పులివెందులలో ఏ ఎన్నికలైనా ఏకపక్షమే.. ఇది అభిమానమా..? అరాచకమా..!?

ABN , First Publish Date - 2021-02-25T19:02:05+05:30 IST

పులివెందుల ఎన్నికలంటే ఏకపక్షం అన్నట్లుగా వ్యవహారం ఎందుకు నడుస్తోంది?

పులివెందులలో ఏ ఎన్నికలైనా ఏకపక్షమే.. ఇది అభిమానమా..? అరాచకమా..!?

పులివెందుల ఎన్నికలంటే ఏకపక్షం అన్నట్లుగా వ్యవహారం ఎందుకు నడుస్తోంది? ఏకపక్షం అంటే నియోజకవర్గం మొత్తం వైఎస్‌ కుటుంబం ఓటర్లని అర్థమా? పులివెందులలో ప్రజాస్వామ్య పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు జరగడం లేదా? 109 పంచాయతీల్లో 90 స్థానాలు ఏకగ్రీవం కావడం దేనికి సంకేతం? వైసీపీ నాయకుల తీరుపై తెలుగు తమ్ముళ్లు ఎందుకు మండిపడుతున్నారు? కడప జిల్లాలో పులివెందుల పల్లెపోరుపై ఏ చర్చ సాగుతోంది? అనేదానిపై ప్రత్యేక కథనాన్ని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


నాడు వైఎస్సార్.. నేడు జగన్!

కడప జిల్లా పులివెందులలో నాల్గో విడత పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా సాగాయి. నియోజకవర్గంలో 109 పంచాయతీల్లో 90 పంచాయతీలు బలవంతపు ఏకగ్రీవాలయినట్లు చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నికలు జరిగిన 18కి 18 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు గెలవడంపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. నాడు వైఎస్సార్‌ హయాంలోనూ.. ఇప్పుడు జగన్‌ హయాంలోనూ పంచాయతీ ఎన్నికలు మొత్తం ఏకపక్షం. బాహ్య ప్రపంచానికి ఇదంతా వైఎస్ కుటుంబం ఓటుబ్యాంకు అని అనిపించినా..నియోజకవర్గ ప్రజలకు వైఎస్ కుటుంబంపై గానీ..సీఎం జగన్‌పై గానీ పెద్దగా అభిమానం లేదన్న టాక్‌ వినిపిస్తోంది. పులివెందులలో ఏ ఎన్నికలొచ్చిన మెజార్టీ ఉన్నప్పటికీ.. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు జగన్ ఓటర్లే అని భావించడం తప్పని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.


టాక్ ఇదీ..!

వైఎస్సార్‌ హయాం నుంచి ఇప్పుడు జగన్‌ పాలన దాకా పులివెందులలో ఎన్నికలొస్తే అక్రమ పద్దతుల్లో గెలవాలనుకుంటారు తప్ప.. ప్రజాస్వామ్య పద్ధతిలో కాదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధికార బలం ఉపయోగించి దౌర్జన్యాలకు తెగబడటం, జనంలో భయాందోళన సృష్టించి అనుకున్నది సాధిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు ప్రత్యర్ధులు ఎక్కడా ఏజంట్లుగా కూర్చోకూడదట. ఒకవేళ కూర్చున్నా వారిని బలవంతంగా బయటకు ఈడ్చివేస్తారట. ఏం జరిగినా సరే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తారన్న ఆరోపణలున్నాయి. ఈ గొడవలు ఎందుకని చాలామంది అభ్యర్థులు పోటీకి వెనుకంజ వేస్తారట. ఇలా ఇక్కడి ఎన్నికలు ఏకపక్షంగా కనిపిస్తాయి తప్ప..వైఎస్ కుటుంభం, సీఎం జగన్‌పై ఉన్న ప్రేమ అభిమానాలు కావని రాజకీయ పరిశీలకులు, విపక్ష నేతలు చెబుతున్నారు.


ఏకగ్రీవాల లెక్కలివీ..!

ప్రస్తుతం నాల్గో విడత పంచాయతీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ నేతలు 90 శాతం ఏకగ్రీవం చేసుకున్నారు. నియోజకవర్గంలో ఏడు మండలాలున్నాయి. పులివెందుల పరిధిలో 6 పంచాయతీలుండగా 5 ఏకగ్రీవమయ్యాయి. సింహాద్రిపురం మండలంలోని 20 స్థానాల్లో 12 ఏకగ్రీవం కాగా..8 స్థానాలకు ఎన్ని కలు నిర్వహించారు. లింగాల మండలంలో 19 స్థానాలకు 12 ఏకగ్రీవమయ్యాయి. ఇక వేముల మండలంలో 16 పంచాయతీలకు మొత్తం 16 ఏకగ్రీవం చేసుకున్నారు. అలాగే తొండూరులోనూ 15కు 15 స్థానాలు.. వేంపల్లెలో 17కు 17 స్థానాలు, చక్రాయపేటలో 16కు 16 స్థానాలు..ఇలా నాలుగు మండలాల్లో మొత్తం అన్ని పంచాయతీలు ఏకగ్రీవం చేసుకున్నారు. అన్ని కూడా బెదిరింపుధోరిణి తోనే ఏకగ్రీవాలు చేసుకున్నట్లు తెలుస్తోంది.


ఎందుకిలా..!?

పులివెందుల నియోజకవర్గంలో మొత్తం 109 పంచాయతీలకు 91 పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నారంటనే.. అధికార పార్టీ నేతల అరాచకం ఏ స్థాయిలో సాగిందో ఊహించుకోవచ్చు. పులివెందుల నియోజకవర్గంలో 109 పంచాయతీల్లో 90 పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఒక పంచాయతీలో ఎన్నికలు బహిష్కరించారు. మిగిలిన 18 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 18 పంచాయతీల్లోను వైసీపీ మద్దతుదారులే గెలుపొందారు. అయితే పులివెందులలో ఏకగ్రీవాలు, ఎన్నికల్లో విజయాలు అనైతికమంటూ విపక్ష టీడీపీ నేతలు ఆక్రోశిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుందని అధికార పార్టీకి సవాల్‌ విసురుతున్నారట.



Updated Date - 2021-02-25T19:02:05+05:30 IST