నిల్వ చేసేదెక్కడ?

ABN , First Publish Date - 2021-12-24T05:39:46+05:30 IST

ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు కొత్తచిక్కు వచ్చిపడింది. యాసంగిలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యంతో జిల్లాలోని గోదాములు, మిల్లులు నిండాయి.

నిల్వ చేసేదెక్కడ?
ధాన్యంతో నిండిపోయిన రైస్‌మిల్లు

నిండిన గోదాములు, మిల్లులు

చేతులెత్తేసిన మిల్లర్లు

జిల్లాలో సేకరించిన ధాన్యం సూర్యాపేటకు తరలింపు 

యాదాద్రి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు కొత్తచిక్కు వచ్చిపడింది. యాసంగిలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యంతో జిల్లాలోని గోదాములు, మిల్లులు నిండాయి. దీంతో మిల్లర్లు ధాన్యం పంపొద్దని చేతులెత్తేయగా, ఇకపై కొనుగోలుచేయనున్న ధాన్యాన్ని ఎక్కడ నిల్వచేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 2.60లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దీంతో 5లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, అందులో 4లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వరంగ సంస్థలు కొనుగోలుచేయవచ్చని అధికారులు అంచనా వేశారు. అందుకనుగుణంగా జిల్లా వ్యాప్తంగా 279 ధాన్యం కేంద్రాలు ప్రారంభించారు. పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 184, ఐకేపీ91,మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 31,078మంది రైతుల నుంచి 2,30,249మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అందులో 2,20,910మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించారు. ఇంకా 9339మెట్రిక్‌టన్నుల వరకు ధాన్యం మిల్లులకు తరలించాల్సి ఉంది.

ధాన్యం నిల్వకు స్థలం లేక

జిల్లాలో ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యంతో గోదాములు, రైస్‌మిల్లులు నిండాయి. తమ వద్ద స్థలంలేదని, ఇకపై ధాన్యం పంపొద్దని మిల్లర్లు తేల్చిచెప్పారు. రైతుల నుంచి సేకరించాల్సిన ధాన్యం సుమారు 2లక్షల మెట్రిక్‌టన్నుల వరకు ఉంది. ఇప్పటికే స్థలాభావంతో ఇబ్బంది పడుతున్నందున, సేకరించిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో తెలియక జిల్లా యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. రైస్‌మిల్లులు, గోదాముల్లో ఖాళీ లేకపోవడంతో సమీప జిల్లాల్లో నిల్వచేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు సూర్యాపేట, నల్లగొండ జిల్లా అధికారులతో చర్చించి, ధాన్యం నిల్వ చేసేందుకు స్థలాన్ని కేటాయించాలని కోరారు. దీంతో సూర్యాపేట జిల్లాలో ఖాళీగా ఉన్న రైస్‌మిల్లులకు ఇప్పటివరకు జిల్లా నుంచి 8000మెట్రిక్‌టన్నులకు పైగా ధాన్యాన్ని తరలించారు. సమీప జిల్లాల్లోని గోదాములు నిండిన పక్షంలో ప్రైవేట్‌ భవనాల్లో నిల్వచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ధాన్యం నిల్వకు ఇబ్బందులు ఏర్పడటంతో కొనుగోళ్లలో జాప్యం ఏర్పడుతోంది.

దక్కని మద్దతు ధర

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జాప్యం చోటుచేసుకుంటుండటంతో రైతులు కమీషన్‌ ఏజెంట్లు, దళారులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. ఏ-గ్రేడ్‌ రకానికి ప్రభుత్వ మద్దతు ధర ధర రూ.1960, బీ-గ్రేడ్‌ రకానికి రూ.1940గా ఉంది. కాగా, దళారులు క్వింటాకు రూ.1300 నుంచి రూ.1400వరకే చెల్లిస్తున్నారు. క్వింటాకు రూ.400నుంచి రూ.500వరకు రైతులు నష్టపోయారు. జిల్లాలో ఇప్పటివరకు 75,000మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని దళారులు, వ్యాపారులు కొనుగోలు చేసినట్టు సమాచారం.

ధాన్యం కొనుగోళ్లను వేగవంతంచేస్తాం : గోపీకృష్ణ, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ 

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని గోదాములు, రైస్‌మిల్లులు ధాన్యంతో నిండాయి. దీంతో సూర్యాపేట జిల్లాలోని గోదాములు,మిల్లులకు ఇక్కడి ధాన్యాన్ని తరలిస్తున్నాం. ప్రస్తుతం సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌ మిల్లులకు తరలిస్తున్నాం. కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నాం.

Updated Date - 2021-12-24T05:39:46+05:30 IST