CCTV లో రికార్డయినా.. దొంగలు దొరకలేదా.. పోలీసులు పట్టుకోలేదా.. ఏంటిది!?

ABN , First Publish Date - 2021-09-07T18:15:32+05:30 IST

CCTV లో రికార్డయినా.. దొంగలు దొరకలేదా.. పోలీసులు పట్టుకోలేదా.. ఏంటిది!?

CCTV లో రికార్డయినా.. దొంగలు దొరకలేదా.. పోలీసులు పట్టుకోలేదా.. ఏంటిది!?

  • నెల రోజుల్లో ఒకేచోట రెండు చోరీలు
  • 24 మేకలను దొంగిలించిన దొంగలు
  • సీసీటీవీ ఫుటేజీలలో రికార్డయిన దృశ్యాలు
  • రాచకొండ పోలీసుల తీరుపై విమర్శలు

హైదరాబాద్‌ సిటీ : ఒకే మేకల మందలో రెండు దొంగతనాలు జరిగి నెలరోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంపై మంద యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అసలేం జరిగింది..

వనస్థలిపురం డివిజన్‌ పరిధిలోని ఒక శివారు పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో ఒక యజమానికి మేకల మంద ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో మేకలను మేపి, రాత్రిపూట ఒక ఖాళీ ప్రదేశంలో కట్టేస్తారు. ఆ ఖాళీ ప్రదేశం చుట్టూ ప్రహరీతో పాటు గేటు నిర్మించి సీసీటీవీ కెమెరాలు బిగించాడు. ఇదిలా ఉండగా.. బక్రీద్‌ పండుగకు పదిహేను రోజుల ముందు (జూలై-5) నలుగురు దొంగలు అర్ధరాత్రి దాటిన తర్వాత మందపై దాడిచేసి 15 మేకలను ఎత్తుకెళ్లారు. బక్రీద్‌కు వాటిని అమ్మేసి సొమ్ముచేసుకుందామని ఆశపడిన యజమాని అశలు అడియాశలు అయ్యాయి. పోలీసుల వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు.


దొంగలు మేకలను చోరీ చేస్తున్న దృశ్యాలు చూసి వారంతా లోకల్‌ దొంగలని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. బక్రీద్‌ జరిగిన వారం రోజులకు మరోసారి దొంగలు దాడి చేసి మరో 10 మేకలను ఎత్తుకెళ్లారు. ఆ దృశ్యాలు కూడా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అదే దొంగలు మరోసారి చోరీకి పాల్పడినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. దాంతో యజమాని నుంచి మరో ఫిర్యాదు తీసుకోలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ దొంగలను పట్టుకొని తీరుతాం అని చెప్పారు. కానీ పట్టించుకోలేదు. నెలరోజుల వ్యవధిలో సుమారు 3లక్షల విలువైన మేకలు చోరీకి గురవడంతో యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పోలీసుల తీరుపై విమర్శలు

సైంటిఫిక్‌, సాంకేతిక ఆధారాలతో సంచలన కేసులను ఛేదించడంలో రాచకొండ పోలీసులకు మంచి పేరుంది. మొదటి చోరీ కేసు వెలుగులోకి వచ్చినప్పడే పోలీసులు నిఘా పెట్టి ఉంటే.. రెండోసారి చోరీకి వచ్చినప్పుడు దొంగలు పోలీసులకు దొరికిపోయేవారు. అలా కాకుండా పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకోకపోవడం, నిఘా వైఫల్యంతోనే దొంగలు రెచ్చిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత జరిగినా చోరీ విషయం బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-09-07T18:15:32+05:30 IST