ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు

ABN , First Publish Date - 2022-10-07T05:19:28+05:30 IST

ఉమ్మడి అనంతపురం జిల్లాలో బుధవారం రాత్రి విస్తారంగా వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలో 26 మండలాలు, శ్రీసత్యసాయిజిల్లాలోని 26 మండలాల్లో వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా రాప్తాడులో 64.6 మి.మీ వర్షపాతం నమోదైంది

ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు
రుద్రంపేట-ఆలమూరు రోడ్డులో పోలీసుల సాయంతో వంతెన దాటుతున్న ప్రజలు

 రాప్తాడు, కళ్యాణదుర్గంలో 9.20 హెక్టార్లలో దెబ్బతిన్న ద్రాక్ష,  టమోటా పంటలు       

రూ.38 లక్షల పంటనష్టం అంచనా 


   అనంతపురం అర్బన, అక్టోబరు 6: ఉమ్మడి అనంతపురం జిల్లాలో బుధవారం రాత్రి విస్తారంగా వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలో 26 మండలాలు, శ్రీసత్యసాయిజిల్లాలోని 26 మండలాల్లో వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా  రాప్తాడులో 64.6 మి.మీ వర్షపాతం నమోదైంది. పుట్లూరు 46.0, శింగనమల 44.2, అనంతపురం 36.8, బుక్కరాయసముద్రం 36.6, గుంతకల్లు 33.8, పామిడి 26.2, కూడేరు 22.0, నార్పల 21.4, గార్లదిన్నె 19.4, విడపనకల్లు 17.6, వజ్రకరూరు 16.8, రాయదుర్గం 14.4, బ్రహ్మసముద్రం 14.0, గుమ్మఘట్ట 10.4, పెద్దపప్పూరు 10.2, పెద్దవడుగూరు 9.2, ఉరవకొండ, బెళుగుప్ప 8.6, యాడికి 7.0 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో 6.0 మి.మీలోపు వర్షపాతం నమోదైంది. శ్రీసత్యసాయి  జిల్లాలో అత్యధికంగా బత్తలపల్లిలో 72.2 మి.మీ  వర్షపాతం నమోదైంది. కొత్తచెరువు 51.6, పుట్టపర్తి 50.2, ఓడీ చెరువు 25.4, నంబులపూలకుంట, బుక్కపట్నం 21.2, కదిరి 21.0 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో 13.8 మి.మీలోపు వర్షపాతం నమోదైంది. గురువారం పుట్లూరు, నార్పల, ఎనపీకుంట, ముదిగుబ్బ, గుత్తి, విడపనకల్లు, యల్లనూరు  తదితర ప్రాంతాల్లో ఓ  మోస్తరు వర్షం కురిసింది.  అనంతపురం, యాడికి, పుట్లూరు, గార్లదిన్నె, పామిడి, శింగనమల, గుంతకల్లు, కూడేరు, తాడిపత్రి, బొమ్మనహాళ్‌ పెనుకొండ, ఉరవకొండ,  తదితర ప్రాంతాల్లో  చిరుజల్లులు పడ్డాయి. 


రాప్తాడు, కళ్యాణదుర్గంలో 9.20 హెక్టర్లల్లో దెబ్బతిన్న ద్రాక్ష, టమోటా 

భారీ వర్షానికి రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి, ప్రసన్నాయపల్లిలో 1.20 హెక్టార్లల్లో  దాదాపు రూ.30 లక్షల విలువైన ద్రాక్ష పంట దెబ్బతింది. కళ్యాణదుర్గం మండలంలో 8 హెక్టార్లల్లో 8 లక్షల విలువైన టమోటా పంట దెబ్బతింది. మొత్తం 9.20 హెక్టార్లల్లో రూ.38 లక్షల విలువైన ద్రాక్ష,టమోటా పంటలు దెబ్బతిన్నట్లు ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 



 అనంతపురం రూరల్‌: మండలంలో వర్షం దంచి కొట్టింది. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారు జాము వరకు వర్షం కురవడంతో పలుగ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆలమూరు చెరువు మరువ పారింది. దీంతో రుద్రంపేటలోని పలుకాలనీలు వర్షపు నీటితో మునిగాయి. వికలాంగుల కాలనీలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు.  ఇళ్లలోకి నీరు చేరడంతో సామగ్రి మొ త్తం తడిసిపోయింది. యాలేరు, కక్కలపల్లి చెరువులు కూడా నిండి మరువపారాయి. దీంతో రుద్రంపేట నుంచి కట్టకిందపల్లి, ఆలమూరు వెళ్లే ప్రధాన రోడ్డుపై నూతనం గా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద రాకపోకలు నిలిపోయాయి. స్థానికులు వంతె న దాటేందుకు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఆర్డీఓ మధుసూదన, తహసీల్దార్‌ శ్రీధర్‌మూర్తి, సర్పంచు పద్మావతి, పంచాయతీ కార్యదర్శి నరసింహారెడ్డి తదితరులు అక్కడి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు వంతెన దాటేందుకు చర్యలు చేపట్టారు.  రాత్రి కురిసిన వర్షానికి కురుగుంట, రాచానపల్లి, ఎ.నారాయణపురం చెక్‌డ్యాంలు నీటితో పొంగిపొర్లాయి. కొడిమి వంకలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్లలో రాకపోకలు బంద్‌ అయ్యాయి. 


మరువ పారిన చెరువులు 

ధర్మవరం రూరల్‌: మండలంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు ఎడతెరపి లేకుండా జోరువాన కురిసింది. ఈ వర్షానికి వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లాయి. గొట్లూరు చెరువు ఉధృతంగా మరువ పారింది. కుణుతూరు వద్ద పెద్దచెక్‌డ్యాం పొంగి పొర్లింది. దర్శినమల గ్రామానికి చెందిన రైతు నారాయణమ్మ, ఆంజనేయులు దంపతులు తమ పొలంలో బోరుబావి కింద సాగుచేసిన వేరుశనగ పంటను గత రెండు రోజుల క్రితం కోత కోశారు. మొత్తం తడిసిపోయింది. 5ఎకరాల్లో వేరుశనగ సాగుచేశామని, రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టామని, ఈ వర్షానికి తీవ్రంగా నష్టం వాటిల్లిందని  ఆవేదన వ్యక్తం చేశారు.  


భారీ వర్షానికి కూలిన ద్రాక్ష తోట పందిరి

ఇద్దరు రైతులకు రూ.30 లక్షలు నష్టం

రాప్తాడు: భారీ వర్షానికి చేతికందిన ద్రాక్ష పంట, పందిరి పడిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న ద్రాక్ష తోటలు రాత్రికి రాత్రే నేలవాలాయి. ద్రాక్ష పందిరికి ఉపయోగించిన రాళ్లు కూడా పడిపోయాయి. దీంతో రైతులకు రూ. లక్షల్లో నష్టం వచ్చింది. రాప్తాడు మండంలోని గొందిరెడ్డిపల్లి గ్రామంలో రైతు గంగరాజు 1.5 ఎకరాల్లో ద్రాక్ష సాగు చేశాడు. దాదాపు 30 టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశాడు. రెండు రోజుల్లో ద్రాక్ష పంట కోత కోయాల్సి ఉండగా బుధవారం రాత్రి మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ద్రాక్ష పంట, పందిరి తడవడంతో బరువు ఎక్కువై  కుప్పకూలిపోయింది.  ప్రసన్నాయపల్లి గ్రామంలో రైతు వెంకటేశ్వరరెడ్డి ఎకరా ద్రాక్ష సాగు చేశాడు. దిగుబడి బాగా వచ్చింది. 20టన్నుల ద్రాక్ష అవుతుందని రైతు అంచనా వేశాడు. కోత కోయాల్సి ఉండగా భారీ వర్షానికి పంట పడిపోయింది. రైతు గంగరాజు రూ. 15లక్షలు, వెంకటేశ్వరరెడ్డి రూ. 10 లక్షలు పైగా నష్ట పోయినట్లు తెలిపారు.  



పరిశీలించిన ఉద్యాన శాఖ అఽధికారులు

ద్రాక్ష పంట, పందిరి పడిపోయిన విషయాన్ని తెలుసుకున్న ఉద్యాన శాఖ అఽధికారులు పరిశీలించారు. ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు నరసింహరావు, ఉద్యానశాఖ అధికారి రత్నకుమార్‌ గురువారం ఉదయం గొందిరెడ్డిపల్లి, ప్రసన్నాయపల్లి గ్రామాల్లో రైతు గంగరాజు, వెంకటేశ్వరరెడ్డి ద్రాక్ష పంటను పరిశీలించారు. ఇద్దరు రైతులకు దాదాపు రూ. 30లక్షలు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ సిబ్బంది ప్రియలత, విద్య, రైతులు పాల్గొన్నారు. 


రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఎం

భారీ వర్షాల వల్ల నష్టపోయిన ద్రాక్ష రైతులకు ప్రభు త్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఉదయం గొందిరెడ్డిపల్లి, ప్రసన్నాయపల్లి గ్రామాల్లో వర్షానికి పడిపోయిన గంగరాజు, వెంకటేశ్వరరెడ్డి ద్రాక్ష పంటను పరిశీలించారు.  ఆయన మాట్లాడుతూ కోతకు వచ్చిన పంట పడిపోవడం వల్ల రైతులు భారీగా నష్టపోయారన్నారు. అధికారులు పంట నష్టం అంచనా వేసి ఉన్నతాధికారులకు పంపి వెంటనే నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 



Updated Date - 2022-10-07T05:19:28+05:30 IST