ఆర్‌ఐవో ఎవరు?

ABN , First Publish Date - 2020-05-25T10:22:51+05:30 IST

జిల్లాలో ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐవో) పోస్టుకు తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు సమాచారం.

ఆర్‌ఐవో ఎవరు?

రేసులో ముగ్గురు

పెద్ద ఎత్తున లాబీయింగ్‌?

గతంలో ఎప్పుడూ లేనంత పోటీ

నెలాఖరుతో శ్రీనివాసరావు పదవీకాలం పూర్తి


నెల్లూరు (విద్య), మే 24 : 

జిల్లాలో ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐవో) పోస్టుకు తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్‌ఐవోగా పనిచేస్తున్న శ్రీనివాసరావు పదవీ కాలం ఈనెల ఆఖరుకు ముగయనుంది. అయితే తనను ముందుగానే రిలీవ్‌ చేయాలని ఆయన ఇంటర్‌ బోర్డుకు విన్నవించుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ పోస్టును దక్కించుకునేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ముగ్గురు సీనియర్‌ ప్రిన్సిపాళ్లు పోటీ పడుతున్నారని సమాచారం. ఎవరికి వారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇంటర్‌ బోర్డులో ప్రచారం జరుగుతోంది. 


ఇంటర్‌ బోర్డు జిల్లా శాఖకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే సమస్యలు కూడా ఇక్కడ అధికంగానే ఉన్నాయి. అయినాసరే ఈ సారి ఆ పోస్టుకు డిమాండ్‌ ఏర్పడింది. ఎలాగైనా దక్కించుకోవాలని ఆశావహులు ఉన్నతస్థాయిలో లాబీయింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. రెగ్యులర్‌ ఆర్‌ఐవో నియామకాలను సాంకేతిక కారణాలతో ప్రభుత్వం కొన్నేళ్లుగా చేపట్టడం లేదు.  ఆయా జిల్లాల్లోని సీనియర్‌ ప్రిన్సిపాల్‌కే బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో ప్రతి ఏడాది కూడా సీనియర్‌ ప్రిన్సిపాల్‌ ఎవరైతే వారు ఆర్‌ఐవోగా విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం ఆ పోస్టును దక్కించుకునేందుకు ముగ్గురు ప్రిన్సిపాళ్లు పోటీపడుతుండటం వెనుక ఆంతర్యం ఏమిటోనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.


అంతేకాదు కార్పొరేట్‌ కళాశాలలు, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు సైతం నూతన ఆర్‌ఐవో నియామకంపై దృష్టి పెట్టి ఎవరెవరికి అవకాశాలు ఉన్నాయనే దానిపై ఆరా తీస్తున్నట్లు అధ్యాపక వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ఆర్‌ఐవో నియామకంపై ఇప్పటికే ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ కసరత్తు ప్రారంభించారని, ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అకాశాలున్నట్లు కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. మరి ఎవరికి ఆ పదవి దక్కుతుందో వేచి చూడాలి.

Updated Date - 2020-05-25T10:22:51+05:30 IST