పీఎం భద్రతా లోపం వల్ల కాంగ్రెస్‌లో ఎవరు లాభపడాలనుకున్నారు? : స్మృతి ఇరానీ

ABN , First Publish Date - 2022-01-12T20:17:35+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం

పీఎం భద్రతా లోపం వల్ల కాంగ్రెస్‌లో ఎవరు లాభపడాలనుకున్నారు? : స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం వల్ల కాంగ్రెస్‌లో ఎవరు లాభపడాలనుకున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ప్రధాన మంత్రికి భద్రత కల్పించడం ప్రోటోకాల్ అని, కాంగ్రెస్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం ఈ ప్రోటోకాల్‌ను, భద్రతా చర్యలను ఉద్దేశపూర్వకంగా చూసీచూడనట్లు వ్యవహరిస్తూ, ఎందుకు ఉల్లంఘించిందని నిలదీశారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 


అంతకుముందు సుప్రీంకోర్టు ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపంపై దర్యాప్తు కోసం  జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.  జస్టిస్ ఇందు మల్హోత్రా రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. 


స్మృతి ఇరానీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి భద్రతకు చర్యలు తీసుకోవడం ప్రోటోకాల్ అని, కాంగ్రెస్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం ఈ భద్రతా చర్యలను ఉద్దేశపూర్వకంగా, చూసీచూడనట్లు వ్యవహరిస్తూ ఎందుకు ఉల్లంఘించిందని ప్రశ్నించారు. ప్రధాన మంత్రికి భద్రతా లోపం జరగడం వల్ల కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు లాభపడాలనుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి భద్రతకు బెదిరింపులను పంజాబ్ ప్రభుత్వంలో ఎవరు పదే పదే ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియజేయాలని కోరారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. 


ఇదిలావుండగా, ఓ ఇంగ్లిష్ న్యూస్ చానల్ ఇటీవల ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ పర్యటనకు ముందే రైతుల నిరసన గురించి పంజాబ్ పోలీసులకు తెలుసునని తన దర్యాప్తులో వెల్లడైందని తెలిపింది. స్మృతి ఇరానీ ఈ విషయాన్ని విలేకర్ల సమావేశంలో ప్రస్తావించారు. 


ప్రధాన మంత్రి భద్రతకు జరిగిన లోపం గురించి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాకు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ ఎందుకు వివరించారో చెప్పాలన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి తనకు ఈ విషయం గురించి చెప్పారని ప్రియాంక గాంధీ ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారని గుర్తు చేశారు. భద్రతకు సంబంధించిన వివరాలు కేవలం భద్రతా సంస్థలకు మాత్రమే పరిమితం కావలసి ఉండగా, ప్రధాన మంత్రి భద్రతా నిబంధనలు, వాటి ఉల్లంఘన గురించి ముఖ్యమంత్రి చన్నీ ఓ పౌరురాలు (ప్రియాంక గాంధీ వాద్రా)కు చెప్పడానికి ఎటువంటి అనుమతులు ఉన్నాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోందన్నారు. 


పీఎం భద్రతా లోపంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఓ కమిటీని నియమించడంపై స్పందించేందుకు స్మృతి ఇరానీ నిరాకరించారు. ఈ కమిటీ తన నివేదికను సమర్పించిన తర్వాత బీజేపీ తనను స్పందించాలని ఆదేశిస్తే తాను స్పందిస్తానని చెప్పారు. 


Updated Date - 2022-01-12T20:17:35+05:30 IST