వారికెందుకు జ్వరం వచ్చింది? : మోదీ

ABN , First Publish Date - 2021-09-18T20:02:46+05:30 IST

ఒక్క రోజులో 2.5 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసుల టీకాకరణ

వారికెందుకు జ్వరం వచ్చింది? : మోదీ

న్యూఢిల్లీ : ఒక్క రోజులో 2.5 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసుల టీకాకరణ రికార్డుపై ఓ రాజకీయ పార్టీ ఎందుకు ప్రతికూలంగా స్పందిస్తోందో చెప్పగలరా? అని ఓ వైద్యుడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అడిగారు. మోదీ 71వ జన్మదినోత్సవాల సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా కేవలం ఒక రోజులోనే 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చి, రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 


గోవాలో నూటికి నూరు శాతం తొలి డోసు వ్యాక్సినేషన్ పూర్తయిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం గోవాలోని వైద్యులు, హెల్త్ వర్కర్లు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ డాక్టర్ నితిన్ ధూప్‌డలే ప్రధానితో మాట్లాడారు. 


డాక్టర్ నితిన్‌తో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ను పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘నేను వైద్యుడిని కాదు, వైద్య నిపుణుడిని కాదు, కానీ ప్రతికూల దుష్ప్రభావాలు, లేదా, జ్వరం వస్తుందని, అధిక జ్వరం వస్తే, మానసిక సమతుల్యత దెబ్బతింటుందని డాక్టర్లు చెబుతారు. ప్రతి వంద వ్యాక్సినేషన్లకు ఒకరిద్దరు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్తూ ఉంటారు. నిన్న మనం 2.5 కోట్ల డోసులను వేయగలిగాం. బహుశా ప్రపంచంలో ఒక రోజులో ఇది అత్యధికం కావచ్చు. కానీ నిన్న అర్ధరాత్రి ఈ లెక్కలను ప్రకటించిన తర్వాత ఓ రాజకీయ పార్టీ కొంత ప్రతికూల ప్రతిస్పందనను కనబరచడం ప్రారంభించింది. వారికి జ్వరం వచ్చినట్లు విన్నాను, ఇది సాధ్యమేనా? దీనిలో తర్కం ఉందా?’’ అని అడిగారు. 


డాక్టర్ నితిన్ మాట్లాడుతూ ప్రజలకు తాము ఇవ్వబోతున్న వ్యాక్సిన్ గురించి వివరించి చెప్పామన్నారు. ఆ వ్యాక్సినేషన్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా చెప్పామన్నారు. ఒకవేళ వ్యాక్సిన్ రియాక్షన్ వస్తే వెంటనే తమను సంప్రదించాలని హెల్ప్‌లైన్ నంబరును ఇచ్చామని తెలిపారు. 


అంతకుముందు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ టార్గెట్లను గోవా అధిగమించిందన్నారు. ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ టార్గెట్‌లో 102 శాతం సాధించినట్లు చెప్పారు.


నూటికి నూరు శాతం కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిన రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, గోవా ఉన్నాయి. 

Updated Date - 2021-09-18T20:02:46+05:30 IST