కత్తి వేలాడుతున్నా... పైలెట్‌తో రాహుల్ ఎందుకు భేటీ కాలేదంటే..

ABN , First Publish Date - 2020-07-13T14:40:50+05:30 IST

రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కత్తి వేలాడుతున్నా... గెహ్లాట్ ప్రభుత్వంపై యువ నేత

కత్తి వేలాడుతున్నా... పైలెట్‌తో రాహుల్ ఎందుకు భేటీ కాలేదంటే..

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కత్తి వేలాడుతున్నా... గెహ్లాట్ ప్రభుత్వంపై యువ నేత సచిన్ పైలెట్ తిరుగుబాటు బావుటా ఎగురవేసినా... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ... సచిన్ పైలెట్‌తో ఎందుకు భేటీ కాలేదు? పైలెట్‌ను ఎందుకు వివరణ అడగలేదు? ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం.... తొమ్మిది రోజుల క్రితమే రాహుల్ గాంధీ దూతతో సచిన్ పైలెట్ చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ చర్చల్లోనే ముఖ్యమంత్రి పదవి కావాలంటూ పైలెట్ గట్టిగా ఉడుం పట్టు పట్టినట్లు ఆయన సన్నిహితులు ప్రకటించారు.


పార్టీలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే మొదట సోనియా, రాహుల్ తమ దూతలను పంపి... వారితో చర్చల ద్వారా సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తారు. సోనియా వర్కింగ్ స్టైల్ అది.  పైలెట్ విషయంలో కూడా రాహుల్ గాంధీ తమ దూతలను పంపి... చర్చల ద్వారా సయోధ్యకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే అప్పటికీ సచిన్ తిరుగుబాటు బావుటా ఎగురవేయలేదు. ఈ సమావేశంలోనే తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని రాహుల్ దూతకు పైలెట్ తేగేసి చెప్పారట.


అయితే... సీఎం పదవి కావాలంటే మాత్రం మరి కొన్నాళ్లు వేచి చూడాలని, ఇప్పుడు తగిన వయస్సు కూడా కాదని రాహుల్ తన దూతతో స్పష్టం చేయించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, అంతేకాకుండా కీలకమైన మరో శాఖలు కూడా పైలెట్ వద్దే ఉన్నాయనీ, ఇవీ కాకుండా పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఉందని... ఇన్ని పదవులుండగా... ఇప్పుడు సీఎం పోస్ట్ సాధ్యమయ్యే పని కాదని అధిష్ఠానం స్పష్టం చేసింది. ఎంతకూ పైలెట్ బెట్టు వీడక పోవడంతో రాహుల్ గాంధీ పైలెట్‌తో నేరుగా చర్చలు జరపడం లేదని సమాచారం. 

Updated Date - 2020-07-13T14:40:50+05:30 IST