త్రిపురలో లెఫ్ట్, రైట్‌‌లను తొలగిస్తాం: టీఎంసీ

ABN , First Publish Date - 2021-10-31T23:05:28+05:30 IST

త్రిపురలో టీఎంసీ ర్యాలీని ప్రభుత్వం మూడుసార్లు అడ్డుకుంది. కాగా, ఈ విషయమై టీఎంసీ త్రిపుర హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు అనుమతితో ఆదివారం టీఎంసీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ..

త్రిపురలో లెఫ్ట్, రైట్‌‌లను తొలగిస్తాం: టీఎంసీ

అగర్తలా: బెంగాల్ దాటి దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధమైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. గోవా, త్రిపురల్లో బలంగా ఎదుగుతోంది. ఇందులో భాగంగా గోవాలో మూడు రోజుల పాటు పార్టీ అధినేత మమతా బెనర్జీ పర్యటించగా, త్రిపురలో ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తాజాగా పర్యటించారు. అయితే త్రిపురలో టీఎంసీ ప్రభావంపై అభిషేక్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. త్రిపుర నుంచి లెఫ్ట్, రైట్‌లను (వామపక్ష, బీజేపీ) తొలగిస్తామని అభిషేక్ వ్యాఖ్యానించారు. తాజాగా బెంగాల్ మాజీ మంత్రి రాజీవ్ బెనర్జీ తిరిగి టీఎంసీలో చేరడంతో పార్టీకి మరింత ఊపు వచ్చింది.


త్రిపురలో టీఎంసీ ర్యాలీని ప్రభుత్వం మూడుసార్లు అడ్డుకుంది. కాగా, ఈ విషయమై టీఎంసీ త్రిపుర హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు అనుమతితో ఆదివారం టీఎంసీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ ‘‘భారతీయ జనతా పార్టీ అనే వైరస్‌కు ఒకే టీకా ఉంది. ఆ టీకా పేరు మమతా బెనర్జీ. బీజేపీకి త్రిపుర ప్రజలు రెండు డోసుల టీకా ఇస్తారు. మొదటి టీకా స్థానిక ఎన్నికలతో కాగా రెండో టీకా 2023 అసెంబ్లీ ఎన్నికలతో అందుతుంది. రాష్ట్రం నుంచి లెఫ్ట్, రైట్‌లను బయటికి పంపిస్తాం’’ అని అన్నారు.

Updated Date - 2021-10-31T23:05:28+05:30 IST