దేశంలో తొలి ఆధార్ కార్డు ఎవరికిచ్చారో తెలుసా? ఆ గ్రామం ఇప్పుడెలా ఉందో తెలిస్తే షాకవుతారు!

ABN , First Publish Date - 2022-01-06T17:52:15+05:30 IST

ప్రస్తుతం భారతదేశంలో 90 శాతం మందికి..

దేశంలో తొలి ఆధార్ కార్డు ఎవరికిచ్చారో తెలుసా? ఆ గ్రామం ఇప్పుడెలా ఉందో తెలిస్తే షాకవుతారు!

ప్రస్తుతం భారతదేశంలో 90 శాతం మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. దాదాపు 135 కోట్ల జనాభా కలిగిన మనదేశంలో ఇంతమందికి ఆధార్ కార్డులను ఎలా రూపొందిస్తారో ఊహించడం చాలా కష్టం. అలాగే దేశంలో మొట్టమొదటిసారిగా ఎవరికి ఆధార్ కార్డ్ తయారు చేశారనేది కూడా ఆసక్తికర అంశం. ఆధార్ కార్డు అందుబాటులోకి రాకముందు వ్యక్తి గుర్తింపుగా ఓటర్ కార్డు ఉపయోగపడేది. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఆధార్ కార్డును తొలుత యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టారు. అయితే ఈ ఆధార్ కార్డును అందరికీ వర్తింపజేయాల్సిన అవసరం చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడింది. అనేక ప్రభుత్వ కార్యకలాపాలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేయడంతో దీని అవసరం మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఆధార్ కార్డు లేకుండా ప్రభుత్వంతో ముడిపడిన ఏ ఒక్క పని జరిగేలా లేదు. 


బ్యాంకు ఖాతా తెరవడం మొదలుకొని ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వరకు ఆధార్ కార్డు తప్పనిసరి. ఇంతేకాదు ఇతర ప్రభుత్వ పథకాలకు కూడా ఆధార్ కార్డు కలిగివుండటాన్ని తప్పనిసరి చేశారు.  దేశంలో తొలి ఆధార్ కార్డును 2010వ సంవత్సరంలో రంజనా సోనావానే అనే మహిళ కోసం రూపొందించి అందజేశారు. ఈ మహిళ పూణేకు 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెంభాలి అనే గ్రామంలో ఉంటుంది. దేశంలో రంజనా సోనావానే మొదటి ఆధార్ కార్డు పొందిన మహిళగా గుర్తింపు పొందింది. అలాగే తొలి ఆధార్ కార్టు అందుకున్న గ్రామంగా టెంభాలికి పేరొచ్చింది. ఇది అప్పట్లో సంచలనంగా నిలిచిందని గ్రామస్తులు చెబుతుంటారు. ఆ సమయంలో పలువురు నేతలు గ్రామానికి వచ్చి.. రంజన సోనావానేను కలుసుకునే వారట. అప్పట్లో గ్రామాన్ని సందర్శించిన వారంతా అక్కడి పరిస్థితులను చక్కదిద్దుతామని హామీ ఇచ్చారట. అయినా నేటికీ గ్రామంలోని పరిస్థితులు దుర్భరంగానే ఉన్నాయని గ్రామస్తులు వాపోతుంటారు. 

Updated Date - 2022-01-06T17:52:15+05:30 IST