ఆ పాపం ఎవరిది..?

ABN , First Publish Date - 2021-10-18T05:46:24+05:30 IST

ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే యువతులకు గాలం వేసి వంచించటమే ధ్యేయంగా ఆ వర్క్‌ ఇనస్పెక్టర్‌ పనిచేస్తూ వచ్చాడు.

ఆ పాపం ఎవరిది..?

వర్క్‌ ఇనస్పెక్టర్‌కు వంత పాడిందెవరు...?

డ్యూటీకి రాకపోయినా వచ్చినట్లు సంతకాలు 

  ఆ డీఈ, సూపరింటెండెంటే కీలకం...? 

 బ్రోకర్‌ వ్యవహారం నడిపేందుకే ఆఫీస్‌కు డుమ్మా !

 పట్టించుకోని ఉన్నతాధికారులు

అనంతపురం కార్పొరేషన, అక్టోబరు 17: ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే యువతులకు గాలం వేసి వంచించటమే ధ్యేయంగా ఆ వర్క్‌ ఇనస్పెక్టర్‌ పనిచేస్తూ వచ్చాడు.  గత కొన్నేళ్లుగా అతను అదే వృత్తిగా ఎంచుకున్నాడు. విధులకు డుమ్మా కొట్టి మరీ బ్రోకర్‌ అవతారమెత్తాడు. దిశ పోలీసులకు చిక్కి కటకటాలపాలైన అనంతపురం నగర పాలక సంస్థ వర్క్‌ఇనస్పెక్టర్‌ మాధవరెడ్డి విషయం ఉద్యోగవర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మాధవ రెడ్డి తనకేమీ పనిలేనట్లు యువతుల వెంట తిరిగడానికే అధిక సమయం కేటాయించినట్లు సమాచారం. ఒక ప్రభు త్వ ఉద్యోగిగా తన విధులు నిర్వర్తించకుండా యువతుల ను మోసగి స్తూ వచ్చాడు. ఈ పాపం ఎవరిది...? పని చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వర్క్‌ఇనస్పెక్టర్‌ దా...? అతను డ్యూటికీ రాకపోయినా పట్టించుకోని ఉన్నతాధికారులదా...? అతను సంతకం చేయకపోయినా నెలకోసారి సంతకం చేస్తే చాలని గుడ్డిగా జీతానికి సంబంధించిన ఫైల్‌లో సంతకం చేసిన ఆ విభాగం అధికారులదా...? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ అధికారులదే. అతను ఇన్నేళ్లలో ఎక్కడ డ్యూటీ చేస్తాడని కార్పొరేషన వర్గాలను అడిగితే... నోరెళ్ల బెడతారు తప్ప సమాధానమివ్వలేని పరిస్థితి. అతను ఏ విభాగంలో ఏ పని వెలగబెడతాడో చెప్పలేని దుస్థితిలో అధికారులున్నారంటే పరిస్థితి ఎంత దారుణమో అర్థమవుతుంది.


వస్తినమ్మా.. పోతినమ్మా..!

అనంతపురం కార్పొరేషనలో మేస్ర్తీగా అడుగుపెట్టి వర్క్‌ఇనస్పెక్టర్‌గా పనిచేస్తున్న మాధవరెడ్డి మరో నెలలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఇతను గత కొన్ని సంవ త్సరాలుగా విధుల విషయంలో వస్తినమ్మా... పోతినమ్మా అన్నట్లు వ్యవహరించాడు. ఐదేళ్ల నుంచి జరిగిన పలు సంఘటనలను పరిశీలిస్తే నగర కమిషనర్‌గా చల్లా ఓబులేసు ఉన్న సమయంలో డ్యూటీకి సరిగా రావడం లేదని డివైడర్ల నిర్వహణకు కేటాయించారు. ఆ పని కూడా సరిగా చేయలేదు. కొన్ని రోజులకే ఓ వివాదంలో సెంట్రల్‌ పోలీసులు అరెస్ట్‌ చేయడంతో కోర్టులో కేసు నడిచింది. ఆ కొంతకాలం పనిచేయకపోవడంతో జీతం రాలేదు. ఆ తరువాత చెన్నుడు కమిషనర్‌గా ఉన్న సమయంలో ఆ ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగికి ఆమ్యామ్యాలు ఇచ్చి అ తని సాయంతో పెండింగ్‌లో పడిన జీతం కూడా డ్రా చేసుకున్నాడు. ఉన్నతాధికారులను ఏం మేనేజ్‌ చేశాడో కానీ రెండేళ్ల క్రితం తిరిగి విధుల్లో చేరి పీఏబీఆర్‌ డ్యాంకు వెళ్లాడు. అక్కడికి కూడా రోజూ వెళ్లకుండా వారానికోసారి వెళ్లి సంతకాలు చేసేవాడు.  ఓ ఈఈ ఈ విషయం పై ఆరా తీయడంతో ప్రస్తుత కమిషనర్‌ పీవీ వీఎస్‌ మూర్తి సస్పెండ్‌ చేశారు. 


 వంతపాడిందెవరు...?

విధులకు డుమ్మా కొడుతున్నా అధికారులెందుకు చర్యలు తీసుకోలేదు...? రూ.70 వేలకుపైగా జీతం పొందుతున్న వర్క్‌ ఇనస్పెక్టర్‌కు వంతపాడిందెవరు...? ప్రస్తుతం మాధవరెడ్డి సస్పెన్షనతో తలెత్తుతున్న సందేహాలివి. ఇక్కడ ఓ డీఈ, సూపరింటెండెంటే కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. మాధవరెడ్డి గత రెండున్నరేళ్లుగా తాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్నట్లు సమాచారం.  అయితే పీఏబీఆర్‌ డ్యాంలోనా, వాటర్‌ ట్యాంకర్సా, తాగునీటి పైపులైన్ల పనులా.? అనే దానిపై స్పష్టత లేదు. ఈ విషయంపై ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రామ్మోహనరెడ్డిని వివరణ అడిగితే... అతనేం పనిచేస్తాడు...? వర్క్‌ ఇనస్పెక్టర్‌ అంతే..! గతంలో సస్పెండ్‌ చేసిన తరువాత అతన్ని ఎక్కడా కేటాయించలేదన్నారు. కానీ నెల జీతం ఎలా ఇస్తున్నారనేది మిలియన డాలర్ల ప్రశ్న. అతను విధులకు రాకపో యినా వచ్చినట్లు సంతకాలు చేసి, అతని జీతం పంపే ఫైల్‌లో సూపరింటెండెంట్‌ సంతకాలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాటిపై ఫైనల్‌గా డీఈ సంతకం చేయడం మరింత వివాదానికి దారి తీస్తోంది. ఇందుకు ఆ వర్క్‌ఇనస్పెక్టర్‌ భారీగానే ఆమ్యామ్యాలు ఇచ్చినట్లు సమాచారం. ఓ నెల జీతం వర్క్‌ ఇనస్పెక్టర్‌కు, మరో నెల జీతం డీఈకి అందేలా ఒప్పందం చేసుకున్నట్లు  సమాచారం. గత ఆరు నెలల నుంచి రెగ్యులర్‌ ఉద్యోగులకు కూడా అటెండెన్స పెడుతూ వచ్చారు. మరి ఆ అటెండెన్సలో సంతకాలు ఎలా వచ్చాయో తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-10-18T05:46:24+05:30 IST