Advertisement
Advertisement
Abn logo
Advertisement

మెదడు చురుకుగా ఉండాలంటే ఏ ఆహారం తినాలి?

ఆంధ్రజ్యోతి(30-04-2021)

ప్రశ్న: మా బాబు సీనియర్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. త్వరలో పరీక్షలు. మెదడు చురుకుదనాన్ని పెంచే ఆహారం తెలపండి. 


- అమోఘ, బెంగళూరు


డాక్టర్ సమాధానం: పది నుండి పద్దెనిమిదేళ్లలోపు మగపిల్లలకు జీవక్రియ వేగం అధికంగా ఉంటుంది. ఈ వయసులో పిల్లలు సాధారణంగా చదువుల్లో పడి ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీని వల్ల ఎదుగుదల సరిగా లేకపోవడమే కాక, వారు తీసుకునే ఆహారాన్ని బట్టి బరువు పెరగడం లేదా తగ్గడం, నీరసం, విటమిన్ల లోపం లాంటి ఇబ్బందులు రావచ్చు. ఈ వయసులో పిల్లలకు ప్రోటీన్‌ అవసరం ఎక్కువ. రోజూ గుడ్లు, పాలు, పెరుగు, అన్ని రకాల పప్పులు (కంది, పెసర, సెనగ మొదలైనవి) ఇచ్చినట్లయితే వారి ప్రోటీన్‌ అవసరాలకు సరిపోతుంది. మాంసాహారం తినేవారైతే చికెన్‌, చేప, మటన్‌ మొదలైనవి నూనె తక్కువ వేసి వండి పెట్టవచ్చు. కాల్షియం, ఇనుము కూడా ఈ వయసు పిల్లలకు అవసరం. విటమిన్లు, ఖనిజాల కోసం తాజా పండ్లు, అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు ఆహారంలో భాగం చేయాలి. కేవలం అన్నం, రొట్టెలు మాత్రమే కాకుండా కూర, పప్పు ఎక్కువగా తినేలా ప్రోత్సహించాలి. చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్‌, శీతలపానీయాలు వద్దు. వాటికి బదులుగా పండ్లు, మొలకెత్తిన గింజలు, బఠాణీలు, సెనగలు, మరమరాలు, మొక్కజొన్న పేలాలు, ఇంట్లో తయారు చేసిన రొట్టెలు, శాండ్విచ్‌లు మొదలైనవి ఇస్తే మంచిది. బాదం, ఆక్రోట్‌ లాంటి గింజల్లో ఉండే ఆవశ్యక ఫ్యాటీ యాసిడ్లు పిల్లల మెదడు చురుగ్గా ఉండేలా చేస్తాయి. ఈ వయసు పిల్లలకి వ్యాయామం అత్యవసరం. రోజూ కనీసం గంట సేపు ఆరు బయట ఆటలాడేలా, ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూడండి.


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement