ఆదుకునే వారేరి...?

ABN , First Publish Date - 2022-05-17T05:19:19+05:30 IST

అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి ఆరు నెలలవుతున్నా పునరావాస చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని బాధితులు వాపోతున్నారు.

ఆదుకునే వారేరి...?
పులపత్తూరులో పెనుగాలులకు కూలిపోయిన గుడిసెలు

ఒక్కరికీ ఒక్క ఇల్లు కట్టించలా...

పొలాల్లో ఇసుక తీయించలా.... 

వ్యవసాయానికి కరెంటు ఇప్పించలా...

ఆరు నెలలవుతున్నా పునరావాస చర్యలు శూన్యం

చెయ్యేరు వరద బాధితుల దీనస్థితి


అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి ఆరు నెలలవుతున్నా పునరావాస చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని బాధితులు వాపోతున్నారు. సంఘటన జరిగిన పది రోజులకే ముఖ్యమంత్రి వచ్చి రెండు నెలల్లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని, బాధితులకు ఇళ్లు కట్టించి ఇస్తామని, పొలాల్లో వేసిన ఇసుక మేటలను తొలగిస్తామని, అన్నివిధాలా ఆదుకుంటామని ఇచ్చిన హామీలు నెరవేరలేదని బాధితులు వాపోతున్నారు. ఇళ్లు కోల్పోయిన వారు తాత్కాలికంగా వేసుకున్న టార్పాలిన్‌ గుడిసెలు కూడా పెనుగాలులకు ఎగిరిపోయి బాధితులు పడుతున్న బాధలు వర్ణణాతీతం.


రాజంపేట, మే 16 : భారీ వర్షాలకు గత ఏడాది నవంబరు 19వ తేదీ అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయింది. ఆరు నెలలవుతున్నా అక్కడ పరిస్థితుల్లో ఏమాత్రం పురోగతి లేదు. దేశంలోనే అతి పెద్ద దుర్ఘటనగా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లోనే స్పష్టం చేసినా అందుకు తగ్గట్టు బాధితులకు న్యాయం చేయకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. పులపత్తూరు, తొగూరుపేట, మందపల్లె, గుండ్లూరు, తాళ్లపాక, మదనగోపాలపురం, రామచంద్రాపురం తదితర అనేక గ్రామాల్లో కనీవిని ఎరుగని రీతిలో నష్టం వాటిల్లింది. సుమారు 500కు పైబడి పెద్ద ఎత్తున పక్కా భవనాలు నీటిలో కొట్టుకుపోయాయి. 40 మంది వరకు చనిపోయారు. రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల్లోని చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతాల్లో సుమారు 50 గ్రామాలు ఈ వరద ఉధృతికి పూర్తిగా నష్టపోయాయి. ప్రధానంగా ఆరు గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగింది. అక్కడ ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలకు, పేద వర్గాలకు ఇళ్లు లేకపోవడంతో నాటి నుంచి నేటి వరకు ఆరు నెలలుగా ఎండకు, వానకు, గాలులకు తడుస్తూ ఎండుతూ కనీసం వేసుకున్న చిన్నపాటి టార్పాలిన్‌ గుడిసెలు కూడా లేని పరిస్థితి ఉంది. కేవలం దాతలు ఇచ్చిన సహాయ సహకారాలతో పూటగడుపుకుంటూ ఇంతవరకు కాలం గడుపుతున్నారు. అన్నమయ్య జిల్లాగా ఏర్పడిన తరువాత కలెక్టర్‌ రెండుసార్లు ఈ ప్రాంతానికి వచ్చి వెంటనే ఇక్కడ పునరావాస చర్యలను పూర్తి చేయాలని, ఇళ్లను తక్షణం నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి చర్చించారు. వారికిచ్చే అరకొర సాయంతో ఇళ్లు కట్టించుకోలేరని, కనీసం రూ.5 లక్షలు అయినా ఒక్కో ఇంటికి ఇవ్వాలని కోరడంతో ప్రస్తుతం 5 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం సమ్మతించి జీవోను కూడా జారీ చేసింది. పులపత్తూరులోని మూడు లేఅవుట్లు, ఇతర ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే ఇళ్లు కట్టించే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అయితే పులపత్తూరు గ్రామంలో ఇప్పుడిప్పుడే ఇళ్ల కోసం పునాదులు తీస్తున్నారు. ఇళ్లు కట్టించుకోలేని పేదలకు కాంట్రాక్టర్ల ద్వారా కట్టించాలని, ఎవరైనా సొంతంగా ఇల్లు కట్టుకుంటే వారికి దశలవారీగా బిల్లులు ఇవ్వాలని గృహనిర్మాణ శాఖ నిర్ణయించింది ఏదైతేనేం ఆరు నెలలుగా ఇంటి నిర్మాణాలకు సంబంధించి పురోగతి లేకపోవడం, సర్వస్వం కోల్పోయి ఇల్లు లేని పేదలకు పెద్ద శాపంగా మారింది. తిరిగి వర్షాకాలం మొదలయ్యే అవకాశముంది. ఈ స్థితిలో వారు ఇప్పటికే అన్ని రకాలుగా ఇబ్బందులు పడి వర్షంలో ఎక్కడ తలదాచుకుంటారా అన్న పరిస్థితి అర్థం కావడం లేదు. గృహ నిర్మాణ శాఖ, స్థానిక ప్రజాప్రతినిధులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటే తప్ప వర్షాకాలం నాటికి వీరికి ఇంటి నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం కానరావడం లేదు. 

- వేలాది ఎకరాల వ్యవసాయ భూముల్లో వేసిన ఇసుకమేటను కొన్నిచోట్ల మాత్రమే ఉడ్డలుగా తోశారు తప్ప మిగిలిన చోట ఏ పంట పొలంలోనూ తొలగించలేదు. దీంతో రైతులు తమ పొలాల్లో పంటలను పండించుకోలేని పరిస్థితి ఉంది. ఇటు ఇళ్లు లేక, అటు పొలాల్లేకపోవడంతో అక్కడ రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారు. మామూలుగా ఈపాటికే ఇసుక మేటను తొలగించి ఎవరెవరి పొలాలను వారికి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. 

- మందపల్లె, పులపత్తూరు. తొగూరుపేట, రామచంద్రాపురం తదితర నదీ పరీవాహక ప్రాంతాల్లో తిరిగి వరద వస్తే గ్రామాలపై ప్రభావం చూపకుండా గతంలో ఉన్న జగతికట్టలు (రక్షణగోడ)లను వెనువెంటనే పూర్తి చేయాల్సి ఉంది. గుండ్లూరు, నందలూరు, నాగిరెడ్డిపల్లె, దిగువ ప్రాంతాల్లో వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టి కొన్నిచోట్ల రక్షణ గోడలు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే భారీ వరద వచ్చి ఊరికిఊరే మునిగిపోయిందో అటువంటి మందపల్లె, తొగూరుపేట, పులపత్తూరు, రామచంద్రాపురం ప్రాంతాల్లో రక్షణ గోడలు ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేదు. 

- భారీ వరదల వల్ల ఇక్కడ పూర్తిగా కరెంటు సౌకర్యం లేకుండా పోయింది. గ్రామాలలో యుద్ధప్రాతిపదికన కరెంటు పునరుద్ధరించారు తప్ప వ్యవసాయ పంపుసెట్లకు కనెక్షన్లు ఇవ్వలేదు. మొత్తం సుమారు 2 వేల పైబడి వ్యవసాయ మోటార్లు కొట్టుకుపోయాయి. వాటి ఆనవాళ్లే లేకుండా పోయాయి. అక్కడున్న కరెంటు పోళ్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, అందుకు సంబంధించిన వైర్లు లేకుండా పోయాయి. అయితే కొన్నిచోట్ల స్తంభాలు ఏర్పాటు చేసినా ఇంత వరకు వైర్లు లాగి కరెంటు కనెక్షన్‌ ఇవ్వలేదు. దీనివల్ల కొంత మంది భూములున్నవారు తిరిగి వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీనిపై తక్షణం స్పందించి ఆ గ్రామంలో వ్యవసాయ పంపుసెట్లకు కరెంటు సౌకర్యాన్ని, ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లను కొత్త కరెంటు లైన్లను ఏర్పాటు చేయాల్సిన అసవరం ఉంది. 

- గతంలో ఈ గ్రామాలకు రాజంపేట మండల కేంద్రం నుంచి ఇతర ప్రాంతాల నుంచి అన్ని గ్రామాలకు సిమెంటు, తారురోడ్లతో కూడిన రహదారులుండేవి. ఈ రహదారుల వల్ల ప్రయాణం ఎంతో సులభతరంగా ఉండేది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేసి అందులో కంకర వేశారు తప్ప దానిని కూడా పూర్తి చేయలేదు. ఇంకో ప్రధానమైన సమస్య ఏమిటంటే.. నిరుద్యోగులకు ఇక్కడ పనిలేకుండా ఉంది. ఉపాధి హామీ పనులు కూడా ఇక్కడ జరగడం లేదు. ఎందుకు జరగలేదో స్పష్టం చేసే నాథుడు లేడు. పూర్తిగా నష్టపోయిన గ్రామాలకు ఒక్కో గ్రామానికి జిల్లా స్థాయి అధికారిని క్లష్టర్‌ అధికారిగా నియమించి పూర్తి సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని, వారంవారం సమీక్షలు నిర్వహిస్తామని ఇచ్చిన జిల్లా అధికారుల హామీలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఈ సత్వర చర్యలు తీసుకోకపోతే ఈ ముంపు గ్రామాల పరిస్థితి వచ్చే వర్షాకాలంలో మరింత ఆందోళనకరంగా మారనుంది. 


రూ.5 లక్షలతో ఇళ్లు నిర్మించడానికి చర్యలు చేపట్టాం

- భీము శ్రీదేవమ్మ, సర్పంచ్‌, పులపత్తూరు. 

5 లక్షల రూపాయల ఖర్చుతో ఇళ్లు నిర్మించడానికి చర్యలు చేపట్టాం. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక్కో ఇంటికి 5 లక్షలు ఇవ్వడానికి నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ప్రభుత్వం జీవో జారీ చేసిన వెంటనే ఇంటి నిర్మాణాలు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఇంటి నిర్మాణాల కోసం జేసీబీలతో పునాదులు కూడా తీయించింది. వారం రోజుల్లోపల ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తాం. 


ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టించరా...

- శివరాంగారి లక్షుమ్మ, మందపల్లె గ్రామం

ఇళ్లు కోల్పోయిన వారికి ఆరు నెలలైనా ఇళ్లు నిర్మించకపోవడం దారుణమైన విషయం. ఆరు నెలలు గడుస్తున్నా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఇంటి నిర్మాణాలను చేపట్టలేదు. ఎండకు, వానకు ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణం ఇళ్లు కోల్పోయిన వారికి తిరిగి ఇంటిని నిర్మించి వచ్చే వర్షాకాలంలోనైనా ఆదుకోవాలి.

 

పంట పొలాల్లో ఇసుక మేటలను ఎత్తివేయరా..

- శివరాంగారి వెంకటయ్య, మందపల్లె గ్రామం

పంట పొలాల్లో వేసిన ఇసుక మేటలను ఇంతవరకు తొలగించలేదు. కొన్నిచోట్ల ఇసుక మేటలను తొలగించడానికి చర్యలు చేపట్టి తిరిగి చాలించుకున్నారు. ఇందులో ఏమి మర్మముందో తెలియదు కానీ ఎందుకు పంట పొలాల్లో ఇసుకను తొలగించలేదు. ఇసుక వ్యాపారం బాగా జరుగుతోంది కదా.. దానివల్ల ప్రభుత్వానికి డబ్బు వస్తుంది కదా.. ఆ ఇసుకను తొలగించి మా పంట పొలాలను మాకు ఇస్తే కనీసం వ్యవసాయమైనా చేసుకొని బతుకుతాం కదా... 



Updated Date - 2022-05-17T05:19:19+05:30 IST