సీఎం అభ్యర్థిని రాహుల్ ప్రకటిస్తారు: పంజాబ్ సీఎం చన్నీ

ABN , First Publish Date - 2022-02-03T23:20:21+05:30 IST

ప్రస్తుతం ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండి ఎన్నికలకు పోతున్న ఏకైక రాష్ట్రం పంజాబ్ కావడం వల్ల పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఎక్కువ ఆసక్తి నెలకొంది. యూపీ కాకుండా ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ బలంగానే ఉన్నప్పటికీ మాజీ సీఎం హరీష్ రావత్ పార్టీకి సర్వాధికారిగా ఉన్నారు..

సీఎం అభ్యర్థిని రాహుల్ ప్రకటిస్తారు: పంజాబ్ సీఎం చన్నీ

చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఫిబ్రవరి 6న కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ప్రకటిస్తారని ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రకటించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే సమయంలో తాను రాహుల్‌తో పాటే ఉంటానని ఆయన పేర్కొన్నారు. గురువారం చాంకూర్ సాహిబ్‌‌ని సందర్శించిన అనంతరం చన్నీ ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని పంజాబ్‌తో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత పంజాబే కీలకంగా ఉంది. అయితే యూపీలో ఎస్పీ తరపున అఖిలేష్, బీఎస్పీ తరపున మాయావతి, బీజేపీ తరపున యోగి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ తరపున యూపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కారణం యూపీలో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ సీట్లు దాడటం కష్టమనే అభిప్రాయం బలంగా ఉంది.


ప్రస్తుతం ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండి ఎన్నికలకు పోతున్న ఏకైక రాష్ట్రం పంజాబ్ కావడం వల్ల పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఎక్కువ ఆసక్తి నెలకొంది. యూపీ కాకుండా ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ బలంగానే ఉన్నప్పటికీ మాజీ సీఎం హరీష్ రావత్ పార్టీకి సర్వాధికారిగా ఉన్నారు. ఇక గోవా, మణిపూర్ రాష్ట్రాలపై పెద్దగా చర్చ ఉండదు. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా అమరీందర్ తప్పకుని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రముఖంగా రెండు ముఖాలు కనిపిస్తున్నాయి. ఒకరు సీఎం చన్నీ కాగా, మరొకరు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. మళ్లీ సీఎం చన్నీనే అని కొందరు, లేదు సిద్ధూని ప్రకటిస్తారని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ పోలింగ్‌కు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటన వస్తుందని చెప్పి ఈ చర్చకు ముగింపు పలకాలని కాంగ్రెస్ భావిస్తున్న క్రమంలోనే ఫిబ్రవరి 6న కాంగ్రెస్ తరపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-02-03T23:20:21+05:30 IST