Advertisement
Advertisement
Abn logo
Advertisement

వయసు ఆరున్నరేళ్లు.. బరువు ముప్ఫయి కేజీలు.. తగ్గాలంటే ఏం చేయాలి?

ఆంధ్రజ్యోతి(12-11-2021)

ప్రశ్న: మా పాపకు ఆరున్నరేళ్ళు. ముప్ఫయి కేజీల బరువు ఉంది. కొవిడ్‌ లాక్డౌన్‌తో, క్లాసులు ఆన్‌లైన్‌లోనే అటెండ్‌ అవడం వల్ల బరువు పెరిగింది. పాప ఆరోగ్యంగా ఉండడానికి చక్కని జీవనశైలి సూచించండి. 


- అపర్ణ, విజయవాడ


డాక్టర్ సమాధానం: పదేళ్ల లోపు పిల్లల బరువు వారి ఆటల వల్ల ఎక్కువగా నియంత్రణలో ఉంటుంది. కొవిడ్‌ లాక్డౌన్‌ కారణంగా పిల్లల చదువులకేకాక ఆటలకూ ఇబ్బంది ఏర్పడింది. ఆటలాడే సమయం తగ్గింది. ఇంట్లోనే కంప్యూటర్‌ లేదా టీవీ ముందు కదలకుండా ఎక్కువసేపు గడుపుతున్నారు. అలా టీవీ చూస్తూ జంక్‌ ఫుడ్స్‌ ఎక్కువగా తినడం వల్ల గత సంవత్సరకాలంలో చాలా మంది పిల్లలు అకస్మాత్తుగా బరువు పెరిగారు. మీ పాప వయసును బట్టి ఆమె ఇరవై రెండు కేజీల బరువు లోపలే ఉంటే ఆరోగ్యకరం. వేళకు ఆహారం ఇవ్వడం, అధిక కెలోరీలు ఉండే చిరుతిళ్లకు దూరంగా ఉంచడం మంచిది. రోజుకు కనీసం రెండు, మూడు గంటల సమయం ఆటలాడేలా చూడండి. పండ్లు, కూరగాయలు, పాలు ఆహారంలో భాగం కావాలి. నూనెలో వేయించే వడ, పూరి, బోండాలాంటి టిఫిన్లు, ఇంట్లో వండినవైనా నూనెలో వేయించే చిరుతిళ్ళు మానెయ్యాలి. అనారోగ్యకరమైన స్వీట్లు, బిస్కెట్లు, కారప్పూస లాంటి వాటిని ఇంటికి తీసుకురావడం వల్ల ఆకలి లేకపోయినా ఏదో ఒకటి తినడం పిల్లలకు అలవాటవుతుంది. కూల్‌ డ్రింకులు, ఫ్రూట్‌ జ్యూస్‌లు కూడా మానెయ్యాలి. తాజాగా తయారు చేసినవైనా పిల్లలకు పండ్ల రసాల కంటే పండ్లుగా తినడమే ఉపయోగకరం. ఆటలకు కుదరదనుకుంటే కనీసం డాన్స్‌, ఇంట్లోనే చిన్నచిన్న ఎక్సరసైజులు చేయించడం మంచిది.


డాక్టర్ లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Advertisement
Advertisement