నల్లగొండ నుంచే పోటీ చేస్తా

ABN , First Publish Date - 2022-05-24T06:46:55+05:30 IST

వచ్చే ఎన్నికల్లో బరాబర్‌ నల్లగొండ నుంచే పోటీ చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.

నల్లగొండ నుంచే పోటీ చేస్తా
మాట్లాడుతున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

 రాజకీయ జన్మనిచ్చిన ప్రాంతం రుణం తీర్చుకుంటా 

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

నల్లగొండ, మే 23: వచ్చే ఎన్నికల్లో బరాబర్‌ నల్లగొండ నుంచే పోటీ చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. సోమవారం జిల్లాకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నల్లగొండలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా భువనగిరి నుంచి పార్లమెంట్‌ సభ్యుడిగా ఆరు జిల్లాల్లోని ప్రజలు తనను గెలిపించి ఢిల్లీకి పంపించారన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని, తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేసి ఆమరణ దీక్ష చేశానని గుర్తుచేశారు. నల్లగొండ పట్టణంతోపాటు నియోజకవర్గంలో తన హయాంలో చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా జరిగింది ఏమీ లేదన్నారు. పానగల్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ, సీసీరోడ్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. నల్లగొండను దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్తగా చేసిన అభివృద్ధి ఏమిటో చూపాలన్నారు. తాను 20ఏళ్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేశానని, మూడేళ్లుగా పార్లమెంట్‌ సభ్యుడిగా ఏ తప్పు చేయలేదన్నారు. పార్టీలకతీతంగా అడిగిన వారందరికీ సహాయం చేశానని, పేద విద్యార్థుల చదువుకోసం ఆర్థికంగా సహకారం అందించి చదివిస్తున్నానన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనలేని ముఖ్యమంత్రి పంజాబ్‌ రైతులను ఆదుకోవడానికి వెళ్లారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని రూ.5లక్షలకోట్ల మేరకు అప్పుల పాలు చేశారని విమర్శించారు. పార్టీలకతీతంగా ప్రజలందరికోసం పనిచేస్తానని స్పష్టంచేశారు. 


తెలంగాణ సొమ్మును పంజాబ్‌లో పంచారు

తెలంగాణ రైతులను పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ సొమ్మును తీసుకెళ్లి పంజాబ్‌లోని రైతులకు రూ.30కోట్లవరకు పంచారని, తెలంగాణ డబ్బును పంజాబ్‌ రైతులకు ఇచ్చే అధికారం సీఎంకు ఎక్కడిదన్నారు. ఢిల్లీకి వెళ్లి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి తెలంగాణ డబ్బును పంజాబ్‌ రైతులకు ఇస్తున్న సీఎం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుకు రూ.50కోట్లు ఇస్తే ప్రాజెక్టు పూర్తవుతుందన్న విషయాన్ని విస్మరిస్తున్నారన్నారు. స్టార్‌ క్యాంపెయినర్‌గా తాను ఇటీవల జహీరాబాద్‌లో పర్యటించానని, రాష్ట్రంలో తన నాయకత్వంలో 40 నుంచి 50 సీట్లను గెలిపించి తీరుతానన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించి తీరుతానని స్పష్టం చేశారు. కేంద్రానికి తాము దొడ్డురకం ధాన్యాన్ని సరఫరా చేయమని లేఖ ఇచ్చివచ్చి ఆ తర్వాత కేంద్రంపై ధాన్యం కొనుగోలుకోసం యుద్ధం ప్రకటించినట్లుగా డ్రామాలు చేశారన్నారు. పట్టణ శాఖ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పటేల్‌ రమే్‌షరెడ్డి, బీర్ల ఐలయ్య, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ బొడ్డుపల్లి లక్ష్మీ, బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, వంగూరి లక్ష్మయ్య, జూపూరు రమేష్‌, అల్లి సుభాష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T06:46:55+05:30 IST