కొవిడ్‌ బాధితులకు సేవ చేసేదెవరు?

ABN , First Publish Date - 2022-01-11T06:57:13+05:30 IST

ఒమైక్రాన్‌ ప్రబలుతోందని, కరోనా విస్తరిస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండగా, ఉమ్మడి జిల్లాలో కొవిడ్‌ వార్డుల్లో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందిని అధికారులు తొలగించారు. యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో మూడు నెలల క్రితమే వీరిని తొలగించగా, నల్లగొండ జిల్లాలో ఇటీవలే తొలగించారు.

కొవిడ్‌ బాధితులకు సేవ చేసేదెవరు?

అత్యవసర వైద్య సిబ్బంది తొలగింపు

నెలల కొద్దీ పెండింగ్‌లో వేతనాలు

ఆందోళనలో ఉద్యోగులు


నల్లగొండ అర్బన్‌: ఒమైక్రాన్‌ ప్రబలుతోందని, కరోనా విస్తరిస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండగా, ఉమ్మడి జిల్లాలో కొవిడ్‌ వార్డుల్లో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందిని అధికారులు తొలగించారు. యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో మూడు నెలల క్రితమే వీరిని తొలగించగా, నల్లగొండ జిల్లాలో ఇటీవలే తొలగించారు. దీంతో ఉద్యోగులు ఆందోళ న చెందుతుండగా, వారికి రావాల్సిన వేతనాలు సైతం నెలల కొద్దీ పెండింగ్‌లో ఉన్నాయి.


ఒమైక్రాన్‌, కరోనా ముప్పు నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైతే ఆస్పత్రుల్లో అదన పు సిబ్బందిని నియమించుకోవాలని ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, దీనికి విరుద్ధంగా ఉమ్మడి జిల్లా అధికారులు వ్యవహరిస్తూ ఉన్న సిబ్బందిని తొలగించారు. యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో మూడు నెలల క్రితం తొలగించగా,నల్లగొండ జిల్లాలో 2021 డిసెంబరు 31న తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.


అత్యవసర పరిస్థితుల్లో నియామకం

కరోనా తొలి దశలో పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరగడంతో అన్ని జిల్లా కేంద్రా ల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా కొవిడ్‌ వార్డుల ను ఏర్పాటుచేసింది. ఈ వార్డుల్లో కరోనా బాధితులకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని జిల్లా అధికారులకే ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. దీంతో నల్లగొండ జిల్లాలో ల్యాబ్‌ టెక్నీషియన్లు, స్టాఫ్‌ నర్సులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, స్వీపర్లు, అంబులెన్సు డ్రైవర్లు, ఇలా మొత్తం 20 మందిని అత్యవసర సేవల కోసం అధికారులు 2019 జూన్‌ నెలలో నియమించారు. సూర్యాపేట జిల్లాలో 30 మందిని, యాదాద్రి జిల్లాలో 36మందిని నియమించారు. వీరంతా కొవిడ్‌ వార్డుల్లో వైద్య సేవలు అం దజేశారు. కాగా, సూర్యాపేట జిల్లాలో 30మందిని మూడు నెలల క్రితం తొలగించారు. యాదాద్రి జిల్లాలో ఏడుగురు ల్యాబ్‌ టెక్నీషియన్లు మిన హా మిగతా 29 మందిని మూడు నెలల క్రితం తీసివేశారు. నల్లగొండ జిల్లాలో 2021, డిసెంబరు 31న తొలగిస్తూ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఉత్తర్వులు జారీచేశారు. అయితే కరోనా విపత్కర పరిస్థితు ల్లో ముందుకు వచ్చి ఇంతకాలం సేవలు అందించామని, ఇప్పుడు తొలగించడమేంటని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. కరోనా బాధితులకు సేవలందిస్తున్న స మయంలో తమతోపాటు కుటుంబసభ్యులు సైతం కరోనాబారిన పడినా ధైర్యంగా విధుల కు హాజరై ఎంతో మందికి వైద్యసేవలు అందిస్తే అకస్మాత్తుగా తీసివేశారని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


పెండింగ్‌లో వేతనాలు

కొవిడ్‌ వార్డుల్లో అత్యవసర వైద్య సేవలు అందించిన సిబ్బందికి నల్లగొండ జిల్లా లో ఏడు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో తొలగించిన సిబ్బందికి నెల జీతం ఇవ్వాల్సి ఉంది. ల్యాబ్‌ టెక్నీషియన్లకు మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. వేతనాలు అడిగితే బడ్జెట్‌ లేదని అధికారులు చెబుతున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు వచ్చినా, రాకున్నా ఇంతకాలం సేవలు అందిస్తే అర్ధాంతరంగా విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని దీంతో తమ కుటుంబాల పోషణ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.


బాధితులకు వైద్యసేవలు ఎలా?

నల్లగొండ జనరల్‌ ఆస్పత్రిలోని కొవిడ్‌ వార్డులో కరోనా బాధితుల కోసం 70 పడకలు కేటాయించారు. సెంట్రల్‌ ఆక్సిజన్‌ విధానంతో వీటిని ఏ ర్పాటు చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో నలుగురు కరోనా బాధితులు వైద్య చికిత్సలు పొందుతున్నారు. సిబ్బందిని తొలగించడంతో వారికి సరైన వైద్య సేవ లు అందడం లేదు. కొవిడ్‌ వార్డులో డ్యూటీ అంటేనే సిబ్బంది హడలెత్తిపోతున్నారు. ఓవైపు పాజిటివ్‌ కేసు లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొవిడ్‌ వార్డుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యం లో ఉన్న సిబ్బందిని తొలగించడంతో వారికి సేవలు అం దించేవారు కరువయ్యారు. యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో సైతం ఇదే పరిస్థితి ఉంది. మున్ముందు కరోనా పాజిటివ్‌ కేసు లు పెరిగి, కొవిడ్‌ వార్డుల్లో చేరేవారి సంఖ్య పెరిగితే వైద్య సేవ లు ఎవరు అందిస్తారో, అర్ధాంతరంగా ఇప్పటికే సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతో భవిష్యత్తులో పనిచేసేందుకు ఎవరైనా ముందుకు వస్తారా అనే అయోమయం నెలకొంది.


కలెక్టర్‌కు వివరాలు పంపాం : లచ్చునాయక్‌, నల్లగొండ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

తొలగించిన సిబ్బంది విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చాం. వివరాలు పంపించాలని ఆదేశించడంతో వాటిని సమర్పించాం. రెండు, మూడు రోజుల్లో తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకునే అవకాశముంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రిలో ఆక్సిజన్‌ పడకలన్నీ సిద్ధం చేశాం. ప్రస్తుతం 70పడకలు కరోనా బాధితులకు కేటాయించాం. మందులు సైతం అందుబాటులో ఉన్నాయి. కలెక్టర్‌ ఆదేశిస్తే తొలగించిన సిబ్బందిని విధుల్లో చేర్చుకుంటాం.


Updated Date - 2022-01-11T06:57:13+05:30 IST