పద్నాలుగేళ్ల బాబుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి?

ABN , First Publish Date - 2022-02-18T19:18:37+05:30 IST

పది నుండి పద్దెనిమిదేళ్లలోపు మగపిల్లలకు జీవక్రియ వేగం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా క్రీడాకారులకు కెలోరీల అవసరం ఎక్కువ. తగినంత శక్తినిచ్చే ఆహారం తీసుకోకపోతే వారి ఎదుగుదల సరిగా ఉండదు. ఈ వయసులో పిల్లలకు ప్రొటీన్‌ అవసరం అధికం.

పద్నాలుగేళ్ల బాబుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి?

ఆంధ్రజ్యోతి(18-02-2022)

ప్రశ్న: మా బాబుకు 14 ఏళ్ళు, క్రీడాకారుడు. ఎలాంటి ఆహారం ఇస్తే వాడు ఆటల్లో పైకి వస్తాడు?


- శిరీష, సిద్దిపేట


డాక్టర్ సమాధానం: పది నుండి పద్దెనిమిదేళ్లలోపు మగపిల్లలకు జీవక్రియ వేగం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా క్రీడాకారులకు కెలోరీల అవసరం  ఎక్కువ. తగినంత శక్తినిచ్చే ఆహారం తీసుకోకపోతే వారి ఎదుగుదల సరిగా ఉండదు. ఈ వయసులో పిల్లలకు ప్రొటీన్‌ అవసరం అధికం. రోజూ గుడ్లు, పాలు, పెరుగు, అన్ని రకాల పప్పులు (కంది, పెసర, సెనగ మొదలైనవి) ఇచ్చినట్లయితే వారి ప్రొటీన్‌ అవసరాలకు సరిపోతుంది. మాంసాహారం తినేవారైతే చికెన్‌, చేప, మటన్‌ మొదలైనవి నూనె తక్కువ వేసి వండి పెట్టవచ్చు. పై ఆహారంలో ప్రొటీన్లతో పాటు కాల్షియం, ఇనుము కూడా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాల కోసం తాజాపండ్లు, అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు ఆహారంలో తప్పనిసరి. కేవలం అన్నం, రొట్టెలు మాత్రమే ఎక్కువగా పెట్టడం కాకుండా వాటితో పాటు కూర, పప్పు అధికంగా తినడానికి ప్రోత్సహించాలి. అల్పాహారంగా పండ్లు, మొలకెత్తిన గింజలు, బఠాణీలు, సెనగలు, మరమరాలు, మొక్కజొన్న పేలాలు, ఇంట్లో తయారుచేసిన రొట్టెలు, శాండ్విచ్లు మాత్రమే ఇవ్వాలి. ఆటలాడేటప్పుడు చెమట ద్వారా  శరీరంలోని నీటిని ఎక్కువగా కోల్పోతారు. కాబట్టి డీహైడ్రేషన్‌ రాకుండా  తగినంత నీటితో పాటు సూపులు, కొబ్బరినీళ్లు లాంటి ద్రవపదార్థాలు, పుచ్చ, ద్రాక్ష, దానిమ్మ పండ్లు కూడా తీసుకోవాలి. చక్కటి ఆహారంతో పాటు విశ్రాంతి అవసరం. టీవీలు, సెల్‌ఫోన్లు దూరంగా ఉంచి రాత్రిపూట కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోయేలా చూడండి.  


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-02-18T19:18:37+05:30 IST