కాకతీయుల తొలి రాజధాని ఏది? పోటీ పరీక్షల కోసం!

ABN , First Publish Date - 2022-10-06T17:27:48+05:30 IST

కాకతీయ చరిత్ర, తెలంగాణ చరిత్రలో మహోజ్వల ఘట్టం. వాస్తవానికి ఈ ఉన్నత శిఖరాలకు కాకతీయుల చరిత్రను చేర్చిన వారు, మలిదశ కాకతీయ రాజులు. తొలిదశ కాకతీయులు

కాకతీయుల తొలి రాజధాని ఏది? పోటీ పరీక్షల కోసం!

కాకతీయ చరిత్ర, తెలంగాణ చరిత్రలో మహోజ్వల ఘట్టం. వాస్తవానికి ఈ ఉన్నత శిఖరాలకు కాకతీయుల చరిత్రను చేర్చిన వారు, మలిదశ కాకతీయ రాజులు. తొలిదశ కాకతీయులు సైనికులుగా, సైన్యాధ్యక్షులుగా, సామంతులుగా తమ ప్రస్థానం కొనసాగించగా, మలిదశ కాకతీయులు సార్వభౌమాధీశులుగా స్థిరపడ్డారు. కాకతీయుల ప్రజాసేవ, చెరువుల నిర్మాణం, పరిపాలన సామర్థ్యం సహజంగానే సార్వభౌమ కాకతీయ రాజుల పాలనలో ఎక్కువగా విస్తరించింది.


మలిదశ కాకతీయ రాజుల చరిత్రకు సంబంధించిన శాసనాలు, నాణాలు, కట్టడాలు, వారు రాసిన గ్రంథాలు, వారి గురించిన సాహిత్యం నేటికీ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో కాకతీయుల  చరిత్రలో మలిదశ ప్రజల జీవన విధానానికి సంబంధించిన వాస్తవాలు అర్థం చేసుకునే అవకాశం చరిత్ర రచయితలకు, అభిమానులకు లభించింది.


గ్రూప్‌-1, గ్రూప్‌-2తో పాటు టీఎస్‌పీఎస్సీ ఇతర పరీక్షలు, పోలీస్‌ బోర్డ్‌, గురుకుల్‌ బోర్డ్‌, ఇతర సంస్థల పరీక్షల కోసం ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులందరూ కాకతీయుల చరిత్రపై సమగ్ర అధ్యయనం కొనసాగించాలి.


మలిదశ సౌర్వభౌమ కాకతీయ రాజులు తమ శక్తి, పరాక్రమాల ద్వారా రాజ్యవిస్తరణ చేశారు. అదే నేపథ్యంలో ప్రజల సేవలో, సంక్షేమంలో తమ పాత్రను నిర్వహించారు. ‘రుద్రమదేవి ఎంతటి ధీరవనితో, అంతే స్థాయిలో ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకొన్న పరిపాలకురాలు’ అని ‘మార్కోపోలో’ అనే వెనిస్‌ యాత్రికుడు ‘ద ట్రావెల్స్‌’ గ్రంథంలో వివరించాడు.


ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం పోటీ పరీక్షలకు సంసిద్ధం అవుతున్న అభ్యర్థులకు మలిదశ కాకతీయుల పాలన, విస్తరణ, వికాసం అంశాలకు సంబంధించిన సమాచారం అందించడం. ఈ సమాచారాన్ని అర్థం చేసుకుని భవిష్యత్‌ ప్రశ్న పత్రాలలో  అడిగే ప్రశ్నలకు అనుగుణంగా అనువర్తింపు చేసుకోవాలి.


మలిదశ కాకతీయులు

రుద్రదేవ(1158-1195): చరిత్రలో ఇతడు ఒకటో ప్రతాపరుద్రుడుగా ప్రసిద్ధి. కాకతీయుల్లో తొలి సార్వభౌమ పాలకులు 1158 నుంచి 1162 మధ్యకాలంలో దాదాపు తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలన్నింటిని జయించిన ఘనత ఇతనిదే. తన విజయాలకు నిదర్శనంగా 1163లో వేయిస్థంభాలగుడి నిర్మించాడు. రుద్రేశ్వర ఆలయం తొలి త్రికూట ఆలయం. త్రికూట ఆలయాలు అంటే శివ, కేశవ, ఆధిత్య ఆలయాలు. ఇతడు  పానగల్లులో రుద్రసముద్రాన్ని, హన్మకొండలో బాలసముద్రాన్ని నిర్మించాడు. ఇతనికి ‘రాయగజకేసరి’ అనే బిరుదు ఉంది. ఇతడు పరిపాలనతో పాటుగా గ్రంథ రచన చేశాడు. ఇతని గ్రంథం ‘నీతిసారము’. ద్రాక్షారామ శాసనం అనుసరించి  ఇతనికి ‘వినయ భూషణుడు’, ‘విద్యాభూషణుడు’ అనే బిరుదులున్నట్లు తెలుస్తుంది. ఇతను 1195లో మహారాష్ట్ర పరిపాలకుడు యాదవరాజు జైతుగి చేతిలో మరణించాడు.


మహదేవుడు(1195-1198): ఇతడు రుద్రదేవుని తమ్ముడు. ఇతని వివరాలు పెద్దపల్లి సమీపంలోని ‘సుందిళ్ల శాసనం’లో, వరంగల్‌ కోటలో లభ్యమైన శాసనంలో ఉన్నాయి. ఇతనిపై శైవమత గురువు రామేశ్వర పండితుని ప్రభావం ఉంది. ఇతని భార్య బయ్యాంబ, కుమారుడు గణపతిదేవ, కుమార్తెలు మైలాంబ, కుందమాంబ.


రుద్రదేవుని హత్యకు ప్రతీకారంగా 1198లో ఇతడు జైతూగిపై ప్రతీకార దండయాత్ర నిర్వహించాడు. ఈ దండయాత్రలో ఇతనికి సహాయంగా గణపతిదేవుడు పాల్గొన్నాడు. అయితే ఈ దేవగిరిలో జరిగిన ఈ యుద్ధంలో మహదేవున్ని జైతూగి సైన్యం చంపివేసింది. గణపతిదేవున్ని బందీ చేసింది. ఈ నేపథ్యంలోనే కాకతీయ రాజ్యాన్ని రేచర్ల రుద్రుడు(సైన్యాధిపతి) రక్షించినట్లుగా పాలంపేట శాసనం తెలియజేస్తుంది. రేచర్ల రుద్రుడిని కాకతీయ రాజ్య రక్షణాధీశుడిగా ఈ శాసనం కీర్తించింది.


గణపతిదేవుడిని జైతూగి కుమార్తె ‘సోమశిలాదేవి’ వివాహం చేసుకున్నట్లుగా చింతలూరి శాసనం తెలియజేస్తుంది. ఈ వివాహ ఫలితంగా గణపతిదేవుడు విడుదలై తెలంగాణకు వచ్చి తిరిగి పరిపాలన బాధ్యతలను స్వీకరించినట్లుగా 1199 మంథని శాసనం వివరిస్తుంది.


గణపతిదేవ(1199 - 1263): కాకతీయ సార్వభౌమ పాలకుల్లో సుధీర్ఘకాలం పాలించిన ఘనత గణపతిదేవునిది. ఇతనికి ‘రాయగజకేసరి’, ‘పృథ్వీశ్వరుడు’, ‘క్రీడావినోధ’, ‘సకలదేశ ప్రతిష్ఠాపనాచార్య’, ‘కాకతీయరాజ్యభార’ అనే బిరుదులున్నాయి.


మంథని శాసనం(1199) ద్వారా ఇతని తొలి పరిపాలన ఆరంభ సంవత్సరంగా గుర్తింపుపొందింది. ఇతని విజయయాత్ర 1201లో ప్రారంభమైంది. బెజవాడను 1201లో జయించి విజయస్తంభం నాటాడు. కృష్ణా జిల్లాలోని దివిసీమను జయించి దాని రాజైన అయ్యదేవుని కుమార్తెలు నాదాంబ, పేరాంబలను వివాహం చేసుకున్నాడు. దివిసీమ రాకుమారుడైన జయాపసేనున్ని తన గజములకు అధిపతిగా(గజసహాని) నియమించాడు. కోస్తాంధ్రాలో బలమైన రాజ్యం వెలనాడును జయించాడు. వెలనాడు రాజ్యాధిపతి పృథ్వీశ్వరుడు గణపతిదేవునికి లొంగిపోయాడు. తూర్పుదిశన కాకతీయ సామ్రాజ్యం కళింగ వరకు విస్తరించింది. నిడదవోలు రాకుమారుడు వీరభద్రునితో తన కుమార్తె రుద్రమదేవి వివాహాన్ని జరిపించాడు. ఇతని ఉత్తరాంధ్ర దండయాత్ర గురించి  మోటుపల్లి అభయ శాసనం తెలియజేస్తుంది. తిక్కన సోమయాజి రాయబారం వల్ల నెల్లూరుపై దండయాత్రచేసి తన స్నేహితుడు మనుమసిద్ధి కుమారుడు తిక్కభూపాలుడిని ఆశ్రయిస్తారు. పాండ్యరాజు జటావర్మ సుందరపాండ్య కాకతీయులపై యుద్ధం ప్రకటిస్తాడు. 1262లో మత్తకూరు వద్ద జరిగిన యుద్ధంలో కాకతీయ సైన్యం ఓడిపోతుంది. ఇది గణపతిదేవుడి జీవితంలో తొలి ఓటమి. ఓటమి భారంతో 1269 ఇతడు మరణించినట్లు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. 1254లో కాకతీయుల రాజధానిని హన్మకొండ నుంచి వరంగల్‌కు మార్చారు. ఈ నేపథ్యంలోనే స్వయంభూ దేవాలయం చుట్టూ కీర్తితోరణాలు నాలుగువైపుల గణపతిదేవుడు నిర్మించినవే.


రుద్రమదేవి(1262-1289): రుద్రమదేవి చారిత్రక ప్రధాన ఆధారం వెనిస్‌ యాత్రికుడు రాసిన ‘ద ట్రావెల్స్‌’. చరిత్రకారుల అభిప్రాయాన్ని అనుసరించి 1261లో ‘పట్లోధృతి’  అనే పేరుతో యువరాణిగా, 1262లో మహారాణిగా బాధ్యతలు స్వీకరించింది. తొలి అధికారిక రోజుల్లోనే నరహరిదేవుడు, మురహరిదేవుడు అనే సవతి తల్లి కుమారులు తిరుగుబాటు చేయగా వారిని అణచివేసింది. 1262లో మహదేవుడనే దేవగిరి పాలకుడిని జయించినట్లుగా బీదర్‌ శాసనం తెలియజేస్తుంది. మల్లికార్జునుడు, ప్రసాధిత్యుడు, గోనగన్నారెడ్డి ఈమె ప్రధాన సేనానులు. భైరవుడు ముఖ్య అంగరక్షకుడు. ఇందులూరి అన్నయ్య దేవుడు ప్రధాని. గోపదేవరాజు సలహాదారుడు.


మల్కాపురం(అమరావతి) శాసనం... ఈమె ప్రజలకోసం చేసిన సేవలను వివరిస్తుంది. మహిళలకు ప్రసూతి వైద్యశాలలు నిర్మించడం ఈమె ప్రత్యేకత. అనేక యుద్ధాల అనంతరం రాజ్యంలో సుస్థిరతకోసం, సుపరిపాలన కోసం రుద్రమదేవి కృషిచేసింది.


తిరుగుబాటుచేసిన త్రిపురాంతపురం పాలకుడు అంబదేవుడితో జరిగిన యుద్దంలో రుద్రమదేవి మరణించినట్లుగా చందుపట్ల శాసనం తెలియజేస్తుంది.


రుద్రమదేవి వ్యక్తిత్వం: మధ్యయుగంలోని పురుషాధిక్య విలువలకు భిన్నంగా స్త్రీ పరిపాలకురాలిగా రుద్రమదేవి ఘనత వహించింది. భారతదేశంలో రెండో స్వతంత్రపాలకురాలిగా చరిత్రలో గుర్తింపు పొందింది. ఈమె ప్రజలకు అందుబాటులో ఉండేదని, పురుష వేషం ధరించి యుద్ధాల్లో పాల్గొనేదని వ్యాపారస్తులను అధికంగా ప్రోత్సహించేదని ‘ద ట్రావెల్స్‌’ గ్రంథం పేర్కొంది.


ప్రతాపరుద్రుడు(1289-1323): కాకతీయ వంశంలో చివరి వాడు ప్రతాపరుద్రుడు(రెండో ప్రతాపరుద్రుడు). రుద్రమదేవి వారసుడిగా ఆమె మరణాంతరం రాజ్యానికి వచ్చాడు. అంబదేవునిపై ప్రతీకార దండయాత్ర చేసి సంహరించాడు. అంబదేవునికి సహాయంగా వచ్చిన పాండ్యుల సైన్యాన్ని, దేవగిరి సైన్యాన్ని ఈ సందర్బంలోనే ఓడించాడు. ఈ విజయంతో అతని పరిపాలన స్థిరపడింది.


ఢిల్లీ పరిణామం: ఢిల్లీలో ఏర్పడిన మొదటి సుల్తానత్‌ బానిస వంశానిది. వారి అనంతరం ఖిల్జీల పరిపాలన ఆరంభమైంది. వీరిలో అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ అత్యంత శక్తి సంపన్నుడు. అతని ఉత్తర భారతదేశ దండయాత్ర అనంతరం దక్షిణ భారతదేశ దండయాత్రలు ఆరంభమయ్యాయి. ఈ ప్రభావం కాకతీయ రాజ్యంపై పడింది. తరువాత కాలంలో తుగ్లక్‌ వంశస్తులు ఈ దండయాత్రను కొనసాగించారు. ఢిల్లీ సుల్తాన్‌లకు, కాకతీయులకు మధ్య ఐదు యుద్ధాలు జరిగాయి. మొదటి యుద్ధం 1303లో కరీంనగర్‌ జిల్లాలోని ఉప్పరపల్లి వద్ద జరిగింది. అల్లాఉద్దీన్‌ ఖిల్జీ తరపున మాలిక్‌ ఫక్రుద్దీన్‌ జునా, జాజుఖాన్‌ నాయకత్వం వహించారు. కాకతీయుల తరపున రేచర్ల వెన్నభూపాలుడు, రంగయ దేవుడు, మైలయ నాయకుడు నాయకత్వం వహించారు. ఈ యుద్ధంలో కాకతీయ సైన్యం విజయం సాధించింది. రెండో యుద్ధం 1309 అక్టోబరు నుంచి 1310 ఫిబ్రవరి వరకు జరిగింది. ఈ దండయాత్ర అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ సేనాని మాలిక్‌కాఫర్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఇతను ‘కోట దిగ్బంధనం’ అనే వ్యూహాన్ని అవలంభించాడు. ప్రతాపరుద్రుడు లొంగిపోయాడు. మూడో దండయాత్ర 1320లో జరిగింది. ఢిల్లీలో జరిగిన పరిణామాల దృష్ట్యా  ప్రతాపరుద్రుడు కప్పం చెల్లించడం ఆపివేశాడు. దీంతో ‘ముబారక్‌ షా’(నూతన పాలకుడు) ఖుస్రూఖాన్‌ను వరంగల్‌పై దండయాత్రకు పంపాడు. చివరకు ప్రతాపరుద్రుడు లొంగిపోయాడు. నాలుగో దండయాత్ర 1321లో జరిగింది. తుగ్లక్‌  యువరాజైన ఉలుగ్‌ఖాన్‌/జునాఖాన్‌ నాయకత్వంలో జరిగింది. ‘ఉబేద్‌’(జ్యోతిష్కుడు) పుకారువల్ల ఈ దండయాత్ర విఫలమైంది. ఐదో దండయాత్ర 1323లో జరిగింది. ఇది చివరి దండయాత్ర. ఈ దండయాత్ర ఫలితంగా కాకతీయ సామ్రాజ్యం పతనమైంది.


అనంతర పరిణామాలు: ఈ దండయాత్రలో ఢిల్లీ సుల్తాన్‌కి సహకరించిన ‘నాగయ గన్నయ’ మాలిక్‌ మగ్బుల్‌ మార్చబడి వరంగల్‌కి ప్రతినిధిగా నియమితుడయ్యాడు. వరంగల్‌ పేరును సుల్తాన్‌పూర్‌గా మార్చాడు. 1325లో ఉల్గుఖాన్‌/జునాఖాన్‌ మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌గా ప్రకటించుకుని ఢిల్లీ సామ్రాజ్యాధినేత మారాడు. కలువచెరువు విలాప శాసనం ప్రకారం... ప్రతాపరుద్రుడిని ఢిల్లీకి తరలిస్తున్న సమయంలో ఆయన నర్మదా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.


1163 నుంచి 1323 వరకు వరంగల్‌ కేంద్రంగా పరిపాలించిన కాకతీయులు   రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాలపై తమదైన ముద్రవేశారు.


పరిపాలన: కాకతీయ పరిపాలన వ్యవస్థ ‘నాయంకర’ వ్యవస్థపై ఆధారపడి ఉండేది. రాజ్యాన్ని మొత్తం 12 నియోగాలుగా వర్గీకరించారు. నియోగాధిపతి ధనిక అధికారి అన్ని నియోగాలకు అధిపతి. మహత్తర నియోగాధిపతి అనే పేరుతో గుర్తించేవారు. గణపతిదేవుని కాలంలో ‘గంగ సహాని’, రుద్రమదేవి కాలంలో గన్నయమంత్రి, ప్రతాపరుద్రుని కాలంలో ‘పొంకయ’, మల్లయప్రెగడ అధిపతులుగా ఉండేవారు. నియోగాలను స్థలాలుగా వర్గీకరించారు. ఊరు అనే పదం, వీరికాలంలోనే వాడుకలోకి వచ్చినట్లుగా మహబూబాబాద్‌ శాసనం తెలియజేస్తుంది. ఊరు అధిపతిని అయ్యగారు అనే పేరుతో పిలిచేవారు గ్రామంలో గ్రామసభను మహాజనసభ పేరుతో గుర్తించేవారు. 1246లో కరీంనగర్‌ జిల్లాలోని గునుగు కాలువ శాసనం ఈ విషయాలను వివరిస్తుంది. ప్రతి స్థలం/నాడు 20 గ్రామాలకు కూడలిగా ఉండేది. గ్రామ రక్షణాధికారిని ‘తలారి’గా పిలిచేవారు. నగర పాలకులను ‘నగరి’గా గుర్తించేవారు. రాజు అంగరక్షకులను ‘లెంకలు’గా గుర్తించేవారు. రాజసేవకులకు జీతాలు కాకుండా భూములను ఇచ్చేవారు.


ఢిల్లీలో ఏర్పడిన మొదటి సుల్తానత్‌ బానిస వంశానిది. వారి అనంతరం ఖిల్జీల పరిపాలన ఆరంభమైంది. వీరిలో అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ అత్యంత శక్తి సంపన్నుడు. అతని ఉత్తర భారతదేశ దండయాత్ర అనంతరం దక్షిణ భారతదేశ దండయాత్రలు ఆరంభమయ్యాయి. ఈ ప్రభావం కాకతీయ రాజ్యంపై పడింది. తరువాత కాలంలో తుగ్లక్‌ వంశస్తులు ఈ దండయాత్రను కొనసాగించారు.


కాకతీయుల రాజధానులు

కాకతీయుల తొలి రాజధాని ‘అనుమకొండ’. హన్మకొండ పట్టణం గురించి భీమరసుని శాసనం(872) తొలిసారిగా ప్రస్తావించింది. ఈ శాసనం రాష్ట్రకూట రాజు కాలానికి చెందింది. గూడూరు శాసనం(1124) ప్రకారం..కాకతీయుల తొలిరాజధాని హన్మకొండలో ‘కడలాలయ బసది’, వేయిస్తంభల గుడి, ప్రసన్నకేశవ దేవాలయం, భేతేశ్వర ఆలయం, భౌడేశ్వర ఆలయం ఉన్నాయి.

1254లో రాజధానిని హన్మకొండ నుంచి వరంగల్‌కు మార్చారు. చింతలూరి శాసనం ప్రకారం... ఏకశిలా వద్ద రెండో ప్రోలుడు స్వయంభూ దేవాలయాన్ని నిర్మించి వరంగల్‌ కోటను ఆరంభించాడు. రుద్రదేవుడు కోట నిర్మాణాన్ని  పూర్తిచేశాడు. ఈ కోట చుట్టూ ఏడు ప్రవారాలు(కాంపౌండ్‌) ఉన్నట్లు క్రీడాభిరామం పేర్కొంది. వీటిలో రాతికోటను రుద్రమదేవి నిర్మించింది. ప్రస్తుతం మూడు కోటలు మాత్రమే సజీవంగా ఉన్నాయి. స్వయంభూ దేవాలయానికి నాలుగు వైపులా నాలుగు కీర్తితోరణాలను నిర్మించారు. ఇవి గణపతిదేవుని నిర్మాణాలు. తరవాత కాలంలో ‘పితాబ్‌ ఖాన్‌’ అనే పాలకుడు ‘ఖుషి మహల్‌’ను నిర్మించాడు.




-డాక్టర్‌ రియాజ్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ, అకడమిక్‌ డైరెక్టర్‌, 

5 మంత్ర కెరీర్‌ పాయింట్‌, హైదరాబాద్‌



Updated Date - 2022-10-06T17:27:48+05:30 IST