.. దీనికోసమే శ్రమిస్తున్నామని కలెక్టర్‌ భరత్‌ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరులోని పోలీసు పరేడ్‌ మైదానంలో నిర్వహించిన 72వ గణతంత్ర దినోత్సవంలో ఎస్పీ సెంథిల్‌కుమార్‌, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమగ్రంగా వివరించారు. ఆయన మాటల్లోనే.. ‘అరణియార్‌, కృష్ణాపురం ప్రాజెక్టులను రూ.35.64కోట్లు, రూ.31.80కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టాం. రాష్ట్రంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన జిల్లాగా గుర్తింపు పొందడంతో పాటు రికవరీ శాతంలోనూ ముందంజలో ఉన్నాం. తొలి దశలో హెల్త్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ వేస్తున్నాం. రెండో దశలో 55వేల మంది పోలీసు, రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్‌ ఉద్యోగులకు టీకా వేయనున్నాం. ఆపరేషన్‌ సమైఖ్యలో భాగంగా 3774 ప్రార్థనా మందిరాలను గుర్తించి 4526 సీసీ కెమెరాలను, 2241 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేశాం. కరోనా సమయంలో పోలీసులు చేసిన సేవలకు గుర్తింపుగా జాతీయ స్థాయిలో చిత్తూరు పోలీసులకు స్కోచ్‌ సిల్వర్‌ అవార్డు వచ్చింది. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయడంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ఉద్యోగులతోపాటు మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని కలెక్టర్‌ తన సందేశాన్ని ముగించారు. జేసీలు మార్కండేయులు, వీరబ్రహ్మం, రాజశేఖర్‌, సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి, ట్రైనీ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, ఎస్‌ఈబీ ఏఎస్పీ రిషాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement