ఎవరా దుండగులు..?

ABN , First Publish Date - 2021-12-09T05:02:21+05:30 IST

జిల్లాలోని రెండు ఏటీఎంలలో ఒకేరోజు చోరీ జరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. జిల్లాలో చెడ్డీగ్యాంగ్‌ సంచరిస్తోందని అప్రమత్తంగా ఉండాలంటూ ఎస్పీ ప్రకటన ఇచ్చిన రోజే రెండు ఏటీఎంలలో చోరీ

ఎవరా దుండగులు..?
కడపలోని రామాంజనేయపురం వద్ద దుండగులు ధ్వంసం చేసిన ఏటీఎం

రెండు ఏటీఎంలలో రూ.42 లక్షల అపహరణ

గ్యాస్‌ కట్టర్లతో కట్‌ చేసి మరీ చోరీ

ఇలా జరగడం ఇదే మొదటిసారి

కడప(క్రైం) / సీకేదిన్నె, డిసెంబరు 8: జిల్లాలోని రెండు ఏటీఎంలలో ఒకేరోజు చోరీ జరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. జిల్లాలో చెడ్డీగ్యాంగ్‌ సంచరిస్తోందని అప్రమత్తంగా ఉండాలంటూ ఎస్పీ ప్రకటన ఇచ్చిన రోజే రెండు ఏటీఎంలలో చోరీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాలు ఇలా..

ఎస్‌బీఐకి సంబంధించి రామాంజనేయపురంలో ఏటీఎం కేంద్రం ఉంది. ఇందులో సోమవారం అర్ధరాత్రి దాటాక దుండగులు ఏటీఎంలోకి చొరబడి గ్యాస్‌ కట్టర్లతో మొత్తం మిషనను, ఏసీ, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఏటీఎంలో ఉన్న రూ.24.37 లక్షల నగదు దోచుకెళ్లారు. దీనిపై బ్యాంక్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ వెంకటయ్య ఫిర్యాదు మేరకు రిమ్స్‌ ఎస్‌ఐ మోహన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన పరిధిలో పులివెందుల రోడ్డులోని కేఎ్‌సఆర్‌ఎం ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద గల ఎస్‌బీఐ ఏటీఎంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మాస్కులు, గ్లౌజ్‌లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి గ్యాస్‌కట్టర్‌ ఉపయోగించి ఏటీఎంలోని రూ.17,76,400 నగదును దొంగలించారు. విషయం తెలిసిన వెంటనే సీఐ శ్రీరాం శ్రీనివాసులు, ఎస్‌ఐ మంజునాథరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


ఇదే మొదటిసారి

సాధారణంగా ఏటీఎంలను పగలకొట్టి దొంగతనం చేసేందుకు దుండగులు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇక్కడ రెండు చోట్ల జరిగిన చోరీల్లోనూ ఏటీఎంలను గ్యాస్‌కట్టర్‌తో కట్‌ చేశారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి అని పోలీసులు అంటున్నారు. ఈ రెండు దొంగతనాలు ఒకే తరహాలో ఉన్నాయి. అయితే రామాంజనేయపురం ఏటీఎం వద్ద సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. కేఎ్‌సఆర్‌ఎం ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద గల ఏటీఎంలో సీసీ కెమెరాలకు నల్లరంగు పూసి తమ పని కానిచ్చారు. ఈ రెండు దొంగతనాలు ఒకే గ్యాంగ్‌ చేసిందా లేక రెండు బ్యాచలుగా విడిపోయి చోరీకి పాల్పడ్డారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే నిందితులు బయట రాష్ర్టాలవారు అయి ఉండే అవకాశం ఉందని మొదట రామాంజనేయపురంలోని ఏటీఎంలో చోరీ చేసి తర్వాత పులివెందుల మార్గంలో వెళుతూ కేఎస్‌ఆర్‌ఎం కళాశాల వద్ద ఏటీఎంనూ కొల్లగొట్టి ఉంటారని భావిస్తున్నారు.


గాలింపు ముమ్మరం

ఏటీఎం దొంగతనాలను పోలీసు యంత్రాంగం తీవ్రంగా పరిగణించి గాలింపు చర్యలు మమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని డీఎస్పీతోపాటు క్లూస్‌టీం సిబ్బంది, డాగ్‌స్క్వాడ్‌ పరిశీలించారు. దుండగులు వాడిన వస్తువులు, వారి ఆచూకీకోసం అనేక కోణాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కలవారిని విచారించడంతోపాటు దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తున్నారు. ఏటీఎంలలో చోరీ వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని కడప డీఎస్పీ వి.వెంకటశివారెడ్డి తెలిపారు.

Updated Date - 2021-12-09T05:02:21+05:30 IST