ఆపేదెవరు..? అడిగేదెవరు..?

ABN , First Publish Date - 2022-06-04T06:29:23+05:30 IST

ఏడీసీసీ బ్యాంకులో కొన్ని వ్యవహారాలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి. బ్యాంకులో అక్రమాలు జరుగుతున్నా సహకార శాఖ, నాబార్డు, ఆప్కాబ్‌ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

ఆపేదెవరు..? అడిగేదెవరు..?
ఏడీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయం

మా ఇష్టం

ఏడీసీసీబీలో వీఆర్‌ఎస్‌.. ఉద్యోగం

ఆ ఉద్యోగి కోసం నిబంధనలు తూచ

అర్హత ఉన్న మరొకరికి వీఆర్‌ఎస్‌ నిరాకరణ

ఓ అధికారి సతీమణికి వైద్యం పేరిట వసూళ్లు


ఏడీసీసీ బ్యాంకులో కొన్ని వ్యవహారాలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి. బ్యాంకులో అక్రమాలు జరుగుతున్నా సహకార శాఖ, నాబార్డు, ఆప్కాబ్‌ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వీఆర్‌ఎస్‌, మెడికల్‌ ఇన్వాలిడేషన, ఇతర అక్రమాలపై కొన్ని రోజులుగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. అయినా బ్యాంకు అధికారులు వెనక్కు తగ్గడం లేదు. ‘నిబంధనలతో నిమిత్తం లేదు.. అనుకున్నది చేసి తీరుతాం’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఓ ఉద్యోగికి సంబంధించి.. వీఆర్‌ఎస్‌, మెడికల్‌ ఇన్వాలిడేషన, తనయుడికి ఉద్యోగం కోసం అనుసరిస్తున్న మార్గాలు సరైనవి కావని ఉన్నతాధికారులు హెచ్చరించారు. అయినా పట్టించుకోకుండా, తమ పనికానిస్తున్నారు. ఆ ఉద్యోగికి అంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారో అన్న చర్చ సహచర ఉద్యోగుల్లో జరుగుతోంది. 

- అనంతపురం క్లాక్‌టవర్‌


అక్రమ మార్గంలో...

- విధుల నిర్వహణకు ఆరోగ్యం సహకరించనప్పుడు.. ఉద్యోగి స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి తప్పుకోవచ్చు. ఉద్యోగి వీఆర్‌ఎస్‌ కోరితే, మెడికల్‌ ఇన్వాలిడేషన ప్రక్రియ ద్వారా  నిర్ధారించుకుని, తదుపరి చర్యలు తీసుకోవాలి. ఏడీసీసీబీలోని ఓ ఉద్యోగి, మెడికల్‌ ఇన్వాలిడేషన విషయమై.. కర్నూలులోని ప్రాంతీయ మెడికల్‌ బోర్డుకు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిపాదనలు పంపారు. కానీ ఆ ఉద్యోగి ఆరోగ్యం బాగున్నట్లు గుర్తించి, ఆ ప్రతిపాదనలను కర్నూలు రీజనల్‌ మెడికల్‌ బోర్డు తిరస్కరించింది. ఆ తరువాత అనంతపురంలో కొందరు వైద్యులతో ‘అనారోగ్యం’ ధ్రువీకరణ పత్రం తీసుకుని, ఏడీసీసీ బ్యాంకు లెటర్‌హెడ్‌ ద్వారా సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టారు. కోరం లేకపోయినా, ఆమోదింపజేసుకున్నారు. తాజాగా ఆయన కుమారుడికి శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు బ్యాంచిలో పోస్టింగ్‌ ఇచ్చారు.

- పెనుకొండ బ్రాంచలో పనిచేసే ఓ ఉద్యోగి కర్నూలులోని మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుల ఎదుట హాజరయ్యారు. ఆ ఉద్యోగికి మెడికల్‌ ఇన్వాలిడేషన ఇచ్చారు. అయినా ఆయన వీఆర్‌ఎస్‌ను బ్యాంకు అధికారులు అంగీకరించలేదు. ఆయన కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అర్హత ఉన్నవారి పట్ల అలా, అక్రమంగా వస్తున్నవారికి ఇలా..! ఏడీసీసీ బ్యాంకు అధికారుల తీరును చూసి ఉద్యోగులు విస్తుపోతున్నారు. 


సంతకాల కోసం..

ఆ ఉద్యోగి వీఆర్‌ఎస్‌, అతని కుమారుడికి ఉద్యోగం ఇవ్వడానికి చాలా తతంగమే నడిపారు. సర్వసభ్య సమావేశంలో కోరం లేకపోవడంతో తాడిపత్రికి సమీపంలో ఉన్న ఓ గ్రామానికి వెళ్లి.. ‘కోరం కానీ సబ్జెక్ట్‌’కు మెజార్జీ సభ్యులతో సంతకాలు చేయించారు. ఈ పనికోసం బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనంలో ఆ గ్రామానికి వెళ్లారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలో ఉండే సభ్యులు సమావేశానికి హాజరుకాకపోయినా, సంతకాలు చేస్తే చాలని వారి చుట్టూ తిరిగారు. సంతకాలు చేయించుకుని రావడానికే ఓ వాహనం, ఉద్యోగిని సమకూర్చుకున్నారు. 


సతీమణి కోసం వసూళ్లు

ఏడీసీసీ బ్యాంకులో పనిచేస్తున్న కీలక అధికారి సతీమణికి ఆరోగ్యం బాగాలేదని, వైద్యం పేరిట వసూళ్లు చేశారు. ఉమ్మడి జిల్లాలోని 28 బ్రాంచలు, సొసైటీల నుంచి అక్రమంగా వసూలు చేసినట్లు సమాచారం. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రూ.5 లక్షల వరకు ఇలా వసూలు చేశారని తెలిసింది. ఒక్కో ఉద్యోగి వద్ద రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు రాబట్టినట్లు బ్యాంకులో చర్చ జరుగుతోంది. ఏడీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈ వసూళ్లలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఆ అధికారి సతీమణి విధులకు బ్యాంకు వాహనాన్ని వినియోగించడం వెనుకా ఇదే ఉద్యోగి ఉన్నట్లు సమాచారం. ప్రతి విషయంలోనూ ఈ ఉద్యోగి కీలకంగా వ్యవహరిస్తుంటారని బ్యాంకు ఉద్యోగులు అంటున్నారు. 


ప్రేక్షక ప్రాత

జిల్లాలోని సహకార బ్యాంకులు, సొసైటీలను నియంత్రించి, సక్రమ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత జిల్లా సహకార శాఖ, నాబార్డు, ఆప్కాబ్‌ అధికారులపై ఉంటుంది. కానీ వీరు ప్రేక్షక పాత్ర వహించడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై సహకార శాఖ అధికారులు విచారణ చేపట్టి, ఉన్నతాధికారులకు నివేదిస్తామని ప్రకటించారు. అదంతా ఉత్తిదేనా? అనే సందేహ ం వ్యక్తమవుతోంది.

Updated Date - 2022-06-04T06:29:23+05:30 IST